పండగొచ్చింది.. నచ్చిన వంటలు చేసుకుందామా!

10 Jan, 2021 10:55 IST|Sakshi

మూడు రోజుల పండుగ... ముచ్చటైన పండుగ... ముగ్గుల పండుగ...  బొమ్మల కొలువు పండుగ.. గొబ్బెమ్మల పండుగ... హరిదాసులు గంగిరెద్దుల పండుగ... అల్లుళ్లతో సందడైన పండుగ.. దండిగా వంటలు వండే పండుగ... సంక్రాంతికి సంప్రదాయంగా చేసే వంటలతో పాటు, కొత్త వంటలను కూడా ప్రయత్నించి చూద్దాం.. నోటిని పండుగతో తీపి చేస్తూ, పండుగను సందడిగా చేసుకుందాం...

అరిసెలు
కావలసినవి: బియ్యం – 600 గ్రా.; బెల్లం – 300 గ్రా.; నీళ్లు – 50 మి.లీ.(సుమారుగా); ఏలకుల పొడి – అర టీ స్పూను; నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు; నెయ్యి – అర కప్పు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా 

తయారీ: బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి ∙ఉదయాన్నే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి, జల్లెడలో వేసి నీళ్లు మొత్తం పూర్తిగా కారిపోయేవరకు ఉంచాలి ∙బియ్యాన్ని కొద్దికొద్దిగా చిన్న మిక్సీ జార్‌లో వేసి బాగా మెత్తగా పొడి కొట్టి, జల్లెడ పట్టి, మెత్తటి పిండిని చేతితో గట్టిగా నొక్కి పక్కన ఉంచాలి (తడి ఆరిపోకూడదు)

పాకం తయారీ: ∙ఒక గిన్నెలో బెల్లం పొడి, కొద్దిగా నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగే వరకు ఉంచాలి ∙పాకం అడుగు అంటకుండా మధ్యమధ్యలో తిప్పుతూ ఉండాలి ∙ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి, అందులో పాకం వేస్తే అది కరిగిపోకుండా, ఉండలా అయితే, పాకం సరిగ్గా తయారయినట్లు లెక్క ∙మంట సిమ్‌లోకి ఉంచి, నెయ్యి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి స్టౌ కట్టేసి గిన్నె కిందకు దింపాలి ∙బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ పిండి గట్టిగా అయ్యేవరకు కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, మంటను మీడియంలో ఉంచాలి ∙పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని, నూనె పూసిన ప్లాస్టిక్‌ పేపర్‌ మీద ఉంచి, చేతితో ఒత్తి, కాగిన నూనెలో వేసి పైకి తేలేవరకు కదపకుండా ఉంచాలి ∙పైకి తేలాక ఒక నిమిషం పాటు ఆగి, రెండో వైపుకి తిప్పాలి ∙బంగారు రంగులోకి మారేవరకు వేయించి, బయటకు తీసి, రెండు గరిటెల మధ్యన కాని, అరిసెల చట్రంతో కాని నూనె పోయేవరకు గట్టిగా ఒత్తాలి (నువ్వుల అరిసెలు కావాలంటే, పిండిని కలుపుతున్నప్పుడే నువ్వులు కూడా వేసి కలిపేయాలి) బాగా చల్లారాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

గుడ్‌ కా హల్వా
కావలసినవి:  ∙బొంబాయి రవ్వ – 150 గ్రా.; సెనగ పిండి – 50 గ్రా.; బెల్లం తురుము – 80 గ్రా.; పంచదార – ఒక టీ స్పూను; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; డ్రై ఫ్రూట్స్‌ తరుగు – ఒక టేబుల్‌ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; నెయ్యి – 200 గ్రా.
తయారీ: ∙స్టౌ మీద పాత్రలో అర గ్లాసు నీళ్లు పోసి మరిగాక, బెల్లం తురుము, పంచదార వేసి బాగా కలియబెట్టాలి ∙స్టౌ మీద మరొక పాత్రలో నెయ్యి వేసి కరిగాక సెనగ పిండి వేసి దోరగా వేయించాక, అదే బాణలిలో బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించాలి ∙డ్రైఫ్రూట్స్‌ జత చేసి మరోమారు వేయించాలి ∙చివరగా పంచదార + బెల్లం కరిగించిన నీళ్లను జత చేసి, ఆపకుండా కలుపుతుండాలి ∙ఒక టీ స్పూను నీళ్లలో కుంకుమ పువ్వు కరిగించి, ఉడుకుతున్న హల్వాకు జత చేసి కలిపి దింపేయాలి.

గోకుల్‌ పీఠే
కావలసినవి: కొబ్బరి తురుము – పావు కేజీ; పచ్చి కోవా – అర కిలో; ఖర్జూర తాటి బెల్లం – పావు కేజీ; పంచదార – పావు కేజీ; మైదా పిండి – ముప్పావు కప్పు; నెయ్యి – ఒక కప్పు.
తయారీ: పంచదార పాకం కోసం.. స్టౌ మీద ఒక పాత్రలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి మరిగించాలి ∙ఒకటిన్నర కప్పుల పంచదార జత చేసి, తీగ పాకం వచ్చేవరకు బాగా కలిపి దింపేయాలి ∙పచ్చి కొబ్బరి తురుము, ఖర్జూరం తాటి బెల్లం జత చేయాలి ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక, ఈ మిశ్రమాన్ని అందులో వేసి నాలుగైదు నిమిషాలు ఉడికించాలి ∙పచ్చి కోవా జత చేసి ఉండలు లేకుండా కలపాలి  ∙ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుంటూ, అప్పాల మాదిరిగా ఒత్తాలి ∙ఒక పాత్రలో మైదా పిండికి ఒక కప్పుడు నీళ్లు జత చేస్తూ బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి, నాలుగు నిమిషాల పాటు కరిగించాలి ∙తయారుచేసి ఉంచుకున్న అప్పాలను బజ్జీల మాదిరిగా మైదా పిండిలో ముంచి తీసి, నూనెలో వేసి దోరగా వేయించాలి ∙కిచెన్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

పిన్నే
కావలసినవి: మినప్పప్పు – అర కేజీ; పచ్చి కోవా తురుము – ఒక టీ స్పూను; బాదం పప్పుల పొడి – ఒక టీ స్పూను; పంచదార నీళ్లు – 3 టీ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను; గార్నిషింగ్‌ కోసం బాదం పప్పులు – కొద్దిగా.
తయారీ: ∙మినప్పప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి ఆరు గంటలు నానిన తరవాత, నీళ్లు వడకట్టి, పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగించాలి ∙మినప్పప్పు జత చేసి సన్నని మంట మీద బంగారు రంగులోకి వచ్చేవరకు ఆపకుండా కలుపుతుండాలి ∙కోవా తురుము జత చేయాలి ∙బాదం పప్పుల పొడి జత చేయాలి ∙పంచదార నీళ్లు, ఏలకుల పొడి జత చేసి ఆపకుండా కలిపి దింపి చల్లార్చాలి ∙ఉండలుగా చేసి, బాదం పప్పులతో అలంకరించాలి.

మరిన్ని వార్తలు