బంజారా సొగసు చూడ తరమా..

6 Mar, 2021 14:06 IST|Sakshi

బంజారా రంగుల కళ 
మన ప్రాచీన సంస్కృతి
గిరులలో వికసించి 
పురజనులలో మెరిసి మురిసింది
ఎల్లలు దాటి విరాజిల్లుతూనే ఉంది
ఎల్లవేళలా కనులవిందు చేస్తూనే ఉంది
ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ అని చాటుతూనే ఉంది

రాజస్థానీ ఎంబ్రాయిడరీ కళ గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. రాజస్థానీయుల్లో చాలా మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వలసలు వచ్చి స్థిరపడ్డారు. అలా ఎంతో ప్రాచీనమైన వీరి వేషధారణ దేశమంతా తెలుసు. ఇప్పటికీ బంజారాలలో పూర్తి వేషధారణను 50 ఏళ్ల వారు ధరించడం చూస్తుంటాం. ఈ ఎంబ్రాయిడరీ కళ ఫ్యాషన్‌ పరిశ్రమలోకి ఎలా వచ్చింది? ఇంకా ఎంతలా కట్టిపడేస్తోంది? బంజారా దారపు పోగుల గొప్పతనం, అద్దాల మెరుపులు ఫ్యాషన్‌ వేదికల పై ఎంతగా హొయలు పోతున్నాయి.. వంటి విషయాలు ఫ్యాషన్‌ డిజైనర్‌ మంగారెడ్డి మాటల్లో.. 

బంజారా ఎంబ్రాయిడరీ వర్క్‌ కళ గురించి? 
రాజస్థానీ సంస్కృతిలోనే రంగుల వెలుగులు ఉన్నాయి. వీరు పింక్, ఎల్లో, రెడ్‌.. వంటి సహజసిద్ధమైన, కాంతిమంతమైన రంగులతో ‘లెహిరియా’ అనే టై అండ్‌ డై పద్ధతిని వాడుతుంటారు. రాజస్థాన్‌ ఎడారి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడి వేడి వాతావరణానికి తగ్గట్టుగా బ్యాక్‌లెస్‌ బ్లౌజ్‌లు వాడుతుంటారు. సంస్కృతి అనేది సౌకర్యాన్ని బట్టి మారుతుంటుంది.  

మోడర్న్‌ ఫ్యాషన్‌ రంగాన్ని బంజారా వర్క్‌ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?
ఫ్యాషన్‌ అంటేనే మన సంస్కృతి నుంచే ఏదో ఒకదానిని తీసుకుంటూ, కలుపుకుంటూ వెళ్లడం. బంజారా డ్రెస్సింగ్, ఆ వర్క్‌ సంస్కృతికి కళ తీసుకువచ్చేది. ఆ కళను ఆధునిక దుస్తులకు ఎంతో కొంత జతచేసినా మంచి లుక్‌ వస్తుంది. అందుకే, మోడర్న్‌ కట్‌కి ఇండియన్‌ వర్క్‌ని జత చేస్తూ వచ్చారు డిజైనర్లు. నెక్‌కి లేదా బార్డర్‌ లేదా ఫుల్‌ బ్లౌజ్‌ ఎంబ్రాయిడరీ వాడి మిగతా ప్లెయిన్‌గానో చేస్తూ వైవిధ్యం తీసుకువచ్చారు. బంజారా అమ్మాయిలే ఒకప్పటిలా డ్రెస్‌ ధరించడానికి ఇష్టపడరు. ఈ కాలానికి తగ్గట్టుగా ఉండాలనుకుంటారు. అలాగని, వారి మూలాలను కాదనుకోలేరు. అలా కుర్తీ, టాప్, గౌన్‌.. ఇలా ప్రతి దాని మీద బంజారా వర్క్‌ తీసుకోవడం మొదలైంది. 

బంజారా వర్క్‌కి ఉన్న ప్రపంచ మార్కెట్‌? 
బంజారా వర్క్‌ వరల్డ్‌వైడ్‌ ఫేమస్‌ కావడంతో దీని మార్కెట్‌ మాటల్లో చెప్పలేనంత బాగుంది. ఈ ఎంబ్రాయిడరీ, మిర్రర్‌ వర్క్‌ని విదేశీయులు బాగా ఇష్టపడతారు. చూసిన వెంటనే గుర్తిస్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆ విధంగా బాగా పాప్యులర్‌ అయ్యింది. సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌ ద్వారా కూడా ఈ వర్క్‌ బాగా రాణించిందని చెప్పచ్చు. రాజస్థానీ వాసి అయిన రూనాదేవి అనే స్వచ్ఛందృ సేవకురాలు లక్ష మందికి ఈ వర్క్‌ ద్వారా ఉపాధి చూపించింది. దీని ద్వారా విపరీతమైన మార్పు వచ్చింది. బంజారావర్క్‌లోని ఏదో ఒక అంశాన్ని అన్ని డ్రెస్సుల మీదకు ట్రాన్స్‌ఫర్‌ చేయడంతో టాలీవుడ్, బాలీవుడ్‌ అంటూ తేడా లేకుండా సినిమా తారలనూ ఆకట్టుకుంది. దీంతో కూడా అంతర్జాతీయ మార్కెట్‌ బాగా పెరిగింది. 

ఇప్పుడు ఈ వర్క్‌కి ఉన్న ట్రెండ్‌..? 
దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన గీతాంజలి సినిమాతో బంజారా వర్క్‌ మిగతా డ్రెస్సుల మీదకు ఎలా తీసుకోవచ్చో పరిచయం చేసినట్టు అయ్యింది. అప్పటినుంచి ప్రతి 2–3 ఏళ్లకోసారి ఈ వర్క్‌ ట్రెండ్‌లోకి వస్తూనే ఉంది. ఇప్పుడు ఇండియాలో టాప్‌ డిజైనర్‌ సునీత్‌ వర్మ బంజారా స్టైల్‌ మిర్రర్‌ వర్క్‌తో డ్రెస్‌ డిజైన్స్‌ చేస్తున్నారు. దీని వల్ల ఇప్పుడు మళ్లీ బంజారా వర్క్‌ ట్రెండ్‌లోకి వచ్చిందనే చెప్పవచ్చు. తరాలు మారినా బంజారా వర్క్‌ అనేది ఎప్పుడూ జీవనంలోనే ఉంటుంది. రాజస్థానీ ఫర్నిషింగ్‌లోనూ ఈ వర్క్‌ వాడుతుంటారు. ఫ్యాషన్‌లోనే కాకుండా వాల్‌ హ్యాంగింగ్స్, బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్‌.. వంటి వాటిలోనూ వాడుతారు. బంజారా ఎంబ్రాయిడరీ వర్క్‌ది ఆల్‌టైమ్‌ బ్యూటీ. ఎప్పటికీ కళగా కొత్తపుంతలు తొక్కుతూనే ఉంటుంది. 

 

 

మంగారెడ్డి ఫ్యాషన్‌ డిజైనర్‌

మరిన్ని వార్తలు