'నన్ను పావుగా వాడుకోడానికే ఆహ్వానించారు'

5 Apr, 2021 09:03 IST|Sakshi
అనన్యా అలెక్స్‌

అనన్యసామాన్యం

మీరు ఇటీవలే ఈమె ఫొటోను మన ‘ఫ్యామిలీ’లో చూసి ఉంటారు. ఈమె కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తొలి ట్రాన్స్‌ ఉమన్‌ అని, ఎమ్మెల్యేగా గెలిస్తే మహిళలు, ట్రాన్స్‌జెండర్‌ల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఈమె అనినట్లు చదివిన జ్ఞాపకం కూడా మీకు ఉండి ఉంటుంది. ఈమె పేరు అనన్యా అలెక్స్‌.

వెంగర్‌ నియోజకవర్గం నుంచి ‘డెమోక్రాటిక్‌ సోషల్‌ జస్టిస్‌ పార్టీ’ అభ్యర్థిగా మార్చి 19 న నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ ఉపసంహరణ గడువు మార్చి 22 కూడా దాటì పోయింది. ఏప్రిల్‌ 6న పోలింగ్‌కి అన్ని పార్టీల అభ్యర్థులూ ముగింపు ప్రచార కార్యక్రమాల్లో ఉండగా అనన్య అకస్మాత్తుగా.. తను పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఏప్రిల్‌ 3 న ప్రకటించారు!! ఎందుకలా ఈమె అర్ధంతరంగా తన ప్రచార వేదికను, రాజకీయ రంగాన్ని దిగి వెళ్లిపోయారు?!

అనన్యా అలెక్స్‌ ఆఖరి నిముషంలో మనసు మార్చుకోడానికి కారణం ఆ మనసు పడిన ఆవేదన! రాజకీయాల్లోకి వచ్చాక ఈ వేదనలు, ఆవేదనలు ఉంటాయా అనే ప్రశ్న వేసే ముందు ఆమేం చెబుతున్నారో వినవలసిన బాధ్యత ఉంటుంది ఎవరికైనా. అనన్య ఏదో అయిపోదామని పాలిటిక్స్‌లోకి రాలేదు. ఏదో చేద్దామని వచ్చారు. ఆమె ఏ పార్టీ అభ్యర్థిగా అయితే పోటీ చేస్తున్నారో ఆ ‘డెమోక్రాటిక్‌ సోషల్‌ జస్టిస్‌ పార్టీ’ (డి.ఎస్‌.జె.పి.) కూడా నిన్నమొన్నటి పార్టీనే.

రాజకీయాల్ని ప్రక్షాళన చేయబోతున్నాం అంటూ 2019లో ఆవిర్భవించిన ఆ పార్టీ ఇప్పుడు తనని తనే ప్రక్షాళన చేసుకోవలసిన అవసరాన్ని తెచ్చుకున్నట్లు అనన్య మాటల వల్ల స్పష్టం అవుతోంది. ‘‘నన్ను ఒక పావుగా వాడుకోడానికి మాత్రమే రాజకీయాల్లోకి ఆహ్వానించారు’’ అంటున్నారు అనన్య. సొంత పార్టీవాళ్లే ఆమెను మానసికంగా వేధిస్తూ, అసభ్యంగా దూషిస్తూ ప్రత్యర్థులపై వ్యక్తిగత దుష్ప్రచారం చెయ్యాలని ఆమెను బలవంత పెడుతున్నారట! ఇప్పుడిక హత్యచేస్తామన్న బెదరింపులు కూడా వస్తున్నాయని ఆమె చెబుతున్నారు. ఎందుకంటే.. చెప్పినట్లు వినడం లేదని! వాళ్లేం చెబుతున్నారంటే.. అనన్యను ఎన్నికల ప్రచారంలో బురఖా వేసుకొమ్మని బలవంతం చేస్తున్నారు.

వెంగర్‌ నియోజకవర్గంలో ముస్లిం మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ‘నేనలా చేయలేను’ అన్నారు అనన్య. ఆమె ప్రత్యర్థి, ముస్లిం లీగ్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పీకె కున్హలికుట్టి చెడ్డవాడని; మరొక ప్రత్యర్థి, లెఫ్ట్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి పి.జీజీ ఒక తెలివి లేని మనిషి అని ప్రచారం చెయ్యమని ఒత్తిడి తెస్తున్నారు. ‘‘నేనలా చేయలేను’’ అన్నారు అనన్య. అంతే.. ట్రాన్స్‌ ఉమెన్‌గా ఆమెపై వేధింపులు, లైంగిక హింస మొదలయ్యాయి. పార్టీలోని పైవాళ్లకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అనన్యతో అదే విధంగా, గౌరవం లేకుండా ప్రవర్తించారు! దాంతో మనస్తాపం చెంది, తన ఆత్మగౌరవాన్ని నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా ఆఖరి నిముషంలో ప్రచారం నుంచి తప్పుకున్నారు అనన్య. ‘‘నా వ్యక్తిత్వాన్ని చంపేసే ఏ పనినీ నేను చేయలేను’’ అని ఆమె అంటున్నారు.

మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉత్సాహం కనబరిచిన అనన్యకు... అభివృద్ధి పనుల గురించి చెప్పకుండా తన ప్రత్యర్థుల వ్యక్తిగత బలహీనతల గురించి మాట్లాడమని పార్టీ ఆదేశించడం ఆగ్రహం తెప్పించింది. కేరళ తొలి ట్రాన్స్‌ ఉమన్‌ రేడియో జాకీ అయిన అనన్య.. జీవితంలోని మంచి చెడుల గురించి రోజూ రేడియో శ్రోతలకు తనదైన ఆకట్టుకునే శైలిలో వినిపిస్తూ ఉంటారు. ‘‘ఇప్పుడు కనుక పార్టీ చెప్పినట్లు చేస్తే ఇప్పటì వరకు నువ్వు సంపాదించుకున్న మంచి పేరుతో పాటు రేడియో జాకీ ఉద్యోగం కూడా పోతుంది’’ అని సన్నిహితులు చేసిన హెచ్చరికలకు కూడా విలువ ఇచ్చి ఆమె బరి నుంచి బయటికి నడిచారు.
అనన్య రేడియో జాకీ మాత్రమే కాదు. ప్రొఫెషనల్‌ మేకప్‌ ఆర్టిస్ట్, న్యూస్‌ యాంకర్‌ కూడా.

శుక్రవారం నాడు అర్థంతరంగా ప్రచారాన్ని వదిలేసి వచ్చాక కూడా తన వెంటపడి ఎంత హీనంగా తనను ఎన్ని మాటలు అన్నారో అవన్నీ రాసి తన పార్టీ పెద్దలపై పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చారు అనన్య. అంతేకాదు.. మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లంటే మర్యాద లేని డి.ఎస్‌.జె.పి.కి ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత వేళలంటూ లేకుండా ఆమె చేత ప్రచారం చేయించడంతో అనన్య ఆరోగ్యం క్షీణించింది. కొల్లం జిల్లా పెరుమన్‌ గ్రామంలో పుట్టి తనకంటూ కేరళ వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకున్న అనన్య పాఠశాల విద్యతోనే చదువు మానేశారు. ఇక ఏ రాజకీయ గొడవలూ లేకుండా, చేస్తున్న ఉద్యోగాలలోనే కొనసాగుతూ ఉన్నత విద్యను పూర్తి చేయాలని ఇప్పుడు ఆశిస్తున్నారు. జెండర్‌కు అతీతంగా చదువు గౌరవాన్ని ఇస్తుందని ఆమె నమ్ముతున్నారు.

మరిన్ని వార్తలు