Marriage: ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? గొంతు కోసే పరిస్థితి ఎందుకు?

20 Apr, 2022 03:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కొన్ని పద్ధతులు మారాలేమో. నిశ్చయ తాంబూలాల సమయంలో పెద్దల సమక్షంలో ‘ఈ పెళ్లి నీకు ఇష్టమేనా?’ అని అడగాలేమో. వధువు, వరుడికి అక్కడ ఒక ఆప్షన్‌ దొరుకుతుంది. శుభలేఖలు వేసే ముందైనా ‘ఈ పెళ్లి నిజంగానే నీకు ఇష్టం కదా’ అని మళ్లీ తప్పక అడగాలి. ఏమంటే పిల్లల మనసులు పెద్దలు ఊహించినట్టుగా లేవు.

పెద్దలు తమ ఆకాంక్షలకు తగినట్టుగా ఉండమని కోరగలరేగాని బలవంతం చేయలేరు. ఇష్టం లేని పెళ్లి నిశ్చయం అయ్యిందని వరుడి గొంతు కోసే నిస్సహాయ స్థితికి వధువు చేరిందంటే ఆమె నోరు తెరిచి చెప్పేపరిస్థితి లేదనా?  చెప్పినా వినే దిక్కు లేదనా?పెళ్లికి ‘నో’ అంటే ‘నో’ అనే అర్థం చేసుకోక తప్పదు. ఒక అవగాహన.

పెద్దలు కుదిర్చిన పెళ్లి’ అనే మాట మనకు సర్వసాధారణం. మన దేశంలో పెద్దలు కుదిర్చిన పెళ్లికే ప్రథమ మర్యాద, గౌరవం, అంగీకారం. పెద్దలు కుదిర్చాక ఇక ఏ సమస్యా ఉండదు బంధువులకు, అయినవారికి, స్నేహితులకు, సమాజానికి. కాని ఆ కుదిర్చిన పెళ్లిలో వధువుకు వరుడో... వరుడికి వధువో నచ్చకపోతే? జీవితాంతం అది సమస్య కదా. దానిని మొదట ఇప్పుడు చర్చించాలి.

తాజా సంఘటన: మెడ కోసిన వధువు
అనకాపల్లిలో పుష్ప అనే అమ్మాయికి రామునాయుడు అనే అబ్బాయితో పెళ్లి నిశ్చయం అయ్యింది. మే 20న పెళ్లి. కాని అమ్మాయికి ఆ పెళ్లి ఇష్టం లేదు. దాంతో అబ్బాయి ప్రాణం తీస్తే ఈ పెళ్లి బాధ తప్పుతుందని వెర్రి ఆలోచన చేసింది. అబ్బాయిని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి సర్‌ప్రైయిజ్‌ గిఫ్ట్‌ ఇస్తాను అని చెప్పి కళ్లకు తన చున్నీ కట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసింది.

కాని అబ్బాయి బతికాడు. అమ్మాయి తనను తాను ఏమైనా చేసుకునేదేమో తెలియదు. పోలీసులు ప్రాథమిక విచారణ చేసి ఆ అమ్మాయి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని అనుకుంటోందని చెప్పారు. మరి తల్లిదండ్రులకు ఈ సంగతి చెప్పిందో లేదో తెలియాలి. వాళ్లు ఆ అమ్మాయిని పెళ్లి ఇష్టమో లేదోనని అడిగారో లేదో తెలియదు. అనవసరంగా ఇంత ప్రమాదం వచ్చి పడింది.

పెళ్లి ఎందుకు?
అబ్బాయి, అమ్మాయి కలిసి జీవించడానికి. ఫలానా అమ్మాయిని చూసొచ్చాం చేసుకో అంటే ముఖం కూడా చూడకుండా చేసుకున్న రోజులు ఉన్నాయి. నామమాత్రంగా పెళ్లి చూపుల్లో చూసుకుని చేసుకున్న రోజులు ఉన్నాయి. కాని ఇవాళ అలా లేదు. అమ్మాయి, అబ్బాయి చాలా విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు.

వారి భవిష్యత్తు గురించి వారికి ఏవో నిర్ణయాలు ఉంటాయి. లేదా ఇష్టాలు ఉంటాయి. లేదా ఏదైనా ప్రేమ ఉండొచ్చు. ఇవన్నీ లేకపోయినా కేవలం తెచ్చిన సంబంధం నచ్చకపోవచ్చు. ‘ఆ సంబంధానికి ఏమైంది... మంచి సంబంధం’ అని తల్లిదండ్రులు అబ్బాయినిగాని, అమ్మాయినిగాని ఒప్పించి, సర్దిపుచ్చి, ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేసి, బలవంతం చేసి పెళ్లి చేయదలిస్తే, దాని నుంచి బయటకు పోలేము... పూర్తిగా చిక్కిపోయాము అని వధువుగాని, వరుడుగాని అనుకుంటే వారికి ఒక ఆప్షన్‌ కుటుంబం నుంచి సమాజం నుంచి ఏమైనా ఉందా?

నిశ్చితార్థంలో పెద్దల సమక్షంలో...
పెళ్లిలో నిశ్చితార్థం ప్రధానం. ఆ సమయంలో పెద్దలు ఉంటారు. తల్లిదండ్రుల పిల్లల మంచికేనని విశ్వసించి పిల్లల బాగుకోసమేనని ఆ నిశ్చితార్థం జరుపుతున్నా... వారికి గట్టి వ్యతిరేకత ఉంటే అది చెప్పుకునే వీలు నిశ్చితార్థానికి ముందు వధువుకు, వరుడికి ఇవ్వొచ్చేమో ఆలోచించాలి. పెద్దల సమక్షంలో ‘ఈ పెళ్లి నీకు ఇష్టమేనా’ అని వధువును, వరుణ్ణి అడిగి వారి భావాలు చదివి, అంగీకారం తెలుసుకుని ముందుకుపోవడం లో తప్పు ఏముంది?

తల్లిదండ్రులు పెడుతున్న ఇబ్బంది ఆ సందర్భంలో పెద్దలకు చెప్పుకునే చాన్స్‌ ఇవ్వొచ్చు కదా. భవిష్యత్తు ప్రమాదం నివారించిన వాళ్లం అవుతాము. లేదా శుభలేఖలు వేసే ముందు తల్లిదండ్రులే తమ అనుమానాలు పోయేలా ‘ఈ పెళ్లి నిజంగా నీకు ఇష్టమేనా?’ అని పిల్లల మేలు కాంక్షించి అడగాలి. వారి సంతోషం కోసమే కదా తల్లిదండ్రులు జీవించేది. వారి సంతోషాన్ని పూర్తిగా కాకపోయినా ఏదో ఒక మేర అంగీకారం వచ్చే సంబంధం కుదిరేవరకు ఆగడంలో మేలే తప్ప కీడు లేదు.

గుసగుసలు వద్దు
బంధువులకు, స్నేహితులకు అన్నీ తెలుస్తాయి. ఫలానా ఇంట్లో ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నదని కచ్చితంగా తెలుస్తుంది. ఆ సందర్భంలో పిల్లలు, తల్లిదండ్రులు ఒకరికి ఒకరు శత్రువులు కాదు. కాని ఇష్టాలను గౌరవించడం లేదంతే. ఈ విషయం తెలిసినప్పుడు బంధువులు, స్నేహితులు మనకెందుకులే అని ఊరుకోకూడదు. గుసగుసలు పోవద్దు. ఆ తల్లిదండ్రులకు లేదా పిల్లలకు ఏ మేరకు నచ్చచెప్పగలరో చూడాలి.

కుదర్దు అని అమ్మాయి, అబ్బాయి గట్టిగా చెప్తే కచ్చితంగా వారి నిర్ణయాన్ని గౌరవించాలి. పెళ్లి విషయంలో పిల్లలతో సంపూర్ణంగా చర్చించే సన్నిహితత్వం తల్లిదండ్రులకు ఉండాలి. అది ప్రధానం. వారితో మాట్లాడండి. వారు చెప్పేది వినండి. అలాగే అబ్బాయిలూ అమ్మాయిలూ మీరేం అనుకుంటున్నారో మనసు విప్పి తల్లిదండ్రులకు చెప్పండి. వివరించండి. లేదా ఒక తెల్లకాగితం మీద రాసి అందజేయండి. అంతేగాని నచ్చని పెళ్లి విషయంలో తీవ్ర నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. అందరూ అందమైన వైవాహిక జీవితం నిర్మించుకోవాలని కోరుకుందాం. 

పెళ్లిపీటల మీద అడగలేము... కానీ...
చాలా సినిమాలలో పెళ్లి జరిగే ఉత్కంఠ సన్నివేశాలుంటాయి. అబ్బాయికో అమ్మాయికో పెళ్లి ఇష్టం ఉండదు. కాని ఈ పెళ్లి నాకు వద్దు అని చెప్పే ఆప్షన్‌ ఉండదు. నాటకీయంగా అరిచి చెప్పడమో, ఆత్మహత్య చేసుకోవడమో తప్ప. ఇదే పెళ్లి రిజిస్టార్‌ ఆఫీసులో జరగాలంటే ముందు నోటీసు పెడతారు, అభ్యంతరాలు తెలపమంటారు, తర్వాత సంతకాలు చేసే ముందు పెళ్లి ఇష్టమేనా అని అడుగుతారు. ఈ ఆప్షన్‌ వివాహంలో ఏదో ఒక స్థానంలో ఎందుకు ఉండకూడదు? కాలానికి తగిన ఒక చిన్న ప్రజాస్వామిక ఆప్షన్‌ ఇవ్వొచ్చా? 

మరిన్ని వార్తలు