సమాజం లెక్క తేల్చిన కథల మేష్టారు

5 Jun, 2021 05:13 IST|Sakshi

నివాళి

ఆయన వృత్తిరీత్యా లెక్కల మాష్టారు.  కాని సమాజంలో ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుందని, ఒక లెక్కను పెద్దవాళ్లు కలిసి నిర్ణయిస్తారని, ఆ పెద్దవాళ్లకు రెండు రెళ్లు ఆరనీ, కింద వాళ్లకు శేషం సున్నా అనీ  ఆయన స్కూల్లో పిల్లలకు కాకుండా కథల్లో పాఠకులకు చెప్పారు. మనుషులు ఈసురోమని ఉంటే అందుకు కారణం ఆ సదరు మనుషులు కారని వెనుక ఎక్కడో ఉండే మనుషులని ఆయన చెప్తారు. తెలుగు కథను ఉన్నతీకరించిన కాళీపట్నం రామారావు 97వ ఏట జీవించి అస్తమించారు. ఆయన రచనలు, ఆయన రచనా పరిశ్రమ   ప్రతి తెలుగు ‘ఫ్యామిలీ’కి తెలిసి ఉండాలి.

పోస్ట్‌మేన్‌ ఇంటికి ఉత్తరాలు తెచ్చి ఇస్తాడు. పోలీసు ఇంటికి రక్షణ కల్పిస్తాడు. ఇంజినీరు ఇల్లు కడతాడు. ప్రభుత్వ అధికారి ఇల్లు నడవడానికి అవసరమైన సంఘపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తాడు. వీరంతా సమాజంతో ఉంటూ సమాజం కోసం పని చేస్తూ సమాజంలో భాగంగా ఉంటారు. కాని ఈ సమాజం ఎలా ఉందో ఎవరు చెప్తారు? కథకుడే చెప్తాడు. సమాజాన్ని చూసి సమాజానికి దానిని తిరిగి చూపిస్తాడు కథకుడు. సమాజం ఎలా ఉందో రాసేవాణ్ణి రచయిత అనొచ్చు. అలా ఎందుకు ఉందో రాసేవాణ్ణి మంచి రచయిత అనొచ్చు. అలా ఉండకుండా ఏమి చేయవచ్చో రాసి పాఠకులను ఆలోచనాశీలురుగా, కర్తవ్యోన్ముఖులుగా చేసే రచయితను గొప్ప రచయిత అనొచ్చు. కాళీపట్నం రామారావు అలాంటి గొప్ప రచయిత.

మనం ఏం చేయాలో ముందు నిర్ణయించుకోవడం అందుకు తగ్గట్టుగా జీవితాన్ని నిర్మించుకోవడం అందరూ చేయరు. కాళీపట్నం రామారావు తన వివాహం అయ్యాక, 1947 నాటి కాలంలోనే 80 రూపాయల జీతం వచ్చే స్పోర్ట్స్‌ డిపోలోని ఉద్యోగానికి రాజీనామా చేశారు. కారణం అది కథలు రాసుకోవడానికి అవసరమైన టైమ్‌ ఇవ్వదని. 30 రూపాయల జీతం వచ్చే ప్రభుత్వ ఉపాధ్యాయుడి జీతం ఎంచుకున్నాడాయన. తెలుగు కథ తనకు అవసరమై ఆయన జీవితాన్ని రూపుదిద్దుకుందా అనిపిస్తుంది. 1979లో ఆయన రిటైరయ్యారు. అది కూడా కథ చేసుకున్న ఒక ఏర్పాటే. ఎందుకంటే ఆ తర్వాతి సమయమంతా ఆయన తెలుగు కథకే ఇచ్చారు. దాదాపు 30–35 ఏళ్లు తెలుగు కథ ప్రచారానికి, సేకరణకి, భద్రపరచడానికి వెచ్చించారు. దేని నుంచి పొందామో దానికే తిరిగి ఇవ్వడం చేసిన అరుదైన రచయిత కాళీపట్నం రామారావు.

శ్రీకాకుళం చైతన్యధార
ప్రపంచంలో గొప్ప రచయితలందరూ జీవితంలో రకరకాల పనులు చేసినవారే. శ్రీకాకుళం జిల్లా మురపాక ప్రాంతానికి చెందిన కాళీపట్నం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కుదురుకునేంత వరకూ రకరకాల పనులు చేశారు. టైపిస్ట్‌గా, డిస్ట్రిక్ట్‌ కోర్టులో చిరుద్యోగిగా, రేషనింగ్‌ ఆఫీసులో ఎంక్వయిరీ ఆఫీసరుగా ఇలా రకరకాల పనులు చేశారు. పత్రికల్లో పని చేయాలని ఆయనకు గట్టిగా ఉండేది. మద్రాసు (చెన్నై) వెళ్లి ప్రయత్నించినా జరగలేదు. సాహిత్యం పట్ల ఏర్పడిన ఆసక్తి ఆయనను కథకుడిగా ఉండమని కోరింది. 1943లో ఆయన మొదటి కథ ‘ప్లాట్‌ఫారమో?’ అచ్చయ్యింది. ఆ తర్వాత ఆయన కొన్ని కథలు రాసినా ఇవి కాదు కదా రాయాల్సింది అని అనిపించింది. ఆలోచన కలిగించనిది కథ ఎలా అవుతుంది అని ఆయన అనుకున్నారు. పాఠకులకు ఆలోచన కలిగించాలంటే రచయితకు చదువు, అవగాహన, జ్ఞానం, హేతువు, సైద్ధాంతిక భూమిక, ప్రాపంచిక దృక్పథం ఇవన్నీ ఉండాలి కదా అని అధ్యయనంలో పడ్డారు. 1955 నుంచి దాదాపు ఎనిమిదేళ్లు కథలు రాయకుండా పూర్తిగా అధ్యయనంలో ఉండిపోయారు. 1964లో ‘తీర్పు’ కథతో అసలైన కాళీపట్నం రామారావు తెలుగు పాఠకలోకానికి తెలిశారు. 1966లో ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు సాహిత్యానికి చూపు, ఊపు ఇచ్చింది. ‘కథ ఎందుకు?’, ‘కథ ప్రయోజనం ఏమి?’, ‘కథ నడిచే మార్గం ఎలా ఉండాలి’ ఈ ప్రశ్నలన్నింటికి ఆ కథ ఒక మార్గదర్శిగా నిలిచింది.

సామాజిక సమస్యలు, అంతర్గత ఆరాటాలు
శరీరం మీద పీడన మనసు మీద పడుతుంది. మనసు పడే వొత్తిడి శరీరానికి హాని కలిగిస్తుంది. వ్యవస్థ గతి వ్యవస్థది మాత్రమే కాదు. ఆ గతిలో సమాజంలోని ప్రతి పౌరుడు భాగం. ఆ గతి మతి తప్పితే ఆ పౌరుడు బాధితుడవుతాడు. ఆ పౌరుడే ఇంటికొస్తే వ్యక్తిగా మారి అంటే తండ్రిగా, భర్తగా, కుమారుడిగా వొత్తిడి ఎదుర్కొంటాడు. ఈ రెంటినీ కాళీపట్నం రామారావు కథగా చేసి తెలుగు పాఠకులకు చూపారు. గుప్పిట విప్పేసినట్టుగా రాయడం ఆయన పద్ధతి కాదు. సూచించినట్టుగా పొరల చాటున దాచినట్టుగా ఆయన పరమసత్యాన్ని నిగూఢపరిచి దానిని తానే కనుగొన్న సంతృప్తిని పాఠకునికి ఇస్తారు. పౌరహితం కోరుతున్నట్టు కనిపించే ఈ సామాజిక వ్యవస్థ నిజానికి మేడిపండు. ఇది పైకి మంచిగా కనిపిస్తూ లోపల పీడితుల రక్తాన్ని తాగుతూ ఉంటుందని ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ నాటి సామాజిక, ఆర్థిక మూలాల కఠినత్వాన్ని చూపింది. ఈ కథ ముగింపులో నిస్సహాయుని ఆగ్రహ ప్రకటనగా బాధితుడు తన ఇంటి పిల్లాడి తల నరకడాన్ని రచయిత చూపిస్తాడు. నేటికీ అదే జరుగుతోంది.. బలవంతుడైన పీడకునితో పోరాటానికి దిగితే మనకు ఆపద ఎదురవుతుంది. అప్పుడు మనవాళ్లే వచ్చి మన చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఆ పోరాటం నుంచి విరమింప చేస్తారు. అయితే పోరాటం వొద్దనా? కాదు ఒకరూ ఒకరూ ఒకరూ కాక అందరు కలిసినప్పుడు బలవంతుడు తోక ముడుస్తాడన్న సూచన ఉంది అందులో.

ఆ భాష, ఆ సొగసు
కాళీపట్నం రామారావు కేవలం ప్రగతిశీల కథ రాసి ఉంటే ఇంత ఖ్యాతి వచ్చి ఉండేది కాదు. ఆయన తాను పుట్టి పెరిగిన శ్రీకాకుళం మీద తన కథలను నిలబెట్టి ఆ స్థానికతే విశ్వజనీయత అనే భావనతో కథలు చెప్పారు. శ్రీకాకుళపు భాషను ఆయన సొగసుగా సంభాషణల్లో దించారు. ముఖ్యం శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికి మల్లే ఆయన కూడా స్త్రీల పాత్రలకు ఎంతో సజీవమైన సంభాషణలను సమకూర్చారు. ‘నో రూమ్‌’, ‘ఆర్తి’, ‘చావు’, ‘జీవధార’, ‘భయం’... ఈ కథలన్నీ ఇందుకు ఉదాహరణ. ‘జీవధార’ కథలో పైకి నీటి సమస్య వస్తువుగా కనపడుతుంది. మురికివాడ వాసులకు తాగునీళ్లు ఉండవు. దాపులో ఒక శ్రీమంతుల ఇంటిలో కావల్సినన్ని నీళ్లు. మురికివాడ ఆడవాళ్లు రోజు ఆ శ్రీమంతుల గేటు దగ్గరకు వచ్చి నీళ్లు అడుగుతూ ఉంటారు. ఆ శ్రీమంతులు చీదరించుకుంటూ ఉంటారు. చీదరించుకుంటూ ఉంటే ఆ ఆడవాళ్లు కొన్నాళ్లు పడతారు... మరి కొన్నాళ్లు సహిస్తారు... దప్పికతో ప్రాణం పోతుంటే ఏం చేస్తారు? తిరగబడతారు. అంతమంది తిరగబడితే ఆ శ్రీమంతులు నీళ్లేం ఖర్మ ఏమైనా ఇచ్చి తోక ముడవరూ? బాధితులందరూ కలిసి తిరగబడాలి... పీడితులందరూ కలిసి తిరగబడాలి... మైనార్టీ సమూహాలు అన్నీ కలిసి తిరగబడాలి... అని రచయిత సూచన. ఏదీ ఊరికే రాదు. ‘సాధించుకోవాలి’ ఈ వ్యవస్థ నుంచి. సాధించుకోవడం మెత్తగా సాధ్యం కాదు ఎప్పటికీ.

దీపధారి
కాళీపట్నం రామారావు ‘విరసం’ (విప్లవ రచయితల సంఘం) ఏర్పడినప్పటి నుంచి  దాదాపు 15 ఏళ్లు అందులో క్రియాశీల సభ్యులుగా ఉన్నారు. రావిశాస్త్రి, వరవరరావు, కె.వి.రమణారెడ్డి వంటి ఉద్దండులతో ఆయన కలిసి పని చేశారు. తెలుగునాట విప్లవ కథ విస్తృతం కావడంలో అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి వంటి రచయితలు సిద్ధం కావడానికి మరోవైపు మధ్యతరగతి కథను ముందుకు తీసుకెళ్లడంలో వివిన మూర్తి, కవనశర్మ తదితరులు ముందంజ వేయడానికి  కాళీపట్నం రామారావు స్ఫూర్తిగా నిలిచారు. ఆయనకు ‘సాహిత్య అకాడెమీ’ వచ్చినా తిరస్కరించారు. కొత్త కథకులను సిద్ధం చేసేందుకు ఊరూరు తిరిగి వర్క్‌షాపులు పెట్టారు. కథామెళకువలు చెప్పే వ్యాసాలు రాసి పుస్తకాలు వెలువరించారు. ఈ సమయంలోనే ఆయన ‘కథల మేష్టారు’గా గౌరవం పొందసాగారు.

కథానిలయం
1996 ప్రాంతంలో నిజానికి ఎవరైనా సరే విశ్రాంత జీవనం కోరుకునే వయసులో ఆయన ‘కథానిలయం’ అనే బృహత్‌కార్యానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఈ ఆలోచన చెప్పినప్పుడు ముందు హేళన, ఆ తర్వాత సంశయం, ఆ తర్వాత అంగీకారం పొందారు. తెలుగులో వచ్చిన కథలన్నీ ఒక్కచోట చేరాలి అని ఆయన చేసిన ఆలోచన ఇవాళ తెలుగువారికి ఒక విలువైన భాండాగారాన్ని సిద్ధం చేసింది. శ్రీకాకుళంలో ఆయన రెండస్తుల ‘కథా నిలయం’ కట్టడానికి కథాభిమానులు తలా ఒక ఇటుక ఇచ్చారు. ఇందుకోసమై హైదరాబాద్‌ రవీంద్రభారతిలో పెద్ద కార్యక్రమం చేసి కాళీపట్నంకు ‘లక్ష రూపాయల’ పర్స్‌ అందజేశారు.  తెలుగులో వచ్చిన వీక్లీలు, మంత్లీలు, కథాసంకలనాలు, వాటితో పాటు రచయితల డేటా, వారు రాసిన కథల పట్టిక ఇవన్నీ చాలా పెద్ద పని. కాళీపట్నం తన భుజాల మీద వేసుకు చేశారు. ఆ తర్వాత ఆ ఆలోచన ఆ మొత్తం కథలను డిజిటలైజ్‌ చేయడం వైపు మళ్లింది. ఇవాళ ‘కథానిలయం’ వెబ్‌సైట్‌లో వేలాది కథలు డిజిటలైజ్‌ అయి ఉన్నాయి. విద్యార్థులకు, అధ్యయనం చేయాలనుకునేవారికి ఆ సైట్‌ ఒక అతి పెద్దసోర్స్‌. ఏనాటి కథలో, కథకులో తెలుసుకోవాలంటే ఆ సైట్‌కు వెళ్లక తప్పదు. మరో భాషకు ఇలాంటి సైట్‌ ఏమాత్రం లేదు. ఇది తెలుగువారి ఘనత. ఇందుకు కారకులు కాళీపట్నం.

నిరంతర అధ్యయన శీలి
కాళీపట్నం రామారావు నిరంతర అధ్యయనంలోనే ఉన్నారు. 96 ఏళ్లు వచ్చినా కన్ను కనిపించినంత సేపు చదవడానికే ఇష్టపడ్డారు. శ్రీకాకుళంలో కాళీపట్నం రామారావు తమ కథను చదివి మెచ్చుకుంటే అదే పెద్ద అవార్డుగా యువ కథకులు భావిస్తారు. ఆయన నిరంతరం కొత్త కథకులను ప్రోత్సహిస్తూనే వచ్చారు. 2006లో రాసిన ‘అన్నెమ్మ నాయురాలు’ ఆయన చివరి కథ. తెలుగు కథ పయనంలో కాళీపట్నం అస్తమయం వల్ల ఒక శకం ముగిసింది. అలాంటి రచయిత, కథా కార్యకర్త మరొకరు సిద్ధం కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. తెలుగు కథ ఉన్నంత వరకూ తప్పక కాళీపట్నం ప్రస్తావన, శ్రీకాకుళం ఉనికి ఉంటూనే ఉంటుంది. ఆ మహా కథకునికి నివాళి.

కమిటెడ్‌ రైటర్‌
కాళీపట్నం రామారావును నిబద్ధ రచయితగా చెబుతారు. నిబద్ధతకు ఒక ఉదాహరణగా చూపుతారు. తన చేతిలో ఉన్న కథను, అక్షరాన్ని దేనికి నిబద్ధం చేయాలో ఎంత మేరకు చేయాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలని అంటారు. కనపడిందంతా, తోచిందంతా రాయడం కాళీపట్నం ఏనాడూ చేయలేదు. పొద్దుపోక రాయడం చేయలేదు. కాలక్షేపం కోసం రాయడాన్ని అసలు చేయలేదు. ఒక సత్యాన్ని కనుగొని ఆ సత్యానికి అవసరమైన కథను, పాత్రలను ఎంచుకుని, ఒక ప్రయోజనాన్ని ప్రతిపాదించి, ఒక చూపును ఇవ్వగలిగే కథ రాయగలిగినప్పుడే రాశారు. అందుకే ఆయన ముఖ్యమైన కథలు ఒక డజనుకు మించవు. అయినా సరే అవి వంద కథలకు సమానమైన ఖ్యాతి పొందాయి. 

– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు