Tuesdays and Fridays Movie: వెబ్‌ ఫ్లిక్స్‌.. మూడు షరతులు

25 Apr, 2021 00:51 IST|Sakshi

‘ప్లాన్‌ పేరు ‘టీ అండ్‌ ఎఫ్‌’ అంటే ట్యూస్‌ డేస్‌ అండ్‌ ఫ్రైడేస్‌.
రూల్‌ నంబర్‌ వన్‌.. 
ఇద్దరం ప్రతి మంగళ, శుక్రవారాల్లో మాత్రమే కలుసుకోవాలి.
రూల్‌ నంబర్‌ టూ.. మిగిలిన వారాల్లో ఎవరి ఇష్టం వారిది. నువ్వు వేరే అమ్మాయి తో డేట్‌ చేసినా.. నేను ఇంకో అబ్బాయితో డేట్‌ చేసినా నిలదీయొద్దు.
రూల్‌ నంబర్‌ త్రీ.. థర్డ్‌ డేట్‌ వరకు నో కిసెస్, నో హగ్స్‌..

ఇద్దరిలో ఎవరికిది వర్కవుట్‌ కావట్లేదు అనిపించినా తప్పుకోవచ్చు. ఎలాంటి సంజాయిషీలు, ప్రశ్నలు ఇచ్చిపుచ్చుకోవడాలు లేకుండా. తర్వాత ఎవరిదారి వారిది’ అంటూ అబ్బాయికి డేటింగ్‌ ప్లాన్‌ వినిపిస్తుంది అమ్మాయి. వెంటనే ఒప్పుకోవడానికి కాస్త తటపటాయించినా తర్వాత ఒప్పుకుంటాడు అబ్బాయి. ఆమె పేరు.. సియా (ఝటాలేకా), అతని  పేరు వరుణ్‌ (అన్‌మోల్‌ టకారియా థిల్లాన్‌). సినిమా .. టీ అండ్‌ ఎఫ్‌. భన్సాలీ ప్రొడక్షన్స్‌ (సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మాణ సారథ్యం). దర్శకుడు.. తన్వీర్‌ సింగ్‌. ప్రేమ, పెళ్లి పట్ల మిల్లేనియల్స్‌ ఆలోచనల తీరు, భద్రతాభద్రతల భావనలు, నమ్మకం– అపనమ్మకాల ప్రయాణాన్ని చూపించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.

కథ.. సియా.. వృద్ధిలోకి వస్తున్న న్యాయవాది. వరుణ్‌.. ఔత్సాహిక రచయిత. అతను రాసిన నవల సినిమా హక్కుల వివాదంలో ఒకరికొకరు పరిచయం అవుతారు. ఇద్దరి తల్లిదండ్రులు విడాకులతో వేరవుతారు. ఆ ఇద్దరూ తల్లుల దగ్గరే పెరుగుతారు. అయితే తన తల్లిదండ్రుల విడాకులతో ప్రేమ, పెళ్లి విషయంలో వరుణ్‌ ప్రతికూల అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటాడు. సియా.. కొంత ఆశావాహ ధోరణిలో ఉంటుంది. ప్రేమ, పెళ్లి తన తల్లిదండ్రుల విషయంలో విఫలమైనంత మాత్రాన అందరికీ అదే ఎదురవుతుందనే ఆలోచనలో ఉండడం తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్‌.

ప్రేమ, పెళ్లికి సంబంధించిన అనుబంధానికి ఎక్స్‌పెయిరీ డేట్‌ ఉంటుందనేది అతను ఏర్పర్చుకున్న నమ్మకం. అది ఏడు వారాల తర్వాత బీటలు వారి గొడవలతో సమాప్తం అవుతుందని అతనికున్న అభద్రత. అందుకే సియా అంటే ఇష్టం ఉన్నా ఆ రిలేషన్‌ ఏడువారాలే సాగాలని.. జీవితాంతం తోడు అనే కాన్సెప్ట్‌తో ఆమెకు దగ్గరై.. తర్వాత గొడవలతో ఆమెకు దూరమయ్యే బాధను భరించలేనంటాడు. అతని ఆ దృక్పథాన్ని మార్చాలని.. ఒకరిపట్ల ఒకరు గౌరవంతో ఉంటే ఏ అనుబంధమైనా పదికాలాపాటు పదిలంగా ఉంటుందని అతనికి చెప్పే ప్రయత్నం చేస్తుంది.

అందులో భాగమే ఆ ‘టీ అండ్‌ ఎఫ్‌’ డేటింగ్‌ ప్లాన్‌. ట్యూస్‌ డేస్‌ అండ్‌ ఫ్రైడేస్‌ ప్లాన్‌తో సియాను వదులుకోలేనంత ప్రేమలో కూరుకుపోతాడు వరుణ్‌. అయినా గొడవలతో విడిపోతామేమోనన్న అభ్రదత, భయంతో సియాను దూరం చేసుకుంటాడు. విపరీతమైన మానసిక సంఘర్షణ తర్వాత సియాతో జీవితాంతం ఉండిపోవడానికి సిద్ధమవుతాడు. ఏడు వారాల కాన్సెప్ట్‌ మళ్లీ అతని మెదడును వెతుక్కోకుండా ఉండడానికి ఏడాది గడువిచ్చి.. ఆ ఏడాది డేటింగ్‌లో వరుణ్‌ అభద్రతను, ప్రేమ, పెళ్లి పట్ల ఉన్న అపనమ్మకాన్ని పూర్తిగా పోగొట్టి.. పెళ్లికి ఓకే అంటుంది సియా.

కామెంట్‌..
కొత్త కథాంశాన్ని తీసుకున్నా కథనంలో భిన్నత్వాన్ని చూపించలేకపోయింది. మహిళా సాధికారతను స్పృశించినా ఫోకస్‌ చేయలేకపోయింది. కథకు మించిన పాత్రలతో కొంత గందరగోళానికి గురి చేసింది. హీరోహీరోయిన్లూ కొత్తవాళ్లే. అందంతో ఆకట్టుకుంటారు తప్ప నటనతో కాదు. అన్నట్టు హీరో అన్‌మోల్‌ .. బాలీవుడ్‌ ఒకప్పటి హీరోయిన్‌ పూనమ్‌ థిల్లాన్‌ కొడుకు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు