బ్రేకింగ్‌ రికార్డ్‌.. ఏడడుగుల సౌకుమార్యం

14 Oct, 2021 00:47 IST|Sakshi

డ్రెస్‌ అయినా, చీర అయినా కాస్త పొడవుగా ఉన్నవాళ్లకు చూడముచ్చటగా ఉంటుంది. అందుకే ఇంకాస్త పొడవుంటే నా పర్సనాలిటికీ ఈ డ్రెస్‌ బాగా నప్పుతుంది అని టీనేజ్‌ అమ్మాయిల నుంచి పెళ్లయిన మహిళల వరకు అంతా తెగ మదనపడుతుంటారు. వీళ్లు ఇలా ఫీల్‌ అవుతుంటే రుమేసా మాత్రం ప్రపంచంలో నా అంతా ఎత్తు ఎవరూ లేరు, ప్రపంచంలో నేనే పొడవైన మహిళనంటోంది. అనడమేకాదు తన పేరుమీద గిన్నిస్‌ రికార్డులను కూడా తిరగ రాసేస్తుంది.  

 టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గల్గీ ప్రంచంలోనే అతిపొడవైన మహిళగా గిన్నిస్‌బుక్‌ రికార్డు నెలకొల్పింది. నిలుచున్నప్పుడు 7 అడుగుల 0.7  (215.16 సెంటీమీటర్లు) అంగుళాలతో ప్రపంచంలో జీవించి ఉన్న పొడవైన వనితగా నిలిచింది.అయితే రుమేసా గిన్నిస్‌బుక్‌ను రికార్డు నెలకొల్పడం ఇది తొలిసారి కాదు. ఆమెకు 18 ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారి టాలెస్ట్‌ మహిళా టీనేజర్‌గా గిన్నిస్‌బుక్‌ రికార్డు సృష్టించింది. అప్పుడు రుమేసా ఎత్తు 7 అడుగుల 0.09 అంగుళాలు(213.6 సెంటీమీటర్లు). రుమేసా చేతులు 24.5 సెంటీమీటర్లు, కాళ్లు 30.5 సెంటీమీటర్లు పొడవు ఉన్నాయి.

అయితే రుమేసాకంటే ముందు ప్రపంచంలో పొడవైన మహిళ రికార్డు చైనాకు చెందిన యోడిఫెన్‌ పేరు మీద ఉంది. ఈమె ఎత్తు 7 అడుగుల 7 అంగుళాలు (233.3 సెంటీమీటర్లు), ఈమె 2012లో మరణించింది. ప్రపంచంలోనే అతిపొడవైన వ్యక్తి కూడా టరీ్కకి చెందిన వారు కావడం విశేషం. జీవించి ఉన్న అతిపొడవైన వ్యక్తి సుల్తాన్‌ కొసెన్‌ ఎత్తు 8 అడుగుల 2.8 అంగుళాలు. ప్రపంచంలోనే అతిపొడవైన మహిళగా చైనాకు చెందిన జెంగ్‌ జిన్లియన్‌ పేరు మీదే ఇప్పటికీ రికార్డు ఉంది. ఆమె ఎత్తు 8 అడుగుల ఒక అంగుళం(246.3 సెంటీమీటర్లు). జెంగ్‌ 1982లో మరణించారు.  
 
వీవర్‌ సిండ్రోమ్‌..
రుమేసా వీవర్‌ సిండ్రోమ్‌ కారణంగా ఇంత పొడవు పెరిగింది. ఇది చాలా అరుదుగా కనిపించే సమస్య. ఈ సమస్య ఉన్నవాళ్లలో అస్థిపంజరం సాధారణం కంటే అధికంగా పెరిగిపోతుంది. ఇలా ఉన్నవాళ్లు స్వయంగా నడవడం కూడా కష్టమే. ఎక్కువగా వీరు ఇతరుల సాయం లేదా వీల్‌ చెయిర్, వాకర్‌ స్టిక్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. రుమేసా ఎక్కువగా వీల్‌ చెయిర్‌ను వాడుతుంది.  
తనకు ఈ సిండ్రోమ్‌ ఉందని రుమేసా ఎప్పుడూ బాధపడకపోగా తనలాంటి వారికి..ఇది కేవలం ఒక ఆరోగ్య సమస్య అని, దీనిని అంగీకరించి ధైర్యంగా ఉండాలని చెబుతోంది. ప్రతి ప్రతికూలతకు ఒక అనుకూలత ఉంటుంది. అది బయట పడేంతవరకు వేచి ఉండి, మనలో ఉన్న సామర్థ్యాలతో ముందుకు సాగాలని చెబుతూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.   
  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు