మనసు కుదిరింది.. పెళ్లి జరిగింది

11 Nov, 2022 05:36 IST|Sakshi
మహేంద్ర, దీప

న్యూస్‌మేకర్స్‌

‘పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది పిచ్చి కుదిరితే పెళ్లి జరుగుతుంది’ అని సామెత. అంటే పిచ్చి కుదరదు... పెళ్లి జరగదు అని అర్థం. కాని ఆ సామెతను తప్పు చేశారు ఇద్దరు ప్రేమికులు. మానసిక అస్వస్థతతో చెన్నై పిచ్చాసుపత్రిలో విడివిడిగా చేరిన ఈ ఇరువురుకి అక్కడ పరిచయమైంది. వ్యాధి నయం కావడంతో పెళ్లి నిర్ణయానికి వచ్చారు. 200 ఏళ్ల చరిత్రగల ఆ ఆస్పత్రిలో ఈ ఘటన మొదటిసారి. మానసిక అస్వస్థత కూడా జ్వరం, కామెర్లులా నయం కాదగ్గదే. గమనించి వైద్యం చేయిస్తే పూర్వ జీవితం గడపొచ్చు. చెన్నైలో జరిగిన ఈ పెళ్లి ఆశలు వదులుకునే మానసిక అస్వస్థులకు గొప్ప శుభవార్త. శుభమస్తు వార్త.

మానసిక అస్వస్థత వస్తే ఈ సమాజంలో ఎన్నో అపోహలు, భయాలు, ఆందోళనలు, హేళనలు ఆపై బహిష్కరణలు. ‘పిచ్చివారు’ అని ముద్ర వేసి వారికి వైద్యం చేయించాలనే ఆలోచన కూడా చేయరు. అదే జ్వరం వస్తే జ్వరం అని చూపిస్తారు. కాని మనసు చలిస్తే ఏదో దెయ్యం పట్టిందని వదిలేస్తారు. మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వాలు, సేవా సంస్థలు ఎంతో ప్రచారం చేస్తున్నా వైద్యం అందాల్సిన వారు, వైద్యం చేయించాల్సిన వారు కూడా అవగాహన లోపంతో వున్నారు. డాక్టర్‌ దగ్గరకు వెళ్దామంటే ‘నాకేమైనా పిచ్చా’ అని ఎదురు తిరుగుతారు పేషెంట్లు. ‘పిచ్చి’ ముద్ర వేస్తారని.

‘పిచ్చికి మందు లేదు’ అని వదిలేస్తారు బంధువులు. ఇద్దరూ ఓర్పు వహిస్తే గొప్ప ఫలితాలు వస్తాయి అనడానికి ఇదిగో ఇదే ఉదాహరణ. చెన్నైలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌’ (ఐ.ఎం.హెచ్‌.) బ్రిటిష్‌ కాలం నాటిది. దేశంలోనే రెండవ అతి పెద్ద మానసిక చికిత్సాలయం. అందులో కొంత కాలం కిందట వైద్యం కోసం చేరారు మహేంద్ర (42), దీప (38).

కుటుంబాలు వారిని చేర్పించి చేతులు దులుపుకున్నాయి. కాని వారు బాగయ్యారు. కొత్త జీవితం గడపాలనుకున్నారు. కాని బయటకు వెళితే ‘నయమై వచ్చినా’ అమ్మో పిచ్చోళ్లు అనే వివక్షతో చూస్తారు జనం. ఆ భయంతో మళ్లీ హాస్పిటల్‌కు వచ్చేశారు. దాంతో హాస్పిటల్‌ వారే వారికి లోపల ఉద్యోగాలు కల్పించారు. మహేంద్ర డేకేర్‌ సెంటర్‌లో పని చేస్తుంటే దీప కేంటిన్‌లో పని చేస్తోంది. మెల్లగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

ఈ సంగతి అడ్మినిస్ట్రేషన్‌కు తెలియగానే హడలిపోయారు. ఎందుకంటే ఇలాంటిది ఇంతకు మునుపు ఎరగరు. ఇదేమైనా ఇష్యూ అవుతుందా అనుకున్నారు. కాని హాస్పిటల్‌ డైరెక్టర్‌ అయిన డాక్టర్‌ పూర్ణ దగ్గరకు వచ్చిన దీప ‘నేను అతనితో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నానమ్మా’ అని చెప్పే సరికి ఆమెకు ఆ స్త్రీ హృదయం అర్థమైంది.

అంతే. హాస్పిటల్‌లో పని చేసే అందరూ తలా ఒక చేయి వేసి వారి పెళ్లికి ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు. తాళిబొట్టు ఆ ఏరియా ఎం.ఎల్‌.ఏ. ఏర్పాటు చేశాడు. అంతేనా హెల్త్‌ మినిస్టర్‌ శేఖర్‌ బాబు, ఎం.పి. దయానిధి మారన్‌ ఏ బందోబస్తు లేకుండా సగటు బంధువుల్లా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి ఎంతో వేడుకగా జరిగింది.

మానసిక ఆరోగ్యం దెబ్బ తింటే జీవితం ముగిసినట్టు కాదు. స్వల్ప కాలం ఇబ్బంది పడ్డా నయమయ్యి కొత్త జీవితం గడపవచ్చు. అందుకు ఉచిత వైద్యం దొరుకుతుంది. కనుక ఆరోగ్యాన్ని గమనించి సమస్య వస్తే జయించండి. కొత్త జీవితాన్ని కళకళలాడించండి. ఎవరికి తెలుసు... ఇప్పుడు కష్టం వచ్చినా భవిష్యత్తు ఎన్ని సంతోషాలను దాచిపెట్టి ఉందో!

మరిన్ని వార్తలు