‘నాన్న కష్టం చూడలేక’.. సూర్యుడి కంటే ముందే డ్యూటీ

1 Sep, 2021 16:44 IST|Sakshi

ఈ ఇద్దరమ్మాయిలు... అక్కాచెల్లెళ్లు. అక్క ఇంటర్‌ ఫస్టియర్‌... చెల్లి టెన్త్‌ క్లాస్‌. ఇద్దరూ ధైర్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. నాన్న కోసం కష్టమైన పనిని ఇష్టంగా అందుకున్నారు. ఆడపిల్లలు చేయని సాహసానికి సిద్ధమయ్యారు. చీకటి చీల్చడానికి సూర్యుడు డ్యూటీ చేస్తాడు. ఆ సూర్యుడికంటే ముందే వీళ్ల డ్యూటీ మొదలవుతుంది. సూర్యుడు వెలుతురును పంచేలోపు... ఈ అక్కాచెల్లెళ్లు అక్షరాల వెలుగును పంచుతున్నారు. నాన్నకు ఎదురైన కష్టాన్ని పంచుకున్నారు. ఇంటి చీకటిని తొలగిస్తున్న కాంతి వీచికలయ్యారు.

తెలతెలవారుతోంది. హైదరాబాద్‌ నగర వీథుల్లో రోడ్డు మీద మాణింగ్‌ వాకింగ్‌ చేసే వాళ్లు, వీథులు చిమ్మేవాళ్లు తప్ప మనుష్య సంచారం పెద్దగా లేదు. ఓ అమ్మాయి రయ్యిమంటూ స్కూటీ మీద వచ్చి ఓ ఇంటి ముందు ఆగింది. న్యూస్‌ పేపర్‌ని రోల్‌ చుట్టి ఇంటి బాల్కనీలోకి విసిరేసింది.

మరో కాలనీలో అంతకంటే చిన్నమ్మాయి ఇంటింటికీ వెళ్లి న్యూస్‌ పేపర్‌ వేస్తోంది. ఓ ఇంటి ముందు అప్పటికే నిద్రలేచి ఉన్న ఓ పెద్దావిడ నవ్వుతూ ఆ అమ్మాయిని పలకరించింది.

‘‘ఆడపిల్ల ఇంత ధైర్యంగా పొద్దున్నే ఇలా ఇంటింటికీ వచ్చి పేపర్‌ వేయడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందమ్మాయ్‌! అయినా ఇంత కష్టమైన పనికి ధైర్యంగా ముందుకు రావడం గొప్ప విషయమే. జాగ్రత్త తల్లీ’’ అని జాగ్రత్త చెప్పిందా పెద్దావిడ.

‘‘అలాగే మామ్మ గారూ!’’ అని ఆ అమ్మాయి కూడా నవ్వుతూ మామ్మగారికి టాటా చెప్పి మరో ఇంటిదారి పట్టింది.

న్యూస్‌పేపర్‌ డెలివరీ చేస్తున్న ఈ అమ్మాయిలు కెలావత్‌ ప్రమీల, పవిత్ర. హైదరాబాద్, బోరబండ, శివమ్మ బాపురెడ్డి హిల్స్‌లో నివసిస్తున్నారు. రోజూ ఉదయం ఐదింటికే నిద్రలేచి ఆరు లోపు మోతీనగర్‌ చౌరస్తాలోని పేపర్‌ పాయింట్‌కు చేరుకుంటారు. ఏడు గంటల లోపు మోతీనగర్‌ చుట్టు పక్కల ఐదారు కాలనీల్లో పేపర్‌ వేసేసి, ఇంటికి వచ్చి రిఫ్రెష్‌ అయ్యి ఆన్‌లైన్‌ క్లాసులకు సిద్ధమవుతారు. పవిత్ర టెన్త్‌ క్లాస్, ప్రమీల ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నారు. కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ కుటుంబానికి కూడా పరీక్ష పెట్టింది.

బాయ్స్‌ మానేశారు
‘‘మా నాన్నకు న్యూస్‌ పేపర్‌ లైన్‌ ఉంది. ఇరవై ఏళ్లుగా పేపర్‌లు వేస్తున్నాడు. నాన్న దగ్గర బాయ్స్‌ ఉండేవాళ్లు. మా లైన్‌లో మొత్తం ఏడు వందల పేపర్‌లు పడేవి. కరోనా కారణంగా చాలా మంది పేపర్‌ మానేశారు. బాయ్స్‌ కూడా పని మానేశారు. కరోనా భయం తగ్గిన తర్వాత కొందరు బాయ్స్‌ మళ్లీ వచ్చారు. కానీ అప్పటికే పేపర్‌ కాపీలు బాగా తగ్గిపోయాయి. బాయ్స్‌కు ఒక్కొక్కరికి వెయ్యి, పన్నెండు వందలు ఇవ్వాలంటే నాన్నకు కుదిరేది కాదు. బాయ్స్‌ లేకుండా అన్ని ఇళ్లకూ నాన్న ఒక్కడే వేయాలంటే టైమ్‌ సరిపోయేది కాదు. పేపర్‌ లేటుగా వేస్తే కోప్పడతారు కదా! పైగా నాన్న పేపర్‌ వేసిన తరవాత ఫిల్మ్‌ నగర్‌లో రేషన్‌ షాపులో ఉద్యోగానికి వెళ్లాలి. నాన్న అటూ ఇటూ పరుగులు తీయాల్సి వచ్చేది. నాన్న కష్టం చూస్తుంటే బాధనిపించేది. దాంతో ‘మేము పేపర్‌ వేస్తాం నాన్నా’ అని నాన్నని ఒప్పించాం’’ అని చెప్పింది ప్రమీల.

రోజూ పేపర్‌ చదువుతాం
నాన్న పనిలో ఉండడం వల్ల మాకు రోజూ ఇంగ్లిష్, తెలుగు పేపర్‌లు చదవడం అలవాటైంది. మేము చదివేది ఇంగ్లిష్‌ మీడియమే, కానీ చిన్నప్పటి నుంచి పేపర్‌లు చదవడం వల్ల తెలుగు కూడా బాగా వచ్చేసింది’’ అని చెప్పారు ప్రమీల, పవిత్ర. బాగా చదువుకుని పోలీస్‌ ఆఫీసర్‌ అవుతామని చెప్తున్న ఈ అక్కాచెల్లెళ్ల సాహస ప్రస్థానం పలువురికి స్ఫూర్తిదాయకం.

మెచ్చుకుంటున్నారు!
లాక్‌డౌన్‌ పోయి అన్‌లాక్‌ మొదలైంది. కానీ పరిస్థితులు మాత్రం పూర్వపు స్థితికి చేరనేలేదు. పేపర్‌తో కరోనా రాదని తెలిసిన తర్వాత కూడా కాపీలు ముందులాగ పెరగలేదు. ఇప్పుడు మా లైన్‌లో మూడు వందల కాపీలు వేస్తున్నాం. మేము పేపర్‌ వేసే ఇళ్లలో పెద్ద వాళ్లు చాలామంది మమ్మల్ని పలకరించి మాట్లాడతారు. ‘ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, అన్ని పనుల్లోనూ ముందుకు రావాలమ్మా. మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తోంది’ అంటారు.
– ప్రమీల

పేపర్‌ల మధ్య పెరిగాం!
మేము చిన్నప్పుడు సెలవుల్లో నాన్న పేపర్‌ వేయడానికి వెళ్తుంటే మారం చేసి మరీ నాన్న స్కూటీ మీద వెళ్లే వాళ్లం. ఈ కాలనీలన్నీ మాకు బాగా తెలుసు. పేపర్‌ల మధ్యనే పెరిగాం. ఏ కాలనీలో ఏ పేపర్‌ ఎన్ని కాపీలు వేయాలనే లెక్క కూడా త్వరగానే తెలిసింది. మాకిద్దరికీ స్కూటీ నేర్పించాడు నాన్న. మా అక్క రూట్‌లో ఇళ్లు ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి. తను స్కూటీ మీద వెళ్తుంది. దగ్గర దగ్గరగా ఉన్న ఎనభై పేపర్‌ల రూట్‌ నాది. పేపర్‌ వేసిన తరవాత నాన్న, అక్క, నేను ముగ్గురం కలిసి ఇంటికి వెళ్తాం
– పవిత్ర

– వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు