Goiter: గాయిటర్‌ సమస్యల్లో రకాలు... పరిష్కారాలు

24 Apr, 2022 13:30 IST|Sakshi

మన శరీరంలో జరిగే అనేక జీవక్రియలకు గ్రంథుల నుంచి స్రవించే హార్మోన్లు అవసరం. అందులో థైరాయిడ్‌ గ్రంథి చాలా ముఖ్యమైనది. ఇది మెడ ముందు భాగంలో శ్వాసనాళానికి రెండువైపులా సీతాకోకచిలుక రెక్కల ఆకృతిలో ఉంటుంది. థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ ప్రభావంతో థైరాయిడ్‌ గ్రంథి టీ3, టీ4 హార్మోన్లను వెలువరిస్తుంది. థైరాయిడ్‌ గ్రంథిలో అసాధారణ పెరుగుదలను గాయిటర్‌ అంటారు. ఇందులోనూ  రెండు రకాలు ఉంటాయి.మొదటది డిఫ్యూస్‌ గాయిటర్, రెండోది నాడ్యులార్‌ గాయిటర్‌.

థైరాయిడ్‌ గ్రంథి ఉబ్బిపోయి... ఇరువైపులా సమానంగా పెరగడాన్ని  డిఫ్యూస్‌ గాయిటర్‌గా  అంటారు. ఇక నాడ్యులార్‌ గాయిటర్‌లో థైరాయిడ్‌ గ్రంథికి ఒక భాగంలో ఒకటి లేదా మరిన్ని గడ్డలు ఏర్పడతాయి. ఇలా గడ్డల్లాంటివి పెరగడాన్ని నాడ్యులార్‌ గాయిటర్‌ అంటారు. గాయిటర్‌ సమస్య వచ్చిన కొందరిలో థైరాయిడ్‌ హార్మోన్ల ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి మార్పులూ ఉండవు. కానీ మరి కొందరిలో మాత్రం థైరాయిడ్‌ హార్మోన్ల స్రావంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.

అంటే... హార్మోన్‌స్రావాలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. హార్మోన్ల ఉత్పత్తి పెరిగితే ఆ కండిషన్‌ను హైపర్‌ థైరాయిడిజం అని, తగ్గితే హైపోథైరాయిడిజమ్‌ అని అంటారు.  శరీరంలో అయోడిన్‌ లోపం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. థైరాయిడ్‌కు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి థైరాయిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలైన టీ3, టీ4, టీఎస్‌హెచ్, యాంటీ థైరాయిడ్‌ యాంటీబాడీస్‌ వంటి పరీక్షలు చేసి, సమస్యను  నిర్ధారణ చేస్తారు. ఫలితాలను బట్టి చికిత్స అవసరమవుతుంది. థైరాయిడ్‌ క్యాన్సర్‌ సమస్యను మినహాయించి... సాధారణంగా థెరాయిడ్‌ గ్రంథి వాపు (గాయిటర్‌) సమస్యను ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయవచ్చు.
 

మరిన్ని వార్తలు