మలి వసంతమూ సంతసమే..

29 Nov, 2021 05:35 IST|Sakshi

మంచిమాట

ప్రతి మనిషి జీవిత దశని రెండు ప్రధాన అంగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూ భార్యాబిడ్డలతో కాలాన్ని గడపడం. రెండోది.. బాధ్యతలను పూర్తిచేసి, ఉద్యోగవిరమణ తర్వాత లేదా ఆరు పదులు నిండాక గడిపే కాలం. వీటిలో మొదటి దశకే ప్రాధాన్యం ఉందని,  రెండో దశ పనికిరానిదని భావించడం ఏమాత్రం సమంజసం కాదు.

మానవుడు జన్మించాక తన జీవనకాలంలో విభిన్నమైన పరిణామదశలను ఎదుర్కొంటాడు. ముందుగా బాల్యం, తర్వాత కౌమారం, ఆ తర్వాత యవ్వన, ప్రౌఢ దశలను దాటుకుని వృద్ధాప్యంలోనికి అడుగిడడం జరుగుతుంది. ఇది అత్యంత సహజంగా జరిగే జీవన క్రమం. వృద్ధాప్యంలోనికి రాగానే జీవితం అంతా అయిపోయిందని అధిక శాతం వృద్ధులు నైరాశ్యానికి గురి అవుతూ ఉంటారు. అది చాలా తప్పు. ప్రతి జీవన దశలోనూ మనిషికి ప్రత్యేకమైన విషయాలపై శ్రద్ధ కనబరచవలసి ఉంటుంది. అదే విధంగా వృద్ధాప్యంలోనూ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే, మలిసంజెలో వెల్లివిరిసే కాంతులు వారికి మనోహరంగానే అగుపిస్తాయి.

బాల్యంలో, యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలుఆ దశలు పూర్తి అయిన తర్వాతి దశల్లో కూడా మనకు గుర్తుంటాయి.యవ్వనంలో జీవితాన్ని అనుభవించినప్పటి అందమైన రూపం, దఢమైనశరీరం ఇప్పుడు లేకపోయినా, అప్పటి అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో పదిలంగా, మధురంగా మన మనస్సులో గుర్తుంటుంది.

వృద్ధాప్యంలో ప్రతివారి మదిలో కలిగే సందేహమూ, వారుప్రకటించే భావమూ ఒకటే.. ‘‘నేను ఇది వరకు ఉన్నట్లుగా ఉండలేకపోతున్నాను’’ అనే మాట.  ఇది చాలా పెద్ద తప్పిదం. యవ్వనంలో ఉన్నట్లుగా ప్రౌఢవయసులో మనిషి ఉండలేనట్లే, వృద్ధాప్యంలోనూ ప్రౌఢవయసులో ఉన్న సత్తువ మనిషిలో ఉండదు. ఈ విషయాన్ని గ్రహించకపోవడం, గ్రహించినా, విచారిస్తూ ఉండడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. యవ్వనంలో దట్టమైన పటుత్వం, దిట్టమైన బిగువు జీవులందరికీ భగవానుడు ప్రసాదించే సహజ గుణం. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ బిగువు సడలుతూ ఉంటుంది. దానికి ఆవేదన చెందడం నిరర్ధకం. అది శరీరానికుండే సహజ లక్షణం.

వయసు పెరుగుతున్నకొద్దీ మనిషికి పెరిగే సంపద ఆపారమైన వారి అనుభవం. గడచిపోయిన కాలం ఒక అనుభవాల సుమహారంలా వారి చెంత పరిమళిస్తూ ఉంటుంది. ఎంతో విలువైన అనుభవాలు, అవి నేర్పిన పాఠాలను యువతరానికి నేర్పడాన్ని మించిన ఆనందం ఎవరికన్నా ఏముంటుంది? ప్రతి అనుభవం ఎంతో విలువైనది. ఎన్నో కష్టాలను, దుఃఖాలను దాటుకుని తెచ్చుకున్న విజయాలను పంచుకుని భావి తరాలను తీర్చిదిద్దగలిగింది విశ్రాంత జీవనం గడిపి మలి సంజలో కాలం గడిపే అనుభవ సంపన్నులే. వారి అనుభవాల చేవను ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథాలూ అందించలేవు. అనుభవైక వేద్యమైన వారి జీవనగమనాన్ని కొడుకులతో, మనవళ్ళతో పంచుకుంటూ గడపడం ఆహ్లాదకరమైన విషయం.

వృద్ధులు పండుటాకులు కాదు. అనుభవంతో మన ముందు నిలిచే నిండైన అమృతభాండాలు..అనుభవాలను పంచుకునే సమయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతివాళ్ళూ ఆచరించాలి. పిల్లలకు మంచి విషయాలను బోధించడంలో తమను తాము నియంత్రించుకోవాలి. ‘‘మా రోజుల్లో ఇటువంటివి లేనేలేవు.. మేము ఆ రోజుల్లో ఈ విధంగానే చేశామా’’ అన్న నిరసనాపూర్వక మాటలను మాట్లాడకూడదు. ఈ తరహా మాటలను నేటి తరం ఏ మాత్రం హర్షించదు. ‘‘నువ్వు వెళ్ళే పద్ధతి బావుంది.. కొంచెం నేను చెప్పేది కూడా నీ విజయానికి గానీ, నీ సమస్య పరిష్కారానికి గానీ పనికి వస్తుందేమో చూడు’’ అని మృదువుగా అంటే చాలు, ఆ మాటలు యువత హృదయానికి మరింత గా చేరువ అవుతాయి. పెద్దవాళ్ళు ఆ విధంగా మాట్లాడితే, తమ తర్వాతి తరం వారిని తప్పు పడుతున్నట్లుగా గాక, సాఫల్యపు బాటలో నడిపిన వాళ్ళవుతారు.

దేశంలోని, ప్రపంచంలోని రకరకాల ప్రదేశాలు చూసే అవకాశం కేవలంవిశ్రాంత జీవనంలోనే ఎవరికైనా సాధ్యమవుతుంది. ఉద్యోగంలో లేదా వేరే వ్యాపకంలో ఉండే పని  ఒత్తిడి వల్ల కొత్త ప్రదేశాలు చూసే సౌలభ్యం తక్కువగానే ఉంటుంది. ఆ విధంగా కొత్త కొత్తవిహారాల్లో సందర్శించే ప్రదేశాలు, అక్కడి ఆహారపు అలవాట్లు, అభిరుచులు తిలకించి ఆనందం పొందడం ద్వారా వృద్ధుల మనసు మరింతగా ఉత్తేజితమవుతుంది. మరింతగా వాళ్ళను చిన్నవాళ్ళను చేసి ఆనంద సంభరితుల్ని చేస్తుంది.

యవ్వనంలో, ప్రౌఢవయసులో వచ్చే ఆనందం దొంతర దొంతరలయితే, పెద్ద వయసులో అనుభవంవల్ల అలరించే ఆనందం మన ఊహకందే పిల్ల తెమ్మెరలా హాయిగా మనసును  సోకుతూ ఉంటుంది. వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. మదిలో మెదిలే భావాలకు అనుగుణంగా మన జీవన నావ సాగుతూ ఉంటుంది. నేను ఎన్నటికీ నవ యువకుడినే అన్న భావం మదిలో నింపుకుంటే ఆనందం సముద్ర తరంగాల్లా ఉరకలు వేస్తూనే ఉంటుంది. మనం సాధించిన విజయాలూ మన జ్ఞాపకాల పందిరిలోంచి పరిమళించే మల్లికల్లా తొంగి చూస్తూ ఉత్సాహానికి ఊపిరులూదుతూనే ఉంటాయి.

పెద్దవయసులో గుర్తుపెట్టుకోవలసింది మన వయసునుకాదు.. గడిపే ప్రతి క్షణం తీసుకువచ్చే ఆనందాన్ని మాత్రమే..!! యవ్వనం కొంగ్రొత్త భోగాల సారం.. వృద్ధాప్యం అనుభవాల మణిహారం..!!

వృద్ధాప్యం శాపం కాదు...ఆస్వాదిస్తే అణువణువూ ఆనందమే! ప్రతి జీవీ తమ జీవితంలో వృద్ధాప్యాన్ని ఎదుర్కొనక తప్పదు. అయితే ఈ వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా వరంగా భావించి ఆస్వాదిస్తే వృద్ధాప్యంలో కూడా హాయిగా సమయాన్ని అనుభవించవచ్చు. వృద్ధాప్యాన్ని బాధామయమని భావించకుండా, మన కోసం మనం జీవించే అద్భుత అవకాశంగా భావించిన నాడు వృద్ధాప్యం ఏ మాత్రం బాధించదు.

– వ్యాఖ్యాన విశారద
వెంకట్‌ గరికపాటి

మరిన్ని వార్తలు