నిద్రలేమితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి!

11 Feb, 2021 10:10 IST|Sakshi

రోజూ తగినంత నిద్రపోవడం కూడా ఆరోగ్యాన్ని చేకూర్చే అంశాల్లో ఒకటి. సరిపడనంత నిద్ర పట్టకపోవడాన్ని ‘నిద్రలేమి’ (ఇన్‌సామ్నియా)గా వ్యవహరిస్తారు. ఇది కూడా అందరిలో ఒకేలా ఉండదు

నిద్రలేమిలో రకాలివి... 
ప్రైమరీ ఇన్‌సామ్నియా:స్వాభావికంగానే నిద్రపట్టకపోవడాన్ని ప్రైమరీ ఇన్‌సామ్నియా అంటారు. అంటే... ఇది శరీరంలోని ఏదో అవయవం లేదా భాగంలోని సమస్య వల్ల నిద్రపట్టకపోవడం కాదన్నమాట.. 
సెకండరీ ఇన్‌సామ్నియా: మన శరీరంలోని ఏదైనా ఇతర సమస్య వల్ల నిద్రలేమి రావడాన్ని సెకండరీ ఇన్‌సామ్నియా అంటారు. అంటే ఉదాహరణకు ఆస్తమా, డిప్రెషన్, క్యాన్సర్, గుండెమంట, కీళ్లనొప్పులు లేదా ఇతర అవయవాల్లో ఏదైనా నొప్పి వల్ల నిద్రపట్టకపోవడం మత్తుపదార్థాలు తీసుకోవడం వల్ల నిద్రపట్టకపోవడం లేదా ఒక్కోసారి పట్టలేని సంతోషం లేదా తీవ్రమైన దుఃఖం వల్ల నిద్రపట్టకపోవడాన్ని సెకండరీ ఇన్‌సామ్నియాగా అభివర్ణిస్తారు. 
► నిద్రలేమి కూడా మరో రెండు రకాలుగా ఉండవచ్చు. అది తాత్కాలిక నిద్రలేమి, రెండోది దీర్ఘకాలిక నిద్రలేమి. మొదటిది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అయితే అది మరీ దీర్ఘకాలం (అంటే మూడు వారాల కంటే ఎక్కువగా) కొనసాగితే దాన్ని దీర్ఘకాలిక నిద్రలేమి అనవచ్చు. 

కారణాలు
► జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు (ఉద్యోగం మారడం, దగ్గరి బంధువులు చనిపోవడం, విదేశాలకు వెళ్లడం, విడాకులు, రోడ్డు ప్రమాదాల వంటివి). 
► శారీరక మానసిక ఆందోళనలు, సమస్యలు 
► వాతావరణ పరిస్థితుల ప్రభావాలు (పెద్దశబ్దం, ఎక్కువ కాంతి, ఎక్కువ వేడి/చలి). 
► కొన్నిరకాల మందులు (ఉదా: జలుబు, అలర్జీ, ఆస్తమా, డిప్రెషన్, బీపీలకు వాడేమందులు). 

అసలు నిద్రపట్టకపోవడం 
► పడుకున్న తర్వాత మధ్యలో మెలకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టకపోవడం 
► తెల్లవారుజామున మెలకువ వచ్చి ఆ తర్వాత నిద్రపోలేకపోవడం 
►ఉదయం లేవగానే అలసటగా ఉండటం... 
► ఇలాంటి లక్షణాలతో నిద్రలేమి ఉంటుంది. 
చదవండి: వంటలూ వడ్డింపులతో క్యాన్సర్‌ నివారణ
ప్రీ–హైపర్‌టెన్షన్‌ దశ అంటే..?

చికిత్స
తాత్కాలిక నిద్రలేమికి చికిత్స అవసరం లేదు. కాకపోతే వేళకు నిద్రపోవడం వంటి మంచి అలవాట్ల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇక దీర్ఘకాలిక నిద్రలేమి ఉన్నప్పుడు శారీరక, మానసిక సమస్యల వల్ల ఇలా జరుగుతుందేమో పరిశీలించి, వాటికి చికిత్స చేయించుకుంటూ తాత్కాలికంగా నిద్రమాత్రలు వాడవచ్చు. అయితే వాటిని కూడా దీర్ఘకాలం వాడటం వల్ల ఇతర సమస్యలు రావచ్చు కాబట్టి వాటిని పరిమితంగా వాడాల్సి ఉంటుంది. జీవనశైలి మార్పులతో నిద్రను పొందడం మంచిది. దానితో పాటు కొన్నిరకాల విశ్రాంతి వ్యాయామాలు, కౌన్సెలింగ్‌ వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. 
చదవండి: ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోండిలా..

నిద్రలేమిని అధిగమించడానికి కొన్ని సూచనలు 
► వేళకు నిద్రపోవాలి. రోజూ వేళకు నిద్రలేవాలి. మధ్యాహ్నం వేళ చిన్న కునుకు తీయకుండా ఉండాలి. ఇలే చేస్తే అది రాత్రి నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. 
► కాఫీ, నికోటిక్, ఆల్కహాల్‌ అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇవి ఉత్ప్రేరకాలుగా పనిచేసి నిద్రలేమికి కారణమవుతాయి. 
► వ్యాయామాన్ని జీవితంలో ఒక అంశం చేసుకోవాలి. అయితే నిద్రకు ఉపక్రమించే 3–4 గంటల ముందర వ్యాయామం చేయకూడదు. దీనివల్ల నిద్రపట్టే సమయంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. 
► పడకగది సౌకర్యంగా ఉండాలి. గది నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండాలి. మరీ చీకటిగానూ, మరీ ఎక్కువ వెలుతురుతోనూ ఉండకూడదు. మరీ చలిగానూ, మరీ వేడిగానూ ఉండకూడదు. 
బనిద్రవేళకు ముందు మంచి పుస్తకం, మంచి సంగీతం వినవచ్చు. అయితే నిద్రపోయే సమయం మించిపోయాక కూడా వాటిలో నిమగ్నం కావడం సరికాదు. గోరువెచ్చని స్నానం సుఖనిద్రను కలగజేస్తుంది. 
► పడుకునే ముందు మనసులోకి ఎలాంటి ఆందోళనలూ రానివ్వకండి. రేపటి కార్యక్రమాలను ముందుగానే రాసి పెట్టుకోండి. దానివల్ల మీకు ఎలాంటి ఆందోళనా కలగదు.
-డాక్టర్‌ రమణ ప్రసాద్‌, కన్సల్టెంట్‌ పల్మునాలజిస్ట్‌ – స్లీప్‌ స్పెషలిస్ట్‌ 

మరిన్ని వార్తలు