‘రాజ కుటుంబాలు ఆకాశం దిగి నేలకు రావు’.. అదేమీ కాదు!

16 Mar, 2023 17:03 IST|Sakshi

సామాన్యుల రాకుమారి

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ మొదలైన ప్రాంతాల్లో రాజులకు సంబంధించి ఎన్నో విషయాలు వినిపిస్తుంటాయి. ఆ ముచ్చట్లు ‘రాజ కుటుంబాలు ఆకాశం దిగి నేలకు రావు’ అన్నట్లుగా ఉండేవి. అదేమీ కాదని నిరూపించింది ఉదయ్‌పూర్‌ రాకుమారి పద్మజ కుమారి మేవార్‌.

ఆమెకు పల్లె గుండె తెలుసు. పక్షులను, పచ్చదనాన్ని ఎలా కాపాడుకోవాలో  తెలుసు... రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ రాజకుటుంబంలో పుట్టింది పద్మజ కుమారి మేవార్‌. అమ్మ, నాన్నమ్మల నుంచి ఎన్నో జానపదకథలు విన్నది. ఆ కథల్లో ఎన్నో అందమైన అడవులు, అపురూపమైన జంతుజాలం ఉండేవి. కాల్పనిక ప్రపంచం దాటి బయటికి వస్తే పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.

అడవులు కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాల గురించి నాన్న మాటల్లో ఎన్నోసార్లు విన్నది.
హైస్కూల్‌ చదువు నుంచి డిగ్రీ వరకు అమెరికాలో చదువుకున్న పద్మజ కుమారి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసింది.
చదువు పూర్తయిందో లేదో ఆమె ‘భగీర’ క్యాంపులోకి అడుగుపెట్టింది.

సామాజిక సేవా కార్యక్రమాల కోసం తల్లిదండ్రులు రాణి దుర్గేష్‌ నందిని, మహారాజా రాజేంద్రసింగ్‌ ఈ క్యాంపుకు శ్రీకారం చుట్టారు. ఈ క్యాంప్‌లోని గదులను స్థానికులే, స్థానికంగా దొరికే వనరులతో నిర్మించారు. గోద్వారీ ప్రాంతంలో ఉన్న ఈ క్యాంపు కేంద్రంగా వనసంరక్షణ, స్త్రీ సాధికారత, ఆరోగ్యం, జలసంరక్షణ... మొదలైన కార్యక్రమాలు చేపట్టారు.

పద్మజ కుమారి ఈ క్యాంప్‌లోకి అడుగు పెట్టిన తరువాత క్యాంపుకు కొత్త శక్తి వచ్చి చేరింది. ఆమెకు ఆ ప్రాంతంలో ప్రతి ఊరూ కొట్టిన పిండే.
గోద్వారీ ప్రాంతం 235 రకాల పక్షులకు, 35 రకాల ఔషధ మొక్కలకు నిలయం.
‘మన దగ్గర అపూర్వమైన సంపద ఉంది. వాటిని పరిరక్షించుకోవాలి’ అంటూ ఊరువాడా తిరిగింది. గిరిజన ప్రాంతాల్లో స్కూల్స్‌ మొదలుపెట్డడం ద్వారా పిల్లల్లో చైతన్యం తీసుకువచ్చింది.

సామాజిక చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలే కాదు స్థానికులకు ఉపాధి కల్పించే పనులకు శ్రీకారం చుట్టింది.
‘ఈ క్యాంపులోకి అడుగు పెడితే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. ఎంతో ధైర్యం వస్తుంది’ అంటారు స్థానికులు.
ఇప్పుడు వారికి రకరకాల పక్షుల పేర్లు, వాటి పుట్టు పూర్వోత్తరాలు, ఔషధ మొక్కల పేర్లు, వాటి ఉపయోగాలు తెలియడం మాత్రమే కాదు వాటిని ఎలా కాపాడుకోవాలో కూడా బాగా తెలుసు.

‘పెద్ద చదువులు చదువుకున్నావు. ఇక్కడికి ఎందుకు తల్లీ’అని తల్లిదండ్రులు అనలేదు. అదే తనకు మహాబలం అయింది.
ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాలు తిరిగిన పద్మజ కుమారికి, సామాజికసేవలో కొత్త ప్రపంచం కనిపించింది. ఎన్నో లక్ష్యాలు ఏర్పడ్డాయి. అందులో ఒకటి వైల్డ్‌లైఫ్‌ టూరిజం కేంద్రంగా గోద్వారీ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని. స్థానికుల స్పందన, చైతన్యం పద్మజ కుమారి సంకల్పబలం చూస్తుంటే అదేమీ కష్టం కాదు అనిపిస్తుంది. 

మరిన్ని వార్తలు