ఉదయ్‌పూర్‌ టూర్‌: క్రిస్టల్‌ గ్యాలరీ ప్రత్యేకత ఏంటో తెలుసా?

12 Apr, 2021 13:09 IST|Sakshi

ఉదయ్‌పూర్‌ టూర్‌లో... జగ్‌మోహన్‌ ప్యాలెస్‌...  సిటీ ప్యాలెస్‌... జగ్‌మందిర్‌... దర్బార్‌ మహల్‌... పిచోలా సరస్సు... రోజుకు ఉన్నది ఇరవై నాలుగ్గంటలే. ఒక రోజు సరిపోదని తెలుస్తుంది. చూసేవి కొన్ని టైమ్‌ సరిపోక వదిలేవి కొన్ని వాటిలో ఫతే ప్రకాశ్‌ ప్యాలెస్‌ ఉంటుంది. ఇందులోని క్రిస్టల్‌ గ్యాలరీని ఆసాంతం చూడాలంటే  మూడు గంటలు పడుతుంది. అందుకే వదిలేసి వాటిలో తొలిస్థానంలో ఉంటుంది. కానీ చూడాల్సిన వాటిలో తొలి స్థానం దీనిది.

ఉదయ్‌పూర్‌లో ఉన్న ప్రదేశాలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఏ రెండింటినీ సరిపోల్చి... ఇది ఎక్కువ, ఇది మధ్యమం, ఇది తక్కువ అని వర్గీకరించలేం. దేనికదే వైవిధ్యం. వైవిధ్యానికి, నైపుణ్యానికి పరాకాష్ట ఫతేప్రకాశ్‌ ప్యాలెస్‌లోని క్రిస్టల్‌ గ్యాలరీ. ఇక్కడ ఫొటోలకు అనుమతి ఉండదు. టికెట్‌ కౌంటర్‌ దగ్గర పర్యాటకుల కెమెరాలు, స్మార్ట్‌ ఫోన్‌లను తీసుకుంటారు. ఆధార్, పాన్‌ కార్డ్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి ఏదో ఒక ఫొటో ఐడీ కార్డు, ఒక ఫొటోకాపీ కౌంటర్‌లో ఇవ్వాలి. టికెట్‌తోపాటు పర్యాటకులకు ఒక ఆడియో డివైజ్‌ ఇస్తారు. చిన్న కాలిక్యులేటర్‌లా ఉంటుంది. ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని మ్యూజియంలో ఒక్కొక్క గదిలోకి వెళ్లినప్పుడు ఆ డివైజ్‌లో ఆ నంబర్‌ నొక్కాలి. ఆ గదిలో మనం చూస్తున్న కళాఖండాల గురించిన వివరాలు వినిపిస్తాయి.

షాండ్లియర్‌ ప్రత్యేకం
ఈ ప్యాలెస్‌లో పెద్ద షాండ్లియర్‌ ఉంది. అది మన దేశంలో ఉండే షాండ్లియర్‌లలో రెండవ అతిపెద్ద షాండ్లియర్, మొదటిది మన హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఉంది. ఫతే ప్రకాశ్‌ ప్యాలెస్‌ నుంచి చూస్తే లేక్‌ ప్యాలెస్‌ కూడా కనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే క్రిస్టల్‌ గ్యాలరీ ఓ కొత్త లోకంలో విహరించిన అనుభూతినిస్తుంది. ఈ ఒక్క ప్యాలెస్‌కే ఏడు వందల రూపాయలు పెట్టి టికెట్‌ తీసుకునేటప్పుడు టికెట్‌ ధర మరీ ఎక్కువ అనిపిస్తుంది. కానీ ప్యాలెస్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు వర్త్‌ సీయింగ్‌ అనే సంతృప్తితో బయటకు వస్తాం.

కంచాలు... మంచాలు క్రిస్టల్‌లోనే
క్రిస్టల్‌ గ్యాలరీలో ఒక్కో గదిని చూస్తూ పదిహేనవ గదిలో రాగానే ఒక మూలగా మెరూన్‌ కలర్‌ ముఖమల్‌ క్లాత్‌తో కుట్టిన కుషన్‌ చెయిర్‌ కనిపించింది. హమ్మయ్య కూర్చోవడానికి వెసులుబాటు ఉందని కూర్చోబోయేంతలో బారికేడ్‌ రిబ్బన్‌ అడ్డు తగిలింది. అది మామూలు కుర్చీ కాదు, క్రిస్టల్‌ కుర్చీ. క్రిస్టల్‌తో గ్యాలరీ అంటే ప్రదర్శనలో చిన్న చిన్న వస్తువులు ఉంటాయనుకుంటాం.

కానీ లోపలికి వెళ్తే కప్పులు, సాసర్‌లు, స్పూన్‌లు, గాజు ప్లేట్‌ల నుంచి సోఫాలు, కుర్చీలు, మంచాలు వరకు ఉన్నాయి. ఇవన్నీ మోజు కొద్దీ తయారు చేసి షో పీస్‌లలాగ అలంకరించుకున్నారా లేక ఉపయోగించారా అనే సందేహం కూడా కలుగుతుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ఈ గ్యాలరీలోకి గైడ్‌కు అనుమతి ఉండదు. గ్యాలరీ విజిట్‌ పూర్తయిన తర్వాత ఆడియో డివైజ్‌ కౌంటర్‌లో వెనక్కి ఇచ్చేటప్పుడు అడుగుదామంటే వాళ్ల దగ్గర సమాధానం ఉండదు. ఆడియో డివైజ్‌ వెనక్కి ఇచ్చిన తర్వాత మన ఐడీకార్డు ఇస్తారు.

ఆరావళి కొండల్లో సూర్యోదయం
ఉదయ్‌పూర్‌లో ఎయిర్‌పోర్టు ఉంది. కానీ ఒక వైపు జర్నీ అయినా రైల్లో చేస్తే బాగుంటుంది. ఆరావళి పర్వత సానువుల మధ్య కొండలను చుడుతూ సాగుతుంది ప్రయాణం. సూర్యుడితో దోబూచులాడాలంటే ఉదయానికి ఉదయ్‌పూర్‌ చేరే ట్రైన్‌ అయితే మంచిది. కొండల మధ్య ప్రయాణిస్తూన్నప్పుడు కొండ వాలులో నుంచి ఉదయిస్తున్న సూర్యుడు పలకరిస్తాడు. మనకున్న అనుభవంలో ఒకసారి ఉదయించిన సూర్యుడు సాయంత్రం వరకు కనిపిస్తూనే ఉంటాడు కదా అన్నట్లు పరాకుగా ఉంటాం. చూస్తున్నంతలోనే సూర్యుడు చటుక్కున మాయమైపోతాడు. మరో కొండ అడ్డు వచ్చిందన్నమాట.

అలా రైలు కొండల మధ్య మలుపులు తిరుగుతున్నంత సేపూ ఈ ప్రకృతి అద్భుతాన్ని ఆస్వాదించవచ్చు. కొండల మధ్య సూర్యోదయాన్ని చూడడం కుదరకపోతే ఉదయ్‌పూర్‌ పర్యటనలో సూర్యాస్తమయం సమయంలో రోడ్డు జర్నీ అయినా ప్లాన్‌ చేసుకుని తీరాలి. సూర్యుడు ఒకసారి మనకు కుడివైపు కనిపిస్తాడు. వెంటనే మాయమై పోయి మరో ఐదు నిమిషాల్లో ఎదురుగా ప్రత్యక్షమవుతాడు. ఈ విన్యాసాలకు ఆలవాలం ఆరావళి పర్వతశ్రేణులు. ఉదయ్‌పూర్‌ పర్యటనలో మిస్‌ కాకూడని ప్రకృతి సౌందర్యం.
చదవండి: Jodeghat Museum: జోడెన్‌ఘాట్‌ వీరభూమి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు