ఉగాది.. కాలగమన సౌధానికి తొలి వాకిలి

12 Apr, 2021 12:00 IST|Sakshi

ఏప్రిల్‌ 13 మంగళవారం ఉగాది

ఉగాది పండుగ మన పంచాంగం ప్రకారం మొదటి పండుగ. యుగప్రారంభాన్ని యుగాది అంటారు.  ఈ యుగాది శబ్దం ఉగాది  అనే కొత్త శబ్దాన్ని ఉత్పత్తి చేసింది. ఇక్కడ ఉగాది అంటే సంవత్సరానికి ప్రథమ దినం. మనకు నాలుగు యుగాలు ఉన్నాయి ఇవి చక్రంలా తిరుగుతూ ఒకదాని తరువాత వేరొకటి వస్తూ వుంటాయి. ఈ యుగాలు వరుసగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, చివరిది కలియుగం. ఇప్పుడు మనం కలియు గంలో ఉన్నాము. వైవస్వత మన్వంతరంలో ఇప్పటివరకు ఇరవై ఏడు మహాయుగాలు జరిగిపోయాయి. ఇరవై ఎనిమిదవ యుగం జరుగుతోంది. ఈ మహాయుగంలో కృత, త్రేతా, ద్వాపర యుగాలు గడచిపోయాయి. ఇప్పటికి కలియుగంలో 5120 సంవత్సరాలు పూర్తయ్యాయి. శార్వరి నామ సంవత్సరం సెలవు తీసుకుని13 ఏప్రిల్‌న శ్రీ ప్లవనామ సంవత్సరం ప్రవేశిస్తోంది.

చైత్రశుద్ధ పాడ్యమి అనగా ఉగాది పర్వదినం. కాలగమన సౌధానికి తొలి వాకిలి. ఋతు సంబంధ ప్రథమ ఆరోగ్యకోకిల గానం నూతన సంవత్సరానికి శ్రీకారం. ప్రజల మధ్య పెంపొందించే మమకారం. బహు సాంప్రదాయాలకు సాకార క్రియారూపం. ఆబాలగోపాలం ఆనందంగా చేసుకునే పండుగ ఉగాది. పౌర్ణమిరోజున చంద్రుడు ఏ నక్షత్రంలోఉంటాడో ఆ మాసానికి అదే పేరు ఉంటుంది. చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉండటం వలన ఈ మాసావికి చైత్రమాసం అని పేరు.

అన్ని ఋతువులకన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. ఋతూనాం కుసుమాకరః– ఋతువుల్లో చెట్లు చిగిర్చి పూవులు పూయు వసంత ఋతువును నేనే అని తన ముఖ్య విభూతులు చెప్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. కోకిల పాటలు, సన్నజాజి, మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతిమాత కొత్త అందాలు సంతరించు కుంటుంది. వసంత ఋతువు చైత్రమాసంతో మొదలవుతుంది. మనిషిని, మనస్సును, బుద్ధిని వికసింపజేసే అహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. 

ఉగాది నాడు ఏం చేయాలి? 
ఈనాడు మనమేం చేయాలో మన పెద్దలు నిర్దేశించారు. నూతన సంవత్సర కీర్తనలు చేస్తూ, తలంటు పోసుకుని నూతన వస్త్రాలు ధరించి, ధ్వజారోహణ చేయాలి. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినాలి. వేపపూత, కొత్త బెల్లం, మామిడి పిందెలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు. దీని సేవనం వల్ల వాత, కఫ దోషాలు తొలగుతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ పచ్చడిని సంవత్సరానికి ఒకమారు ఉగాది నాడు తింటే దీని ప్రభావం తిరిగి ఉగాది వచ్చేవరకు ఉంటుందని నమ్మకం.

ఈ రోజు పంచాంగం వినాలి కాలగతిని లెక్కించడానికి చంద్రుని గమనాన్ని అనుసరించడం సులభమైన విధానం. అందువల్ల చైత్రమాసంలో కూడా శుద్ధపాడ్యమినే, అంటే చంద్రుడి కళలు వృద్ధి చెందడం మొదలయ్యే సమయమే ‘ఉగాది ’ అని కమలాకరభట్టు ప్రతిపాదించారు. ‘చతుర్వర్గ చింతామణి’ అను గ్రంథంలో బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజే మనం ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది అని ఆ గ్రంధకర్త హేమాద్రి పండితుడు తెలియజేసారు.

అయితే ఈ పండుగ ఏ దేవుడి/దేవత ప్రీతి కొరకు చేస్తున్నాము, ఎవరిని ధ్యానించాలి? ఈ పండుగకు అధిదేవత రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి లేదా వినాయకుడు వంటి దేవతలు కారు. కాలపురుషుడు ఈ పర్వపు అధిదేవత. ‘ఓం కాలాయనమః’ అనే నమక మంత్రం గాని విష్ణు సహస్రం గాని పఠించాలి. భగవంతుడే కాలపురుషుడని, నిత్యం అతణ్ణి ధ్యానించాలని శాస్త్రం చెబుతోంది.

మానవ జీవితం అంతా కాలం పైననే ఆధారపడి ఉండుట వలన కాలపురుషుని ఆరాధించాలి. మనం చేసే పంచాంగ శ్రవణమే ఈ ఆరాధన. విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పబడినట్లు మనం ఏ రూపంలో స్తుతించినా అది పరమాత్మునికే చెందుతుంది. ఈ దృష్టితో కాలపురుషుని పంచాంగ శ్రవణ రూపాన స్తుతించాలి. ఇంకనూ సత్కర్మానుష్టానానికి కావలసిన కాల విశేషణాలను తెలుసుకోవడమే పంచాంగం పరమ ప్రయోజనం.

తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనేవి పంచాంగాలు. ఒక శుభ కార్యం గాని ఒక ధర్మకార్యం గాని చేయడానికి పంచాంగమే మనకు మార్గదర్శనం చేస్తుంది. ఈ చైత్రమాసపు శుద్ధ పాడ్యమి నుంచి వసంతరాత్రులు జరుపుకుంటారు. అంతేకాదు, తెలుగువారి ప్రీతికరమైన శ్రీ రామనవమి కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది విశ్వ మానవ సౌభ్రాభృత్వాన్ని, సకల జీవులకు సుఖశాంతులు ప్రసాదించగలదని ఆకాంక్షిద్దాం.
– గుమ్మా ప్రసాదరావు
చదవండి: పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి

మరిన్ని వార్తలు