Ugadi 2022: ఉగాది పచ్చడిలో ఎన్ని చెట్ల అవసరం ఉంది? వాటి గురించి పిల్లలకు ఏం తెలుసు?

1 Apr, 2022 11:06 IST|Sakshi

ఉగాది సమయం ఆ వేప పూత ఆ మావి వగరు ఆ చింత చిగురు ‘పదిగ్రాముల వేపపూత 200 రూపాయలు’... ఆన్‌లైన్‌లో చూసి కొనేంతగా ఎదిగాం. ప్రకృతితో కలిసి చేసేదే పండగ... ఉగాది వేళలో మావిచిగురు కోకిల పాట... గాలికి ఊగే వేపపూత... ఈకాలపు పిల్లలకు తెలియని దూరానికి చేరాం. గతంలో వేప చెట్టు, మావిడి చెట్టు... ప్రతి వీధిలో ఉండేవి.  ఇప్పుడు? పండగ హడావిడికి సిద్ధమవుతున్నాం. ప్రకృతి స్తబ్దతను గమనిస్తున్నామా?

ఉగాది పచ్చడిలో ఎన్ని చెట్ల అవసరం ఉంది? వేపచెట్టు. వేపపువ్వు చేదుకి. మామిడి చెట్టు. మామిడి పిందె వగరుకి. చింతచెట్టు. పులుపు రుచికి. కొన్నిచోట్ల కొబ్బరి కోరు వేస్తారు. అంటే కొబ్బరి చెట్టు. మరికొన్ని చోట్ల బాగా మగ్గిన అరటిపండు ముక్కలు కలుపుతారు. అంటే అరటి చెట్టు. ఇవన్నీ ఇప్పుడు ఎన్ని ఇళ్లల్లో ఉన్నాయి. పిల్లలు ఎంతమంది వీటిని తాకి చూస్తున్నారు. ఎందరు వీటి నీడలో ఆడుతున్నారు. ఎందరు వీటిని చూశాం అని చెబుతున్నారు. నగరం అయినా.. పట్టణం అయినా.. పల్లె అయినా.

ఆ వేప కొమ్మలు... చెట్టు పెంచడం మన ఆచారం. చెట్టుతో పాటు ఇల్లు ఉండాలనుకోవడం మన సంస్కృతి. ప్రతి వీధికి వేప చెట్టు అరుగు ఉండేది. వీధిలోని ఒకటి రెండు ఇళ్ల వాళ్లయినా ముంగిలిలో వేప చెట్టు వేసుకునేవారు. కొన్ని చెట్లు పెరిగి పెద్దవై ప్రహరీగోడను కప్పేసేవి. చెట్ల కొమ్మలు ఇంటి వైపుకు వాలి నీడను పెంచేసేవి. పిల్లలు రాలిన వేప ఆకులు తొక్కుకుంటూ ఆడుకునేవారు. పసుపుపచ్చటి వేపపండ్లు తుంచి వగరు తీపితో ఉండే వాటి రుచిని చూసేవారు.

వాటి గింజలను గుజ్జును పారేసి ఖాళీ డిప్పలలో పుల్లను గుచ్చి ఆడుకునేవారు. వేణ్ణీళ్లలో వేపాకులను కలిపి తల్లులు స్నానం చేయిస్తుండేవారు. నెలకు ఒకటి రెండుసార్లు లేత వేపాకులను నూరి చిన్ని ముద్దలను చేసి చక్కెర అద్ది మింగించేవారు. దడుపు చేస్తే, జ్వరం వస్తే వేప మండలు దిష్టి తీసి నెమ్మది కలిగించేవారు. వేపపుల్లతో పళ్లుతోమడం అలవాటు చేసేవారు. వేపబద్దతో నాలిక గీసుకోవడం ఆరోగ్యం.

ఉగాది పండగ రోజు వేపపూత పిల్లల చేతే కోయించేవారు. వేప బెరడుకు బంక కారితే పిల్లలు దానిని గిల్లి సీసాల్లో దాచుకునేవారు. వేప కాండంపై పాకే గండు చీమలు, గెంతుతూ వెళ్లే ఉడతలు, కొమ్మల్లో గూడు పెట్టే కాకులు, ఇంట్లో కోళ్లు పెంచుతుంటే గనక అవి ఎరిగి రాత్రిళ్లు ఆ కొమ్మలపైనే తీసే నిద్ర... పండగలో చెట్టును పెట్టింది చెట్టును కాపాడుకోమని. ప్రకృతిని తెలుసుకోమని. ఇవాళ పెద్ద చెట్లు వేస్తున్న ఇళ్లు ఎన్ని? పెద్ద చెట్లకు వీలైన స్థలం ఎక్కడ దొరుకుతోంది? పూల కుండీలు, మిద్దెతోట... సర్దుబాటు జీవనం... రెక్కలు సాచిన విశాలమైన వృక్షాలు గత చరిత్రగా మారాయి.

ఆ మామిడి పిందెలు... మామిడి చెట్టు ఉన్న ఇంటికి మర్యాద జాస్తి. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా వచ్చి మామిడి ఆకులు అడుగుతారు. ఎవరికైనా అడ్రస్‌ చెప్పాలంటే ‘ఆ మామిడి చెట్టున్న ఇల్లు’ అని చెబుతారు. మామిడి చెట్లు చాలామటుకు శుభ్రంగా ఉంటుంది. వాటి గుబురు ఆకులను చూస్తే ఆనందం కలుగుతుంది. వచ్చిన బంధువులంతా ‘ఏ మామిడి’ అని ఆరా తీస్తారు. బంగినిపల్లో, బెంగుళూరో, నీలమో, నాటు మామిడో... ఏదో ఒక జవాబు చెప్పాలి.

పిల్లలు మామిడి కొమ్మలకు తాళ్లు కట్టి ఊయల ఊగుతారు. చిన్న కొమ్మలపై ఎక్కి కూచుంటారు. వేసవి వస్తే ఒళ్లంతా విరగబూసే మామిడి పూత మీద అందరి కళ్లు పడతాయి. పిందెల వేస్తున్నప్పటి నుంచి దిష్టి తగలకుండా యజమానులు నానా పాట్లు పడతారు. ఉండుండి పాడిగాలి వీచి పిందె రాలితే అదో బాధ. కోతుల దండు ఊడి పడితే వాటిని తరిమికొట్టే వరకూ గాబరా. కాయ గుప్పిటంత పెరిగాక కోసి పచ్చడి చేస్తే ఆ రుచి అద్భుతం.

ఉగాది పచ్చడి మన ఇంటి కాయ తెచ్చే రుచి అద్భుతం. చిటారున గుబురులో పండిన కాయ పిల్లలు నిద్ర లేచి చెట్టు కిందకు వెళితే రాలి కనపడుతుంది. కోయిలలు వచ్చి పాట పాడి పిల్లలను బదులివ్వమంటుంది. చిలుకలు పండిన కాయలను సుష్టుగా భోం చేసి ఎర్ర ముక్కులు చూపించి పోతాయి. మామిడి చెట్టు ఉంటే ఇంట్లో ఇంకో మనిషి ఉన్నట్టే. కాని కారు పార్కింగ్‌ కోసం ఆ చెట్టును వదిలేసిన ఇళ్లే ఇప్పుడు. పిల్లలూ... మామిడిపండ్లను మీరు మోర్‌ మార్కెట్స్‌లోనే చూడక తప్పదు.

చింతచెట్టు కథలు జాస్తి... చింతచెట్టు ఇంట్లో పెంచరు. ఆ చెట్టు ఊరిది. ప్రతి ఊళ్లో చింతచెట్టు అరుగు ఉంటుంది. అది మనుషులు కూడా తమ చింతలు మాట్లాడుకునేంత గాఢమైన నీడను కలిగి ఉంటుంది. వేసవి మధ్యాహ్నాలు చింత చెట్టు కింద పట్టే నిద్ర సామాన్యంగా ఉండదు. చింతకాయలు కాస్తే పిల్లలు వాటిని రాళ్లతో రాల్చి నోట పెట్టుకుంటారు. ఆడవాళ్లు దోటీలు పట్టుకుని వచ్చి చింత చిగురు కోసి వండుతారు.

ఊరికి కొత్తగా ఎవరైనా వస్తే చింత చెట్టు ఆరా తీస్తుంది. గూడు లేని వాళ్లకు రాత్రిళ్లు అది ఇల్లు అవుతుంది. కాని చింత చెట్టు అంటే భయం కూడా ఉంటుంది. దెయ్యాలు దానిలో టూ బెడ్రూమ్‌ ఫ్లాట్‌ కట్టుకుని ఉంటాయని పుకార్లు ఉంటాయి. చింతచెట్టు కింద పడుకున్నవారి గుండెల మీద రాత్రుళ్లు దెయ్యం కూచుంటుంది. చింతచెట్టుకు రాత్రిళ్లు కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడిచే సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్లే తగిన ఆక్సిజన్‌ అందక ఈ భ్రాంతులు. చింతచెట్టు లేని బాల్యం చాలా బోసి. కొంగలు వాలడానికి ఇష్టపడే చెట్టు అది. ఇవాళ ఊళ్లలో ఫ్లెక్సీలు ఉన్నాయి. విగ్రహాలు ఉన్నాయి. చింత చెట్టు మాత్రం లేదు.

ఆలోచించాలి అందరం... గతంలో ఎన్నో ఇళ్ల పెరళ్లలో అరటి చెట్లు ఉండేవి. చాలా ఇళ్లల్లో కొబ్బరి చెట్లు వేసేవారు. బాదం చెట్లు పెంచే ఇళ్లకు లెక్క ఉండేది కాదు. చెట్టుకు వదిలాకే కట్టుబడికి స్థలం వదిలేవారు. కట్టేది ఒక ఇల్లయితే చెట్టు నీడ ఒక ఇల్లు అని ఆ కాలంలో తెలుసు. కాని ఇవాళ కాంక్రీట్‌ ఇళ్లు మాత్రమే కట్టి వేడి పెంచుతున్నాం. ఎండ మండుతోందని అవస్థలు పడుతున్నాం.

ఉగాది అంటే చెట్లకు ప్రాభవ సమయాలు ఉన్నట్టు బతుకుకు కూడా ప్రాభవ సమయాలు ఉంటాయని తెలుసుకోవడం. తీపిని ఆస్వాదించడంతో పాటు చేదును మింగాలని తెలుసుకోవడం. తుఫానొచ్చి కొమ్మలు విరిగి పడినా మళ్లీ చిగురించవచ్చని తెలుసుకోవడం.
చెట్టుకు పిల్లల్ని దూరం చేయవద్దు. బాల్యాన్ని అరుచితో నింపొద్దు. ఆలోచించండి. కొత్త ఉగాదికి ఆహ్వానం పలకండి.                                    

మరిన్ని వార్తలు