Ugadi 2022: పరమాన్నం.. నోరూరించే పూర్ణాలు, భక్ష్యాల తయారీ ఇలా!

2 Apr, 2022 10:13 IST|Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సర ఉగాది.. నేటితో  కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. పండుగంటేనే పరమాన్నంతో పాటు భిన్న రుచులను కూడా ఆస్వాదించడం కదా! మరి నోరూరించే ఉగాది రుచుల తయారీ కూడా తెలుసుకుందామా!

ఉగాది పచ్చడి : కావలసినవి: కొత్త బెల్లం – 100 గ్రామలు, పచ్చి మామిడి – ఒకటి (మీడియం సైజు), వేప పువ్వు –  ఒక టేబుల్‌ స్పూన్, పచ్చి మిర్చి – రెండు (తురమాలి), ఉప్పు – చిటికెడు, చింతపండు – పెద్ద నిమ్మకాయంత (కొత్త చింతకాయల నుంచి సేకరించినది). 

తయారీ: ∙బెల్లాన్ని తురిమి, అందులో కొద్దిగా నీటిని చిలకరించి పక్కన ఉంచాలి. ∙వేప పువ్వు కాడలు లేకుండా వలిచి పువ్వు రెక్కలను సేకరించి పక్కన ఉంచాలి. ∙మామిడి కాయ మొదలు (సొన కారే భాగం) తీసేయాలి. కాయను నిలువుగా కోసి లోపలి గింజను కూడా తీసేయాలి.

ఇప్పుడు మామిడి కాయను తొక్కతోపాటు సన్నగా ముక్కలు తరగాలి లేదా తురిమి బెల్లం నీటిలో వేయాలి. ∙చింతపండు గుజ్జును చిక్కగా రసం తీసి పై మిశ్రమంలో కలపాలి. అందులో పచ్చిమిర్చి తురుము, ఉప్పు, వేప పూత వేసి కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా ఉంటుంది. మరింత రుచి కోసం చెరకు ముక్కలు, మిగుల మగ్గిన అరటి పండు గుజ్జు కలుపుకోవచ్చు. 

ఊరించే ఉగాది రుచులు
మామిడికాయ పులిహోర పూర్ణాలు 
కావలసినవి: బియ్యం – కప్పు, పచ్చిమామిడి కాయ – మీడియం సైజుది ఒకటి, పచ్చికొబ్బరి తురుము – అర కప్పు, ఆవాలు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పచ్చిశనగ పప్పు – టీ స్పూను, వేరుశనగ గుళ్ళు – రెండు టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు – మూడు రెమ్మలు, పచ్చిమిర్చి తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు, ఎండు మిర్చి – నాలుగు, మెంతులు – పావు టీస్పూను, ఆయిల్‌ – నాలుగు టేబుల్‌ స్పూన్లు, పసుపు – పావు టీస్పూను, చింతపండు ఉసిరికాయంత, బెల్లం తురుము – రెండు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ: ∙ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం పొడి పొడిగా వచ్చేలా వండి ఆరబెట్టుకోవాలి. ∙మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా తరగాలి. ∙ఎండు మిర్చి, మెంతులు, అరటీస్పూను ఆవాలను దోరగా వేయించుకుని పొడిచేయాలి. ఈ పొడిలో పచ్చికొబ్బరి, మామిడికాయ ముక్కలు, చింతపండు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కనపెట్టుకోవాలి. ∙స్టవ్‌ మీద బాణలి పెట్టి ఆయిల్‌ వేయాలి. ఆయిల్‌ వేడెక్కిన తరువాత ఆవాలు వేయాలి.

చిటపటలాడాక మినప పప్పు, శనగ పప్పు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేయాలి. ∙ఇవన్ని వేగాక వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి. ఇవి వేగాక పసుపు, గ్రైండ్‌ చేసిన మామిడికాయ మిశ్రమం వేసి ఐదు నిమిషాలు వేయించాలి.  ∙తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి, ఆరబెట్టిన అన్నాన్ని వేసి కలిపితే మామిడికాయ పులిహోర రెడీ. 

పూర్ణాలు  
కావలసినవి:  పచ్చిశనగ పప్పు – అర కేజీ, బెల్లం – అరకేజీ, యాలక్కాయలు – పది, బియ్యం – రెండు కప్పులు, పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్‌ – డీప్‌ ఫ్రైకి సరిపడా. 

తయారీ: ∙ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి. శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి. ∙నానిన బియ్యం మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ∙నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లుపోసి మూడు విజిల్స్‌ రానివ్వాలి. ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి.

శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి. ∙బియ్యం, మినపగుళ్ల రుబ్బులో కొద్దిగా ఉప్పు వేసి తిప్పాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్‌లో డీప్‌ ఫ్రై చేయాలి. ∙మీడియం మంట మీద గోల్డెన్‌ బ్రౌన్‌ రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ.

భక్ష్యాలు 
కావలసినవి:  పచ్చిశనగ పప్పు – రెండు కప్పులు, బెల్లం తురుము – రెండు కప్పులు, యాలకుల పొడి – రెండు టేబుల్‌ స్పూన్లు, మైదా – రెండు కప్పులు, గోధుమ పిండి – మూడు టేబుల్‌ స్పూన్లు, నెయ్యి – అరకప్పు, నీళ్లు – కప్పు, ఉప్పు – చిటికెడు. 

తయారీ: ∙ముందుగా శనగ పప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టాలి. నానిన పప్పుని కుకర్‌లో వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మూడు విజిల్స్‌ రానివ్వాలి. ఇంతకు మించి ఉడికించకూడదు. ∙ఉడికిన తరువాత నీళ్లు తీసేసి పప్పుని పక్కన పెట్టుకోవాలి. ∙మైదాలో గోధుమ పిండి, టేబుల్‌ స్పూను నెయ్యి, కప్పు నీళ్లుపోసి పిండిని ముద్దలా కలుపుకోని పక్కనపెట్టుకోవాలి.

∙శనగ పప్పుని కూడా మెత్తగా రుబ్బుకోవాలి. ∙మందపాటి పాత్రలో బెల్లం తురుము, అరకప్పు నీళ్లు పోసి సన్నని మంట మీద ఉడికించాలి. ∙మధ్య మధ్యలో కలియ తిప్పుతూ రుబ్బుకున్న శనగపప్పు, యాలకుల పొడి వేసి తిప్పి, పదినిమిషాల పాటు ఉడికించాలి.  ఉడికిన మిశ్రమాన్ని నిమ్మకాయ సైజు పరిమాణంలో ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

అల్యూమినియం ఫాయిల్‌పైన కొద్దిగా నెయ్యి రాసుకుని కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేత్తో వత్తుకోవాలి. ∙ఈ చపాతీలో శనగపప్పు ఉండని పెట్టి చపాతీ మొత్తం చుట్టే పూరీలా వత్తుకోవాలి. ∙పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బంగారు రంగులోకి మారేంత వరకు కాల్చితే భక్ష్యాలు రెడీ. 

పరమాన్నం 
కావలసినవి: బియ్యం – అర కప్పు, పాలు – కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నెయ్యి – ముప్పావు కప్పు, జీడి పప్పు పలుకులు – రెండు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూను, పచ్చకర్పూరం – చిటికెడు. 

తయారీ: ∙ముందుగా బియ్యాన్ని కడిగి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ∙ఒక గిన్నెలో పాలుపోసి కాయాలి. కాగిన పాలల్లో నానబెట్టిన బియ్యం వేసి తిప్పుతూ ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికాక దించి చల్లారనివ్వాలి. ∙స్టవ్‌ మీద మరో బాణలి పెట్టుకుని నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడి పప్పు పలుకులు వేసి గోల్డ్‌ కలర్‌లోకి మారేంత వరకు వేయించాలి.

స్టవ్‌ మీద మరో పాత్ర పెట్టి బెల్లం తురుము వేయాలి. దీనిలో పావుకప్పు నీళ్లుపోసి సిరప్‌లా మారేవరకు ఉడికించి, చల్లారనివ్వాలి. ∙బెల్లం సిరప్‌లోనే యాలకుల డి, పచ్చ కర్పూరం వేసి తిప్పాలి. ∙బెల్లం సిరప్‌ చల్లారక అన్నంలో వేసి బాగా కలపాలి, దీనిలో మిగిలిన నెయ్యి, జీడిపప్పుతో గార్నిష్‌ చేస్తే పరమాన్నం రెడీ. 

మరిన్ని వార్తలు