యూజీసీ జాబ్‌ పోర్టల్‌ ప్రయోజనాల గురించి తెలుసుకోండి

6 Jul, 2021 14:16 IST|Sakshi

యూజీసీ నెట్, నెట్‌–జేఆర్‌ఎఫ్‌ క్వాలిఫై అయ్యారా.. రాష్ట్ర స్థాయిలో  నిర్వహించే సెట్‌లో అర్హత సాధించారా.. ఏదైనా సబ్జెక్టులో పీహెచ్‌డీ  పూర్తి చేశారా.. అయినా ఇప్పటికీ నిరుద్యోగిగానే ఉన్నారా?! అయితే  వెంటనే యూజీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన జాబ్‌ పోర్టల్‌లో  పేరు నమోదుచేసుకోండి!! మీ ప్రొఫైల్‌ నేరుగా రిక్రూటర్లు,  విశ్వవిద్యాలయాల దృష్టికి వెళ్తుంది. దాంతో చదువుకు తగ్గ  ఉద్యోగం దక్కే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో.. యూజీసీ  జాబ్‌ పోర్టల్‌ ప్రత్యేకతలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. 

సాధారణంగా నెట్, సెట్‌లో అర్హత పొందిన వారిని, పీహెచ్‌డీ ఉత్తీర్ణులను ఉన్నత విద్యావంతులుగా, ప్రతిభావంతులుగా పరిగణిస్తాం. ఇలాంటి వారెందరో చదువుకు తగ్గ కొలువు దొరక్క నిరాశ చెందుతుంటారు. వాస్తవానికి అవకాశాలు ఉన్నా.. సరైన జాబ్‌ సెర్చింగ్‌ వేదికలు లేకపోవడంతో చాలామంది తమ ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో యూజీసీ కొత్తగా తెచ్చిన జాబ్‌ పోర్టల్‌ ఉన్నత విద్యను పూర్తిచేసుకున్న వారికి ఎంతగానో లాభిస్తుందని చెప్పొచ్చు.

పోర్టల్‌ స్వరూపం
యూజీసీ అందుబాటులోకి తెచ్చిన జాబ్‌పోర్టల్‌.. నెట్, నెట్‌–జేఆర్‌ఎఫ్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులు, రిక్రూటర్లను ఒకే ఆన్‌లైన్‌ వేదికపైకి తెస్తుంది. తద్వారా అటు రిక్రూటర్లు, ఇటు ఉద్యోగార్థులకు ఏకకాలంలో ప్రయోజనం చేకూర్చనుంది. పోర్టల్‌లో క్యాండిడేట్, ఎంప్లాయర్, సెర్చ్‌ అండ్‌ బ్రౌజ్‌ విభాగాలను పేర్కొన్నారు. 

అభ్యర్థుల విభాగం
ఇందులో రిజిస్టర్, లాగిన్, క్రియేట్‌/అప్‌డేట్‌ ప్రొఫైల్, సెర్చ్‌ జాబ్స్‌.. ఉప విభాగాలుగా ఉం టాయి. అభ్యర్థులు ముందుగా పేరు, మెయిల్‌ ఐడీలను నమోదు చేసి.. పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకోవాలి. అలాగే భవిష్యత్‌ లాగిన్‌ ఐడీ సమస్యల దృష్ట్యా సెక్యూరిటీ క్వశ్చన్‌ను ఎంచుకొని.. సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్న వారు లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా పోర్టల్‌లో ప్రవేశించి.. తమ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు లేదా అప్‌డేషన్‌ చేసుకోవచ్చు. అనంతరం జాబ్‌సెర్చ్‌ ద్వారా సరితూగే కొలువును ఎంచుకోవచ్చు. 

రిక్రూటర్లకు
అభ్యర్థుల విభాగం తరహాలోనే విశ్వవిద్యాలయాలు, కాలేజీలు సైతం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సదరు రిక్రూటర్లు పోర్టల్‌లో జాబ్‌ పోస్టింగ్స్‌తో క్యాండిడేట్‌ సెర్చ్‌ సేవలను వినియోగించుకోవచ్చు. అలాగే సెర్చ్‌ అండ్‌ బ్రౌజ్‌ విభాగంలో.. నెట్, సెట్, పీహెచ్‌డీ ఉత్తీర్ణుల వివరాలను పొందవచ్చు. 

ఉపయోగాలు

  • జాబ్‌ పోర్టల్‌ ద్వారా అభ్యర్థులు, రిక్రూటర్లు ఒకే వేదికపైకి వస్తారు. తద్వారా ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుంది. 
  • దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, విశ్వవిద్యాలయాలు క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. నెట్, సెట్, పీహెచ్‌డీ అభ్యర్థులకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. కాని ఆయా ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు అందరికీ చేరకపోవడంతో ప్రతిభ ఉన్నా.. చాలా మంది ఆయా అవకాశాలను దక్కించుకోలేకపోతున్నారు. 
  • తాజాగా యూజీసీ జాబ్‌ పోర్టల్‌ అందుబాటులోకి రావడంతో.. అభ్యర్థులంతా దేశవ్యాప్తంగా ఆయా కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఉద్యోగ నియామక ప్రకటనల గురించి ఒకే వేదిక ద్వారా తెలుసుకోవచ్చు. 
  • ఈ జాబ్‌ పోర్టల్‌ ద్వారా ఉద్యోగార్థులతోపాటు కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సైతం ప్రయోజనం కలగనుంది. ప్రతిభావంతుల సమాచారం అందుబాటులోకి రావడంతో సరైన అభ్యర్థిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించేందుకు అవకాశం ఉంటుంది. 
  •  నెట్, సెట్, పీహెచ్‌డీ క్వాలిఫయర్ల వివరాలు పోర్టల్‌లో అందుబాటులో ఉండటంతో ప్రయివేట్‌ రిక్రూటర్స్‌ ఈ వివరాల ఆధారంగా అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుంది. 

విశేష స్పందన
పోర్టల్‌ను ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నెట్‌ఉత్తీర్ణులు– 60,958 మంది, నెట్‌–జేఆర్‌ఎఫ్‌–15,659 మంది, సెట్‌–18,519 మంది, పీహెచ్‌డీ ఉత్తీర్ణులు 30,417 మంది ఇప్పటికే యూజీసీ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు. 

ఎవరెంత మంది

  • ఇప్పటి వరకు యూజీసీ జాబ్‌ పోర్టల్‌లో మొత్తం 60,958 మంది నెట్‌ క్వాలిఫయర్లు నమోదు చేసుకోగా... వీరిలో మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ నుంచి 6,570 మంది, కామర్స్‌ 6,622, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ 3,720 ఎడ్యుకేషన్‌ 3,479, లైఫ్‌ సైన్సెస్‌ 2,502 మంది ముందు వరుసలో ఉన్నారు. 
  • నెట్‌–జేఆర్‌ఎఫ్‌కు సంబంధించి ఇప్పటి వరకు 15,659 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో కామర్స్‌ నుంచి 1302 మంది, మేనేజ్‌మెంట్‌ నుంచి 1085 మంది, ఎడ్యుకేషన్‌ స్పెషలైజేషన్‌ నుంచి 853 మంది, జాగ్రఫీ నుంచి 710 మంది, హిందీ నుంచి 676 మంది, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌ నుంచి 648 మంది ఉన్నారు.
  • ప్రస్తుతానికి 18,519 మంది సెట్‌ క్వాలిఫయర్లు పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. వీరిలో కామర్స్‌ 1993, బయాలజీ 1487, ఇంగ్లిష్‌ 1369, కంప్యూటర్‌ సైన్స్‌ అప్లికేషన్స్‌1100, మేనేజ్‌మెంట్‌ 883, ఎకనామిక్స్‌ 820, ఎడ్యుకేషన్‌ 800, కెమిస్ట్రీ 809 విద్యార్థులు ముందు వరుసలో ఉన్నారు. 
  • మొత్తం 30,417 మంది పీహె చ్‌డీ హోల్డర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో బయాలజీ 4893, కెమిస్ట్రీ 2968, ఫిజిక్స్‌ 2018 , కామర్స్‌1417, మేనేజ్‌మెంట్‌ 1360, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌1242 అభ్యర్థులు ముందున్నారు. 
  • వెబ్‌సైట్‌: www.ugc.ac.in/jobportal
మరిన్ని వార్తలు