సర్‌ నేమ్‌ ‘కరోనా’.. యూకే వ్యక్తి తిప్పలు

4 Nov, 2020 08:28 IST|Sakshi

ఇంగ్లండ్‌ లో ‘స్టోక్‌–ఆన్‌–ట్రెంట్‌’ అనే సిటీ ఉంది. మట్టి పాత్రల నగరంగా ఆ సిటీ ప్రసిద్ధి. అక్కడ ఉండే జిమ్మీ అనే అతడిని కరోనాకు ముందు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోకుండా ఉండటం లేదు! జిమ్మీ భవన నిర్మాణ కార్మికుడు. కరోనా దెబ్బకు నిర్మాణాలు కూడా ఆగిపోయాయి కనుక అతడిని అసలే పట్టించుకోకూడదు. కానీ పట్టించుకుంటున్నారు. వాళ్లు పట్టించుకోవడాన్ని జిమ్మీ ఎంత పట్టనట్లు ఉన్నా.. మరీ పట్టనట్లుగానూ ఉండలేకపోతున్నాడు. ఇటీవల అతడికి కొడుకు పుట్టాడు. సర్టిఫికెట్‌లో తండ్రి పేరు రాయాలి. ‘పేరు చెప్పండి’ అన్నారు హాస్పిటల్‌ వాళ్లు. చెప్పాడు. ‘పూర్తి పేరు చెప్పండి’ అన్నారు. చెప్పాడు. జిమ్మీ భయపడినట్లే అయింది. ‘ఏదీ మీ ఐడీ చూపించండి’ అన్నారు. చూపించాడు. బ్యాంక్‌ కార్డు, పాస్‌ పోర్టు, ఇంకా కొన్ని కార్డులు! అరె! నిజమేనే అన్నట్లు చూశారు వాళ్లు. కరోనా ఆరంభం నుంచీ జిమ్మీకి ఇదే పనయింది.. అడిగిన వారి కల్లా ఐడీ చూపించడం. (చదవండి: కాజల్‌ నో చెప్పింది ఇందుకే..)

జిమ్మీకి ఈ తలనొప్పి తెప్పించింది అతడి తాతగారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నిర్బంధ శిబిరాల్లో బందీగా ఉండి బతికి బట్టగట్టిన మనిషి ఆయన. ఇప్పుడు ఆయన మనవడు జిమ్మీ.. కరోనాకు బందీ అయ్యాడు. అదేమీ అతడిని తాకలేదు. ఎక్కడైనా తన పేరు చెప్పవలసి వచ్చి, చెప్పినప్పుడు ఆ వెంటనే మొదలయ్యే ప్రశ్నలకు సమాధానాలు, తన పేరు పుట్టుపూర్వోత్తరాలు చెప్పలేక, ఐడీలు చూపించలేక జిమ్మీకి పరలోకంలో ఉన్న తాత గారు గుర్తుకొస్తున్నారు. ఆ తాత గారి పేరు జోసఫ్‌. జోసఫ్‌ కరోనా!!జిమ్మీ ఉండే ‘స్టోక్‌–ఆన్‌–ట్రెంట్‌’ ఆరు పట్టణాల సమాఖ్య నగరం. వాటిల్లో ఒకటైన స్టోక్‌–ఆన్‌–ట్రెంట్‌ పేరునే అన్నిటికీ కలిపి పెట్టినట్లే.. జిమ్మీ కరోనా అనే పేరు నుంచే కరోనాకు కరోనా అనే పేరుగానీ వచ్చిందా అన్నట్లు అంతా అతడిని నవ్వును కలగలిపి అనుమానంగా చూస్తున్నారు.

మరిన్ని వార్తలు