తొలిసారిగా 25 శాతం మంది మహిళా పోలీసు అధికారులు..

19 Feb, 2022 13:30 IST|Sakshi

కొంత కాలం క్రితం... దక్షిణ సూడాన్‌లోని జుబా నగరంలో జరుగుతున్న యూఎన్‌ (ఐక్యరాజ్యసమితి) మెడల్‌ పరేడ్‌ అది. పతకం స్వీకరించడానికి ఆ ఐదుగురు మహిళా పోలిసు అధికారులు నడిచొస్తుంటే నలుదిక్కుల నుంచి చప్పట్లు మారుమోగాయి. వారి నడకలో సాహస ధ్వని వినిపించింది. దక్షిణ సుడాన్‌లో ఏ ప్రమాదం ఏ మూల నుంచి మృత్యువును మోసుకొస్తుందో తెలియని కల్లోల ప్రాంతాల్లో పనిచేశారు వారు.

పోలిస్‌ ఇన్‌స్పెక్టర్‌ రీనా యాదవ్‌... చండీగఢ్‌
డీఎస్పీ భారతి స్వామినాథన్‌... మహారాష్ట్ర
ఇన్‌స్పెక్టర్‌ రజనీకుమారి... మహారాష్ట్ర
డీఎస్పీ గోపిక జహగిర్దార్‌.... మహారాష్ట్ర 
ఏ ఎస్పీ కమలా షెకావత్‌... రాజస్థాన్‌ 

దక్షిణ సుడాన్‌లో అంతర్యుద్ధ పరిస్థితులను నివారించడంలో తమవంతు పాత్ర పోషించి ‘శభాష్‌’ అనిపించుకున్నారు. ఐక్యరాజ్యసమితికి మన మహిళా పోలిస్‌ అధికారుల సాహస ప్రవృత్తి, త్యాగం... సుపరిచితం.
(చదవండి: 6 లక్షల పెట్టుబడి.. 4 కుట్టు మిషన్లతో ఆరంభం.. లక్షల్లో ఆదాయం!)

తాజాగా... ఆంధ్ర, తెలంగాణ, దిల్లీ, హరియాణ, హిమాచల్‌ ప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, సిక్కిం, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్‌... మొదలైన రాష్ట్రాలు, రకరకాల సెంట్రల్‌ పోలిస్‌ ఆర్గనైజేషన్స్‌ నుంచి 69 మంది పోలిసు అధికారులు ‘యునైటెడ్‌ నేషన్స్‌ మిషన్‌ సర్వీసెస్‌: 2022–2024’లో భాగం అయ్యారు. వెహికిల్, వెపన్‌ హ్యాండ్లింగ్, కంప్యూటర్‌ స్కిల్స్‌... మొదలైన వాటికి సంబంధించిన పరీక్షలలో వీరు విజయం సాధించారు. ఈసారి విశేషం ఏమిటంటే ప్యానల్‌లో తొలిసారిగా 25 శాతం మంది మహిళా పోలిసు అధికారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూఎన్‌లో పనిచేయడానికి వృత్తినిబద్ధత, భిన్నసంస్కృతుల పట్ల గౌరవభావం... ప్రధాన లక్షణాలు అంటారు. అవి మన మహిళాపోలిసు అధికారులలో పుష్కలంగా ఉన్నాయని గత చరిత్ర సగర్వంగా చెప్పకనే చెబుతుంది.
(చదవండి: ‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’.. ఇప్పుడు బుల్లెట్‌ ట్రైన్స్‌ కూడా..)

మరిన్ని వార్తలు