ప్రిన్సెస్‌ డయానా రాసిన ఆ ఉత్తరాల్లో ఏముంది..?

27 Feb, 2021 00:07 IST|Sakshi

ప్రిన్సెస్‌ డయానా మరణించి దాదాపు 24 ఏళ్లు అవుతున్నప్పటికీ తన వ్యక్తిగత జ్ఞాపకాలతో ఇప్పటికీ వార్తల్లో నిలుస్తుండడం విశేషం. క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు డయానా స్వయంగా రాసిన ఉత్తరాలు తాజాగా వెలుగులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఎవరూ చదవని రెండు దశాబ్దాల క్రితం నాటి.. దాదాపు 40 ఉత్తరాలను ‘డేవిడ్‌ లే’ అనే వేలం సంస్థ విక్రయించనుంది. ఈ ఉత్తరాలను డయానా స్నేహితుడు రోజర్‌ బ్రాంబుల్‌కు 1990 ఆగస్టు నుంచి 1997 మే నెల మధ్యకాలం లో రాశారు. 1997లో ఆమె మరణించిన తరువాత కంట్రీ ఫామ్‌ హౌస్‌లో ఓ కప్‌ బోర్డులో ఈ ఉత్తరాలు దొరికాయి. ఇన్నేళ్లు చీకట్లో మగ్గిన ఆ ఉత్తరాలు జన బాహుళ్యంలోకి రానున్నాయి. ప్రిన్స్‌ చార్లెస్‌తో తన వివాహబంధాన్ని తెంచుకున్న తరువాత రాసిన లెటర్స్‌ కావడంతో వాటిలో ఏముందోనని ఆసక్తి నెలకొంది.

తన కుమారులైన ప్రిన్స్‌విలియం, హ్యారీల గురించి కూడా దీనిలో డయానా ప్రస్తావించారని వేలం నిర్వాహకులు చెబుతున్నారు. ‘‘డయానా ఓ యాక్సిడెంట్‌లో మరణించినప్పటికీ ఆమె మృతి వెనుక అనేక అనుమానాలు ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని చాలామంది కుతూహలం చూపుతున్నారు. అందుకే ఆమె జీవితానికి సంబంధించిన మరిన్ని నిజాలు తెలుసుకునేందుకు ఉత్తరాలను వేలం వేస్తున్నట్లు’’ వేలం సంస్థ వెల్లడించింది. మార్చి 18న 39 లెటర్స్‌ ను వేలం వేస్తున్నామని, మరింత సమాచారం కోసం తమ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సంస్థ పేర్కొంది. 

మరిన్ని వార్తలు