చిన్న వయసులోనే పెద్ద కష్టం.. నిమ్మరసం అమ్ముతూ..

6 Mar, 2021 07:53 IST|Sakshi

కలేజా ఉన్న అమ్మాయి లిజా!!

జీవితమన్నాక కష్టసుఖాలు సర్వసాధారణం. మనం ఖర్చు చేయలేని స్థాయిలో కష్టం ఎదురైతే వెంటనే ఎవరైనా సాయం చేస్తారా? అని ఎదురు చూస్తాం. కొందరైతే సాయం చేసే చేతులకోసం అదేపనిగా వెతుకుతుంటారు. కానీ అమెరికాలోని ఓ ఏడేళ్లమ్మాయి తన బ్రెయిన్‌ సర్జరీ కోసం తానే సంపాదించాలనుకొంది. ఇంత చిన్న వయసులో అంతపెద్ద సమస్య వచ్చినప్పటికీ కలేజాతో ముందుకు సాగుతూ.. ఎవర్నీ సాయమడగకుండా సొంతంగా డబ్బులు సంపాదిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.

అమెరికాలోని అలబామా కు చెందిన ఏడేళ్ల లిజా స్కాట్‌కు తరచూ ఫిట్స్‌(మూర్ఛ) వచ్చి పడిపోయేది. ఫిట్స్‌ ఎందుకొస్తున్నాయో తెలుసుకునేందుకు లిజాను డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా.. మస్తిష్కంలో కొన్ని లోపాల కారణంగా తరచూ మూర్ఛ వస్తుందని, బ్రెయిన్‌ సర్జరీ ద్వారా ఈ సమస్య ను సరిచేయవచ్చని వైద్యులు చెప్పారు. అయితే బ్రెయిన్‌ సర్జరీకయ్యే ఖర్చును భరించే శక్తి లిజా కుటుంబానికి లేదు. దీంతో లిజా తన ఆపరేషన్‌కు తానే సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే లిజా తల్లి నడిపే బేకరీలో సొంతంగా నిమ్మరసం అమ్ముతూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టింది.

నిమ్మరసం కొనే కస్టమర్లు లిజా పరిస్థితి తెలుసుకుని బిల్లుతోపాటు మరికొంత ఎక్కువ నగదును ఇచ్చేవారు. ఒక్కో కస్టమర్‌ ఐదు డాలర్ల నుంచి వంద డాలర్ల వరకు బిల్లు కట్టేవారు. ఇప్పటిదాకా నిమ్మరసం అమ్మడం ద్వారా లిజా మొత్తం 12 వేల డాలర్లను కూడబెట్టింది. మళ్లీ ఫిట్స్‌ రావడంతో ప్రస్తుతం లిజా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ‘నీ ఆపరేషన్‌ కు నువ్వే ఎందుకు సంపాదించుకోవాలి?’ అనుకున్నావు అన్న ప్రశ్నకు సమాధానంగా... ‘‘నా లాగా ఆపదలో ఉన్నవారు ఇలా సొంతంగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నించడం యాచించడం కంటే కొంతమేలే కదా అని’ చెప్పడం చాలా ముచ్చటేస్తుంది.

‘తండ్రిలేని లిజాను తాను ఎంతో ప్రేమ గా చూసుకుంటున్నాననీ, ఆమె వైద్య ఖర్చుల కోసం కోసం కష్టపడి డబ్బులు కూడబెడుతున్నానని లిజా తల్లి ఎలిజబెత్‌ చెప్పారు. సర్జరీ, ఇంకా మందులకు చాలానే ఖర్చవుతుంది. అందుకే నేను కూడా ఆన్‌లైన్‌లో దాతల్ని సాయం చేయమని అభ్యర్థించాను. దీంతో లిజా పరిస్థితి తెలిసిన బంధువులు, స్నేహితులు, ఇతర దాతలనుంచి ఇప్పటివరకు మూడు లక్షల డాలర్ల సాయం అందిందని చెప్పారు. ప్రస్తుతం బ్రెయిన్‌ ఆపరేషన్‌తో తన పరిస్థితి కాస్త మెరుగుపడినప్పటికీ లిజాకి 30 ఏళ్లు వచ్చేవరకు రెగ్యులర్‌గా చెకప్స్‌ చేయించాలని ఎలిజ్‌బెత్‌ వివరించారు. 

చదవండిభర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్‌ ఓదార్పు

మరిన్ని వార్తలు