రెడీ...సెట్‌...ప్లే; వికాసం నుంచి విజ్ఞానం వరకు

12 Jan, 2023 14:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జ్ఞాపక శక్తికి పదునుపెట్టుకోవడానికి, పదసంపదను పెంచుకోవడానికి, సమస్యల పరిష్కారం విషయంలో బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకోవడానికి రకరకాల డిజిటల్‌ బ్రెయిన్‌ గేమ్స్‌పై యువతరం ఆసక్తి ప్రదర్శిస్తుంది...

బెంగళూరుకు చెందిన సహజకు చిన్న చిన్న రచనలు చేయడం అంటే ఇష్టం. భవిష్యత్‌లో రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలనేది తన కోరిక. ఒక పుస్తకం ఆదరణ పొందాలంటే కాన్సెప్ట్‌తో పాటు భాష కూడా బాగుండాలి అనేది పద్దెనిమిది సంవత్సరాల సహజకు తెలియని విషయమేమీ కాదు. అందుకే తన పదసంపదను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. దీని కోసం ‘వొకాబులరీ బిల్డర్‌’ అనే గేమ్‌ యాప్‌ను సాధనంగా ఎంచుకుంది.

కాల్పనిక రచనల కోసం మాత్రమే కాదు, ఆకట్టుకునే భాషలో ఇ–మెయిల్స్‌ రాయడానికి, రకరకాల విషయాలపై వ్యాసాలు రాయడానికి యువతరం ‘వొకాబులరీ బిల్డర్‌’ను ఉపయోగిస్తోంది.

‘సూపర్‌బెటర్‌’ అనేది రకరకాల సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇచ్చి, నైపుణ్యాలు పెంపొందించే ఆట. ‘ఎవ్రీవన్‌ హ్యాజ్‌ హీరోయిక్‌ పొటెన్షియల్‌’ అనేది ఈ ఆట నినాదం. 
‘నువ్వు నీ గురించి అనుకున్నదానికంటే బలవంతుడివి...అండగా నిలిచే ఆత్మీయులు నీకు బలమైన సైన్యమై ఉన్నారు...ఎందరికో నువ్వు రోలోమోడల్‌వి...ఇలాంటి సానుకూల ఆలోచనల్లో నుంచి సమస్యలను జయించే శక్తి పుడుతుంది’ అంటోంది ‘సూపర్‌బెటర్‌’ను రూపొందించిన జేన్‌మెక్‌ గోనిగల్‌.

జేమ్‌మెక్‌ ఒకప్పుడు డిప్రెషన్‌ బారిన పడి అందులోంచి బయటపడింది. తాను కుంగుబాటు చీకటి నుంచి బయటపడిన విధానాన్ని ఒక ఆటగా మలిచి దీని గురించి తన బ్లాగ్‌లో రాసుకుంది. కొద్దికాలంలోనే బ్లాగ్‌లో నుంచి ‘సూపర్‌బెటర్‌’ రూపంలో డిజిటల్‌ ఆటగా మారింది.

న్యూరోసైంటిస్ట్‌ల సలహాల ఆధారంగా రూపొందించిన గేమ్‌... లుమినోసిటీ. ఈ గేమ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వెంటనే ‘మీరు ఎలాంటి స్కిల్స్‌ కోరుకుంటున్నారు?’ అని అడుగుతుంది. కోరుకునే ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేసుకోవచ్చు.

కొత్తగా ఆలోచించడానికి, ఒక సమస్యకు భిన్నమైన పరిష్కారాలు ఆలోచించడానికి ఉపకరించే ఇండి పజిల్‌ గేమ్‌ మాన్యుమెంట్‌ వ్యాలీ. ఈ గేమ్‌ యాప్‌ యాపిల్‌ డిజైన్, పాకెట్‌ గేమర్‌ ‘గోల్డ్‌’ అవార్డ్‌లను గెలుచుకుంది.

‘మాన్యుమెంట్‌ వ్యాలీ’ ప్రత్యేకత రిలాక్సింగ్‌ సౌండ్‌ ట్రాకింగ్, ఆకర్షణీయమైన డిజైన్‌.
సుడోకు ప్రేమికులను ‘గుడ్‌ సుడోకు’ ఆకట్టుకుంటోంది. ‘పజిల్‌ ప్రేమికులకు ఇదొక ప్రేమలేఖ’ అంటోంది కంపెనీ.

ఇక  ఫన్‌మెథడ్‌ వీడియో గేమ్‌ ‘బ్లాక్‌బాక్స్‌’లో డజన్ల కొద్దీ మినీ గేమ్స్‌ ఉంటాయి. ‘ఎలివేట్‌’లో ప్రత్యేకమైన వర్కవుట్‌ క్యాలెండర్‌ ఉంటుంది. ‘ఫన్‌ అండ్‌ క్లిక్‌’ పద్ధతిలో దీన్ని రూపొందించారు... ఇలా చెప్పుకుంటూ పోతే యువతరాన్ని ఆకట్టుకుంటున్న బ్రెయిన్‌ ట్రైనింగ్‌ గేమ్స్‌ ఎన్నో ఉన్నాయి.

‘బస్సు కోసం ఎదురుచూసే  క్రమంలో టైమ్‌ వృథా అయ్యేది. ఇప్పుడు మాత్రం రకరకాల బ్రెయిన్‌ జిమ్‌ గేమ్స్‌ ఆడుతున్నాను. కొత్త ఉత్సాహం వస్తోంది’ అంటున్నాడు ముంబైకి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి సాకేత్‌.

‘మా తాతయ్యకు సుడోకులాంటి పజిల్స్‌ను సాల్వ్‌ చేయడం అంటే ఇష్టం. ఆయన కాలక్షేపం కోసం పజిల్స్‌ను సాల్వ్‌ చేస్తున్నారనుకునేదాన్ని. పజిల్స్‌ సాల్వ్‌ చేసే ప్రక్రియ వల్ల  చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకున్నాక వినోదంతో కూడిన బ్రెయిన్‌ ట్రైనింగ్‌ గేమ్స్‌పై ఆసక్తి పెరిగింది’ అంటోంది చెన్నైకి చెందిన భార్గవి.

‘మన జీవితమే పెద్ద పజిల్‌. చావు నుంచి పుట్టుక వరకు రకరకాల పజిల్స్‌ను పరిష్కరిస్తూనే ఉండాలి’ అనేది తాత్వికత ధ్వనించే  మాట అయితే కావచ్చుగానీ రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి. వ్యక్తిత్వ వికాసానికి డిజిటల్‌ బ్రెయిన్‌ గేమ్స్‌ను  బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది యువతరం.

మరిన్ని వార్తలు