విపత్తు: సహాయక చర్యల్లో మహిళా అధికారులు

16 Feb, 2021 08:53 IST|Sakshi

చమోలీ శివంగులు

ప్రస్తుత కాలంలో మహిళలు అన్నిరంగాల్లో తమదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌ చమోలీ జిల్లాలో ధౌలిగంగా నది భారీ నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు కొంతమంది ప్రాణాలు కోల్పోగా ఎంతోమంది ఆచూకీ ఇంకా తెలియలేదు. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న అధికారుల్లో నలుగురు మహిళా అధికారులు ఎంతో నైపుణ్యంతో ముందుండి నడిపిస్తున్నారు. వీరిలో చమోలీ జిల్లా మెజిస్ట్రేట్‌ స్వాతి భడోరియా, ఐటీబీపీ డీఐజీ అపర్ణా కుమార్, గర్వాల్‌ రేంజ్‌ డీఐజీ నీరూ గార్గ్, ఎస్‌డీఆర్‌ డీఐజీ రిధిమ్‌ అగర్వాల్‌ ఉన్నారు. 

ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకూ క్యాంపుల నిర్మాణం, బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి ఓదార్చడం, కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు, రెస్క్యూ ఆపరేషన్స్‌ను నిర్వహించడం, పునరావాస సామగ్రిని అందించడంలో ఈ నలుగురు అధికారులు ముందుండి ఎంతో సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఎక్కువ నష్టపోకుండా ఉండేందుకు వివిధ ఏజెన్సీలతో కలిసి శ్రమిస్తున్నారు.  ఫిబ్రవరి 7న కొండచెరియలు విరిగి పడి నిర్మాణంలో ఉన్న డ్యామ్‌ కొట్టుకుపోయింది. ఈ డ్యామ్‌ వద్ద పనిచే స్తోన్న ఎంతోమంది కార్మికులను రక్షించేందుకు 2011 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన స్వాతి భడోరియా దుర్ఘటన  జరిగిన రోజు నుంచే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 

మూడేళ్ల కుమారుడిని వదిలి
ఈ విపత్తును ఎదుర్కోవడం పెద్ద సవాలే అయినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగామని స్వాతి భడోరియా చెప్పారు. ఎంతో మందిని సమన్వయ పరచడం, కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు, వివిధ రకాల అధికారులతో మాట్లాడడం, బాధిత కుంటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం, సహాయ చర్యలను సమన్వయ పరచడం, విద్యుత్‌ సరఫరాను పునరుద్ధ్దరించడం, ఆహార ప్యాకెట్ల సరఫరా వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని ఆమె చెప్పారు. మొదటి మూడురోజులు తన మూడేళ్ల కుమారుడిని వదిలి తపోవన్‌లో క్యాంప్‌ వేసుకుని స్వాతి అక్కడే ఉన్నారు.

తనతో మాట్లాడేందుకు సమయం లేదు
2005 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి గర్వాల్‌ రేంజ్‌ డీఐజీ అయిన నీరూ గార్గ్‌ .. రెయినీ, తపోవన్‌ ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించే అనేక కార్యక్రమాలను ముందుండి నడిపించారు. ‘‘మేము వీలైనంత వరకు చేయగలిగిన సాయం చేస్తూ ఎక్కువ మందిని రక్షించేందుకు ప్రయత్నించాం’’ అని నీరూ చెప్పారు. తొమ్మిదేళ్ల తన కూతురు హరిద్వార్‌లో  పరీక్షలు రాస్తోందని. ఆమెతో మాట్లాడేందుకు కూడా సమయం కేటాయించలేకపోయానని చెప్పారు.

ముందుండి నడిపిస్తున్నారు
2002 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ అపర్ణా కుమార్‌ ఐటీబీపీ టిమ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. 2005 బ్యాచ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ రిధీమ్‌ అగర్వాల్‌ ఎస్‌డీఆర్‌ టీమ్‌కు డీఐజీగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు బృందాలు సమన్వయంతో కలిసి పనిచేయడంలో వీరిద్దరి పాత్రే కీలకం. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ప్రమాద స్థలానికి మొదటిగా చేరుకుందని, ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్‌లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కీలకమైన పాత్ర పోషించిందని రిధిమ్‌ చెప్పారు.  వీలైనంత ఎక్కువమందిని కాపాడేందుకు పాటుపడ్డామని, మిగతా ఏజెన్సీలతో కలిసి సమన్వయంతో పనిచేశామని చెప్పారు.

చదవండి40 శవాల వెలికితీత.. ఇంకా దొరకని 164 మంది
చదవండిఉత్తరాఖండ్‌ ముంగిట మరో ముప్పు

మరిన్ని వార్తలు