-

ఎక్కువ రోజులు సొరంగంలో ఉంటే కార్మికుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది! వైద్యుల ఆందోళన

27 Nov, 2023 15:58 IST|Sakshi

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంత భాగం కూలిపోవడంతో దాదాపు 40 మంది కూలీలు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ కూలీలను రక్షించేందుకు నేషనల్‌, స్టేట్‌ డిజాస్టర్‌ బృందాల తోసహ అంతర్జాతీయ టన్నెల్‌ రెస్క్యూ బృందాలు కూడా పాల్గొని సహాయక చర్యలు చేపట్టారు. తీరా కూలీలు బయటకు వచ్చేస్తారనే లోపలే ఆగర్‌ డ్రిల్లింగ్‌ మిషన్‌ కాస్త పనిచేయకుండా మొరాయించింది. ఇక లాభం లేదనుకుని మరో ప్రణాళికతో సాగేందుకు సన్నద్ధమయ్యారు అధికారులు.

అందులో భాగంగా కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్‌ పనులు ముమ్మరం చేశారు. అంటే..ఈ దురదృష్టకర ఘటన జరిగి నేటికి దాదాపు 15 రోజులు కావొస్తుంది. అందులో చిక్కుకున్న వారి కోసం ఆక్సిజన్‌, ఆహారం, నీళ్లు వంటి వాటిని పైపుల ద్వారా అందజేశారు కూడా అధికారులు. ఇప్పటి వరకు భయాందోళనల నడుమ గడిపిని ఆ కూలీలకు ఈ ఆహారం ఎంత వరకు సరిపోతుంది. వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తదితరాల గురించే ఈ కథనం!.

మూడు.. నాలుగు.. రోజుల కాదు దాదాపు పదిరోజులపైనే ఆ సోరంగంలో చిక్కుకుపోయారు కార్మికులు. అధికారుల అందించే ఆహారం వారి ప్రాణాలను నిలబెడుతుందో లేదో చెప్పలేం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకుంటే మానసిక భయాందోళనకు మించిన భయానక వ్యాధి ఇంకొకటి ఉండదు. మనిషి ప్రశాంతంగా ఉంటే ఆకలి అనేది పుట్టి తినగలడు. ఎప్పుడూ బయటపడతామన్నా ఆలోచన ప్రతి గడియా ఓ యుగంలా టెన్షతో ఉన్నవారికి పోషకవిలువతో కూడిన ఆహారం అయినా సహించదని అన్నారు.

ముఖ్యంగా అన్ని రోజులు లోపలే ఉన్నారు కాబట్టి మనిషి రోజువారీ కాలకృత్యాలు సైతం తీర్చుకోవడానికి ఆస్కారం లేని ప్రాంతంలో ఆరోగ్యం ఎంత దారుణంగా క్షీణిస్తుందో చెప్పనవసరం లేదన్నారు.ఆ చీకటి ప్రదేశంలో బిక్కుబిక్కుమని ఉంటున్న వ్యక్తి మానసిక స్థితే సంఘర్షణలో ఉంటే మిగతా ఆరోగ్య వ్యసస్థలు సంక్రమంగా ఉండవని తేల్చి చెప్పారు. అదీగాక ఆ సొరంగంలోని సిలికా కారణంగా తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువుగా ఉందన్నారు.

అధికారులు అందించే కృత్రిమ ఆక్సిజన్‌ ఎంతవరకు వారిని సంరక్షిస్తుందనేది కూడా చెప్పలేం. కొందరిలో హైపోక్సియా కారణంగా సాధారణ ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేటు పడిపోయి శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమైపోవచ్చని వైద్యులు చెబుతున్నారు.కాగా, వైద్యులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలో నేపథ్యంలో చిక్కుకున్న కార్మికులకు కావాల్సిన విటమిన్‌ సీ టాబ్లెట్లు, తలనొప్పి, మలబద్ధకం వంటి సమస్యలకు సంబంధించిన మందులను పంపించామని ఉత్తకాశీ అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు చీకట్లో ఒంటరిగా బిక్కుబిక్కుమని ఉన్న ఆ కార్మికుల మానసిక స్థితి ఎలా ఉంటుందనే దానిపై ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ కాంత్ రాఠీ మాట్లాడుతూ..ఒకే పరిస్థితికి వివిధ వ్యక్తులు భిన్నమైన మానసిక ప్రతిస్పందనలను ప్రదర్శిస్తారని, అందరి మానసిక స్థితి ఒకేలా ఉండదని అన్నారు. బయటపడిన వెంటనే ఆ కార్మికులకు కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షలో ఉండటం అత్యంత అవసరమని చెప్పారు. ఎందుకంటే..కొందరూ డిప్రెషన్‌, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని అన్నారు. 

(చదవండి: పల్లీలు తింటే ఆ వ్యాధి వచ్చే ఛాన్స్‌ ఎక్కువ! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు)

మరిన్ని వార్తలు