స్విస్‌ ఆల్ఫ్స్‌ సాహస యాత్రకు సైఅంటున్న ట్విన్‌ సిస్టర్స్‌..

2 Oct, 2021 11:13 IST|Sakshi

స్విట్జర్లాండ్‌ టూరిజం బోర్డ్‌ ‘హండ్రెడ్‌ పర్సంట్‌ ఉమెన్‌ పీక్‌ ఛాలెంజ్‌’ కార్యక్రమాన్ని చేపట్టింది. సాహసిక బాటలో ‘ఉమెన్‌–వోన్లీ’ బృందాలను నడిపించడానికి ఈ సవాలుకు శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా 250 మంది మహిళలు ఈ ఛాలెంజ్‌లో భాగం అయ్యారు. ఈ బృందంలో కాలు తిరిగిన పర్వతారోహకులతో పాటు, ఇప్పుడిప్పుడే సాహసానికి సై అంటున్న ఉత్సాహవంతులూ ఉన్నారు.

స్విస్‌ ఆల్ఫ్స్‌లో 48కి పైగా ఉన్న నాలుగువేల మీటర్ల ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించడం వీరి లక్ష్యం. మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి సౌదీ అరేబియా మహిళ రహ మెహ్రక్‌ కూడా ఈ బృందంలో ఉంది. ‘ఆల్ఫ్స్‌ పర్వతశ్రేణులు అంటే భౌగోళిక ప్రాంతాలు కాదు. నిజంగా మనం జీవించే ప్రదేశాలు’ అంటుంది మెహ్రక్‌.
ఇక మనదేశం విషయానికి వస్తే తషి, నుంగ్షీ మాలిక్‌లు ఈ బృందంలో ఉన్నారు. వీరి పేరు కనిపించగానే వినిపించే మాట... ఎవరెస్ట్‌ ట్విన్స్‌! మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి ట్విన్‌ సిస్టర్స్‌గా వీరికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

‘ఈ సంవత్సరం మాకు చిరకాలం గుర్తు ఉంటుంది. దీనికి కారణం హండ్రెడ్‌ పర్సంట్‌ ఉమెన్‌ పీక్‌ ఛాలెంజ్‌. ఎంతో ఉత్సాహంతో ఇందులో భాగం అయ్యాం’ అంటుంది తషి మాలిక్‌. ‘కన్న కల త్వరగా సాకారం అయితే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పడానికి మాటలు చాలవు. నిజానికి పర్వతారోహణ విషయంలో మా ప్రాధాన్యతల జాబితాలో స్విస్‌ ముందు వరసలో ఉంది. ఈ గ్లోబల్‌ ఛాలెంజ్‌లో భాగం కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాం’ అంటుంది నుంగ్షీ మాలిక్‌.

డెహ్రాడూన్‌ (ఉత్తరాఖండ్‌)కు చెందిన మాలిక్‌ సిస్టర్స్‌ పద్ధెనిమిది సంవత్సరాల వయసులో సరదాగా పర్వతారోహణ మొదలుపెట్టారు. అయితే మౌంట్‌ రుదుగైరను తొలిసారి అధిరోహించిన తరువాత వారి దృక్పథంలో మార్పు వచ్చింది. ‘సరదా’ స్థానంలో ‘అంకితాభావం’ వచ్చి చేరింది.
‘ఈ ఛాలెంజ్‌లో భాగం కావడం వల్ల, మాలాంటి భావాలు ఉన్న ఎంతోమందితో పరిచయం ఏర్పడింది. కొత్త విషయాలు తెలుసుకున్నాం. కొత్త ఉత్సాహం వచ్చింది’ అంటుంది తషి.

పర్వతారోహణ... అనగానే అదేదో పురుషులకు మాత్రమే సంబంధించిన అంశంగా చూసేవారు. ఈ ధోరణిని చెరిపేసి మహిళలు రికార్డ్‌లు సృష్టించారు. తమ సత్తా చాటారు. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకులలో పురుషులతో పోలిస్తే స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారు. ‘హండ్రెడ్‌ పర్సంట్‌ ఉమెన్‌ పీక్‌ ఛాలెంజ్‌’లాంటివి విరివిగా చేపడితే రానున్న పదిసంవత్సరాల కాలంలో పర్వతారోహణలో  స్త్రీల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందనేది ఒక అంచనా.
ఇప్పటివరకు మాలిక్‌ సిస్టర్స్‌ మూడు శిఖరాలను విజయవంతంగా అధిరోహించారు. వారి కోసం మరిన్ని విజయాలు ఎదురుచూస్తున్నాయి

మరిన్ని వార్తలు