గ్రేట్‌ జర్నీ..పత్తి రైతుల కాగడా..

13 Jul, 2021 01:39 IST|Sakshi

ఆమె ఓ ఉద్యమజ్యోతి. తాను వెలుగుతూ... పదిమందికి వెలుగులు పంచే కాగడా. ‘ఏ ఫ్రేడ్‌ హిస్టరీ – ద జర్నీ ఆఫ్‌ కాటన్‌ ఇన్‌ ఇండియా’లో వత్తిలా కాలిపోతున్న పత్తి రైతు జీవితాన్ని రాశారు. ఇంగ్లిష్‌ లిటరేచర్‌ చదివిన ఓ యువతి సామాజిక కార్యకర్తగా, మల్కా పరిరక్షకురాలిగా రూపాంతరం చెందడానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తుందా పుస్తకం. డెబ్బై ఐదేళ్లు దాటిన ఉజ్రమ్మ లైఫ్‌ జర్నీతోపాటు పెట్టుబడిదారుల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఆమె తన ఉద్యమాన్ని మౌనంగా విస్తరింపచేస్తున్న వైనం కనిపిస్తుంది.

అభ్యుదయ హైదరాబాదీ
ఉజ్రమ్మ హైదరాబాద్‌లో అభ్యుదయ కుటుంబంలో పుట్టారు. నానమ్మ ఉద్యమస్ఫూర్తి వల్ల తమ కుటుంబంలో ఆడపిల్లల చదువుకు మార్గం సుగమమైందని చెప్పారామె. చిన్నాన్న సజ్జత్‌ జహీర్‌ కమ్యూనిస్ట్‌ భావాల ప్రభావం తన మీద ఉందంటారామె. సామాజికాంశాల మీద స్పందించే తత్వం చిన్నాన్న నుంచే వచ్చిందని చెప్పే వజ్రమ్మ ఉద్యమపోరు బ్రిటిష్‌ కాలంలోనే మొదలైంది. విదేశాల స్పిన్నింగ్‌ మిల్లులు సూచించిన పత్తి వంగడంతో మనదేశంలో పంట పండించడం మొదలైననాడే ఆమె పత్తి రైతుల ఆత్మహత్యలను ఊహించగలిగారు. ఆ దోపిడీ పత్తితో ఆగదని, దానికి అనుబంధ రంగమైన చేనేతకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.

కష్టం మనది... లాభం వాళ్లది
‘‘మనదేశంలో రకరకాల వాతావరణం, భౌగోళిక వైవిధ్యతల కారణంగా ప్రాంతానికి ఒక రకం పత్తి పండుతుంది. ఆ పత్తి నుంచి వచ్చే దారం, ఆ దారంతో నేసే దుస్తులలోనూ భిన్నత్వం ఉంటుంది. ఇంతటి వైవిధ్యతను కాలరాసింది ఒక్క స్పిన్నింగ్‌ యంత్రం. విదేశాల్లో ఏర్పాటైన వస్త్ర పరిశ్రమలకు ముడిసరుకు కావాలి. ఆ ముడిసరుకు వాళ్లు తయారు చేసుకున్న యంత్రాలకు అనుగుణంగా ఉండాలి. అందుకోసం మన రైతులకు పత్తి గింజలనిచ్చి... ‘పంట పండించండి, ఉత్పత్తిని మేమే కొంటాం’ అని చెప్పారు. అలా పత్తి గింజ వాళ్లదైంది, దారం వాళ్లదే అయింది. దారం ధరను నిర్ణయించే అధికారమూ వాళ్లదే అయింది. దాంతో చేనేత రంగం ముడిసరుకు సమస్యలో పడిపోయింది.

మనది కాని వంగడం తో తెగుళ్లు ఎక్కువ. దాంతో పత్తిని పండించే రైతు బతుకుకు లాభాలు వస్తాయనే భరోసా లేదు. దారం ధర నిర్ణయించేది వాళ్లే... దాంతో చేనేత మగ్గం అంధకారంలో మగ్గిపోయింది. లాభాలు మాత్రం స్పిన్నింగ్‌ మిల్లులవి. లాభాలను బట్టే సమాజంలో గౌరవాల స్థాయిలో కూడా ఎంతో తేడా. పత్తి రైతు, చేనేతకారుడు ఈ విషవలయం నుంచి బయటపడి ఆర్థికంగా బలపడాలి. దేశంలో అనేక ప్రాంతాల్లో పత్తి రైతులను, చేనేత పరిశ్రమలను స్వయంగా చూశాను. చేనేతకారులు తమ ఉత్పత్తులు మార్కెట్‌ చేసుకోవడానికి ‘దస్తకార్‌ ఆంధ్ర’ రూపకల్పనలో పనిచేశాను.

పదమూడేళ్లు గా మల్కా పరిరక్షణ మీద దృష్టి పెట్టాను. మల్కా అంటే ఖాదీ వంటి ఒక వస్త్ర విశేషం. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా ఉండదు. సిరిసిల్లలో డెబ్బై కుటుంబాలు మల్కా పరిరక్షణలో పని చేస్తున్నాయి. యూరప్, యూఎస్‌లు తాము అనుసరిస్తున్న సైన్స్‌కి మోడరన్‌ సైన్స్‌ అని ఒక ముద్ర వేసుకుని, థర్డ్‌ వరల్డ్‌ కంట్రీస్‌ని తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవడానికి కుట్ర పన్నాయి. మన యువతకు చెప్పేది ఒక్కటే. విదేశాల మీద ఆధారపడే పరిస్థితి నుంచి మనం బయట పడాలి. మన పత్తి నుంచి దారం తీయడానికి అధునాతన యంత్రాలను కనిపెట్టండి. మన పత్తి, మన దారం, మన నేత... వీటన్నింటికీ మనమే ధర నిర్ణయించగలిగిన వాళ్లమవుతాం’’ అంటారామె.

సెలబ్రిటీల సెలబ్రిటీ
ఉజ్రమ్మ నిరాడంబరంగా ఉంటారు. సెలబ్రిటీలు ఆమెతో ఫొటో తీసుకోవాలని ముచ్చటపడతారు. చేనేత అనగానే ముఖం చిట్లించే వారి చేత ‘ఐ లైక్‌ హ్యాండ్‌ వీవెన్‌ ఇండియన్‌ కాటన్‌’ అని స్టైలిష్‌గా పలికిస్తున్నారామె. పత్తి రైతు బతుకుకు కొరివి పెడుతున్న కంపెనీల బారి నుంచి రైతు జీవితానికి కాగడా పట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన ఉద్యమానికి వారసులుగా కొత్తతరం చేనేతకారులను తయారు చేస్తున్నారు. వారి కోసం మెహిదీపట్నంలో మల్కా మార్కెటింగ్‌ ట్రస్ట్‌ ద్వారా మార్కెటింగ్‌ మెళకువలు నేర్పిస్తున్నారు ఉజ్రమ్మ.

– వాకా మంజులారెడ్డి
 

మరిన్ని వార్తలు