చైనాకు చెక్‌..ఇంజినీర్‌ వైశాలి

30 Apr, 2021 00:01 IST|Sakshi
వైశాలి హివాసే: పోరు‘దారుల’ ప్రాజెక్టుకు తొలి మహిళా కమాండర్‌

‘తొలి మహిళ’ అనే మాట బాగా పాతబడిపోయిన భావనగా అనిపించవచ్చు. ‘అది ఇది ఏమని అన్ని రంగముల’ మహిళలు తమ ప్రతిభా ప్రావీణ్యాలను నిరూపించుకుంటూ రావడం ఇప్పుడు కొత్తేమీ కాకపోవచ్చు. అంతమాత్రాన తొలి మహిళ కావడం ఘనత కాకుండా పోదు.

తాజాగా వైశాలి హివాసే అనే మహిళ ఇండో–చైనా సరిహద్దులో భారత సైన్యం నిర్మించబోతున్న వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టుకు కమాండింగ్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు! ఒక మహిళ ఇలాంటి విధులను చేపట్టనుండడం భారత ఆర్మీ చరిత్రలోనే ప్రప్రథమం. ఆర్మీ విభాగమైన బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజొనీరుగా పని చేస్తున్న వైశాలికి ఇండియన్‌ ఆర్మీ ఈ ‘కఠినతరమైన’ పనిని అప్పగించడానికి కారణం గతంలో వైశాలి కార్గిల్‌ సెక్టార్‌లో ఇంజినీరుగా తనకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించడమే.

‘బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌’ (బీఆర్వో).. భారత సైన్యానికి ఎంత కీలకమైనదో, బీఆర్వోలో పని చేసే ఇంజినీర్ల బాధ్యతలు అంత ముఖ్యమైనవి. మహారాష్ట్రలోని వార్థా ప్రాంతానికి చెందిన వైశాలి ఎం.టెక్‌ చదివి ఇటువైపు వచ్చారు. సరిహద్దుల్లో శత్రుదేశాలను వెనక్కు తరిమేందుకు, మిత్రదేశాలకు అవసరమైన సాధన సంపత్తిని అందచేసేందుకు వీలుగా ఎప్పటికప్పుడు శత్రు దుర్భేద్యంగా దారులను నిర్మించడం బీఆర్వో ప్రధాన విధి. ఇప్పుడు వైశాలీ కమాండింగ్‌ ఆఫీసర్‌గా ఉండబోతున్నది శత్రుదేశం చొరబాట్లను నియంత్రించే దారిని నిర్మించే ప్రాజెక్టుకే!

   గత ఏడాది లడఖ్‌ సెక్టార్‌లో భారత్‌–చైనా ఘర్షణల మధ్య కూడా బీఆర్వో సిబ్బంది శత్రువును కట్టడి చేసే పైకి కనిపించని మార్గాలను, సొరంగాలను నిర్మిస్తూనే ఉన్నారు. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ప్రతికూల వాతావరణ, భౌగోళిక పరిస్థితుల్లో వైశాలి నేతృత్వంలోని ఇంజినీర్‌లు, నిర్మాణ కార్మికులు అక్కడి గండశిలల్ని పెకిలించి, భూభాగాలను తొలిచి.. భారత సైన్యం మాటువేసి శత్రువును తరిమికొట్టడానికి వీలుగా పోరాట మార్గాలను నిర్మించబోతున్నారు. అంత ఎత్తులో పని చేసేవారికి ఆక్సిజన్‌ సరిగా అందదు.

తవ్వకాల్లో దుమ్మూధూళీ పైకి లేస్తుంది. డ్రిల్లింగ్‌ ధ్వనులు నిర్విరామంగా చెవుల్లో హోరెత్తుతుంటాయి. సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చు. మధ్యలో కన్‌స్ట్రక్షన్‌ ప్లాన్‌ని మార్చవలసి రావచ్చు. వీటన్నిటినీ వైశాలే దగ్గరుండి పరిష్కరించాలి. ఇప్పటికే అక్కడికి రెండు ‘ఎయిర్‌–మెయిన్‌టైన్డ్‌ డిటాచ్‌మెంట్స్‌’ (అత్యవసర సేవల బృందాలు) చేరుకున్నాయి. ఇక వైశాలి వెళ్లి పనిని మొదలు పెట్టించడమే. శత్రువు ఆట కట్టించేందుకు ‘షార్ట్‌కట్‌’ మార్గాలను కనిపెట్టి, ‘పోరు దారులను’ నిర్మించడమే.
∙∙
బీఆర్వో ప్రస్తుతం లడఖ్, జమ్ము–కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కింలలో వ్యూహాత్మక దారుల్ని నిర్మిస్తోంది. చైనా సరిహద్దు వెంబడి ఉన్న 66 ప్రాంతాలలో ఇలాంటి దారుల్ని 2022 డిసెంబరు నాటికి నిర్మించాలన్న ధ్యేయంతో పని చేస్తోంది. కమాండింగ్‌ ఆఫీసర్‌ గా వైశాలి ఇప్పుడు ఎలాగూ కొండల్ని పిండి చేయిస్తారు కనుక తర్వాతి బాధ్యతల్లో కొన్నింటినైనా ఆమెకే అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. ‘తొలి మహిళ’ అనే మాట పాతబడి పోయినట్లనిపిస్తోందా?!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు