Vajrasana Benefits: మానసిక ఒత్తిడి, వెన్నునొప్పి, ఎసిడిటీ నివారణకు.. యోగా మంత్రమిదే!

28 Sep, 2021 12:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యోగా భారతీయుల శాస్త్రబద్ధమైన జీవన విధానానికి ప్రతీక. జ్ఞాన, ధ్యాన, చైతన్యాలకు ఇదొక జీవమార్గం. వేదకాలం నుంచే మన దేశంలో వెలుగుచూసిన ఈ ప్రాచీన ప్రక్రియ నేడు విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. యోగా వాసిష్ఠం, యోగ యజ్ఞవల్క, మహాభాష్యం, కుండలిని యోగ.. ఇలా మన పూర్వికులు రచించిన ఎన్నో గ్రంథాలు  యోగా ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్నాయి.

సూర్యనమస్కారం,  పద్మాసనం, త్రికోణాసనం, ప్రాణాయామం.. ఇలా సులువుగా వేయదగిన ఆసనాలను రోజువారీ జీవనవిధానంలో కనీసం అరగంటైనా చేస్తే మానసిక, శారీరక ఆరోగ్యం మీ సొంతమౌతుంది.సులభంగా చేయదగిన ఆసనాల్లో వజ్రాసనం కూడా ఒకటి. తిమ్మిర్ల నివారణ నుండి జీవక్రియను పెంచడం వరకు వజ్రాసనం ఎన్నో సమస్యలకు అద్భుతమైన పరిష్కారమార్గం. ఈ ఆసనాన్ని ప్రతి రోజూ 15 నిముషాలపాటు చేస్తే చేకూరే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదండోయ్‌!!

మనసిక ఒత్తిడి నుంచి విడుదల
జీర్ణక్రియ వృద్ధి
ఎసిడిటీ నివారణ
బరువు తగ్గడం
రుతుస్రావ, కండరాలు, మూత్ర సమస్యలకు చికిత్స 
వెన్నునొప్పిని తగ్గిస్తుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దలిస్టే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్య జీవనానికి మూలసూత్రమని చెప్పొచ్చు.

ఐతే కొంతమంది 5 నిముషాలు కూడా వజ్రాసన భంగిమలో కూర్చోలేకపోతారు. కాళ్లు తిమ్మిర్లు లేదా బెణకడం వంటివి అందుకు కారణాలుగా చెబుతారు. మామూలే అని వీటిని కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇటువంటివి మన జీవనశైలి మనుగడకు ముందస్తు సంకేతాలుగా పనిచేస్తాయి. ప్రముఖ యోగా నిపుణులు గ్రాండ్‌ మాస్టర్‌ అక్షర్‌ మాటల్లో..

నేలపై కూర్చోలేకపోవడం
ప్రస్తుత జీవనవిధానం వల్ల నేలపై కూర్చునే అలవాటే చాలా మందికి లేదు. తినడానికి, రాయడానికి, చదవడానికి... ప్రతిపనికీ కుర్చీ-టేబుల్‌ వాడేస్తున్నారు. ఇలాంటివారు నేలపై వజ్రాసనం వేయడం కష్టం. మన జీవనశైలి, అలవాట్ల కారణంగా, నడుము దిగువ భాగంలో ముఖ్యంగా మోకాలి కీళ్లలో బలం లేకపోవడంవల్ల కఠినమైన నేలమీద మోకాళ్లపై ఒత్తిడి పెంచే భంగిమలో కూర్చోలేకపోతున్నారు.

కీళ్ల సమస్యలు
మోకాళ్ల, కీళ్ల సమస్యలతో బాధపడేవారికి కూడా నేలపై వజ్రాసనం వేయడం సమస్యగానే ఉంటుంది.చీలమండలంలో బిగుతుకు పోయిన కండరాల కారణంగా కూడా దీర్ఘకాలం పాటు వజ్రాసన భంగిమలో ఉండకుండా మిమ్మల్ని నివారిస్తాయి" అని గ్రాండ్ మాస్టర్ అక్షర్ చెప్పారు.

అధికబరువు
ఉబకాయం (ఒబేసిటీ) సమస్యతో బాధపడే వారు కూడా మోకాళ్లపై వేసే ఈ ఆసనాన్ని వేయలేరు. ఇలాంటివారికి నేలపై కూర్చోవడమే పెద్దసవాలుగా ఉంటుంది.

వంగని బిరుసైన కండరాలు కూడా కారణమే
బిరుసైన కండరాలు కలిగిన వారిలో రక్తస్రసరణ సక్రమంగా ఉండదు. అందువల్లనే కేవలం కొన్ని సెకన్లపాటు కూడా వజ్రాసనంలో కూర్చోలేరు. స్తబ్ధమైన జీవనశైలి కారణంగా కండరాల సంకోచవ్యాకోచాలు జరగకపోవడంతో ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. దిగువ శరీరం మొద్దబారడంవల్ల, మోకాలు, చీలమండ కీళ్ల బలహీనత వల్ల,  మీ ప్రస్తుత జీవనశైలి అలవాట్ల వల్ల కూడా కావచ్చు.

ఎక్కువ సమయం వజ్రాసనంలో ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి
►కాళ్లను సాగదీయడం చేయాలి. కేవలం ఉదయం మాత్రమే కాకుండా సాయంత్ర సమయంలో కూడా తప్పనిసరిగా సాగదీస్తూ ఉండాలి.
►నడవడం, సైకిల్‌ తొక్కడం, మెట్లు ఎక్కడం.. వంటి ఎక్సర్‌సైజ్‌లతో మీ కాళ్లను దృఢంగా మలచుకోండి.
►ఒకేసారి ఎక్కువ టైం వజ్రాసనం వేయకండి. 30 సెకన్లతో ప్రారంభించి 4, 5 సార్లు ప్రాక్టీస్‌ చేయాలి. తర్వాత కొంచెం కొంచెంగా టైం పెంచుకుంటూ అలవాటు చేసుకోవాలి.
►మీ మోకాళ్లు లేదా కాళ్ల కింద దిండును సపోర్టుగా ఉంచి కూడా ప్రాక్టీస్‌ చేయవచ్చు.
వీటిని తరచూ ప్రాక్టీస్‌ చేయడం ద్వారా వజ్రాసనం వేయడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా వేయగలుగుతారని యోగా ఎక్స్‌పర్ట్‌ గ్రాండ్ మాస్టర్ అక్షర్ సూచించారు.

చదవండి: బీట్‌ రూట్‌, పెరుగు, పాలకూర, దానిమ్మగింజలు ప్రతిరోజూ తిన్నారంటే..!

మరిన్ని వార్తలు