ఐ లవ్యూ చెప్పకపోతే  ఏం పోయింది!

14 Feb, 2021 11:38 IST|Sakshi

‘ప్రేమిస్తున్నాను..’ అంటాం. ఇవ్వడమే ప్రేమ అయినప్పుడు.. ప్రేమను ఇమ్మని ఏడ్వడం దేనికి?! అసలు.. ‘ప్రేమిస్తున్నాను’ అని ఎందుకు చెప్పాలి? లోపల ఉంచుకుంటే ప్రేమ కాదా! సో.. ‘ఐ లవ్యూ’ అంటే అర్థం.. ‘నేన్నిన్ను ప్రేమిస్తున్నాను’ అని కాదు.. ‘నన్ను ప్రేమించవా ప్లీజ్‌’ అనేనా! నువ్వు ప్రేమిస్తే  నిన్ను ప్రేమించాలా? ఈ ఇచ్చిపుచ్చుకోవడం ఏంటి? నిజంగా ప్రేమంటే.. వన్‌ సైడెడ్‌ లవ్‌.  ‘అన్‌రిక్వయిటెడ్‌’ లవ్‌.  ఇవ్వడం మాత్రమే ఉన్నప్పుడు.. తీసుకునే థాట్‌ లేనప్పుడు.. బాధ ఉండదు.  ఆశ ఉండదు.  ఆవేదన ఉండదు.  హర్ట్‌ అవడం ఉండదు.. హార్ట్‌ బ్రేక్‌ అవడం ఉండదు.  అవునా! పూర్తిగా ‘అవును’ కాదు.  కొంచెమైనా  పెయిన్‌గా ఉంటుంది.  ఆ పెయిన్‌ ఎలాంటిదో కవి డాంటే కి తెలుసు. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌కి తెలుసు. ఇంకా కొంతమందికి తెలిసుండొచ్చు.  వాళ్లందరి పెయిన్‌లతో అల్లిన ఈ ‘ప్రేమ హారం’.. వాలెంటైన్స్‌ డే స్పెషల్‌.

బీట్రిస్‌ పుట్టినరోజు ఎప్పుడో ఎవరికీ తెలీదు.
ప్రేమ ఎప్పుడు పుట్టిందో లోకానికి తెలుసా!
బీట్రిస్‌ పారినరీ.. ఇటాలియన్‌ అమ్మాయి. నెలల నిండగానే తల్లి కడుపులోంచి ఎకాఎకి 25 ఏళ్ల వయసుతోనే పుట్టిన ‘పసికందు యువతి’లా ఉంటుంది బీట్రిస్‌. ఆ రూపాన్ని మాత్రమే మిగిల్చి వెళ్లింది లోకానికి. లోకం అంటే లోకం అంతా కాదు. ఆమే లోకంగా జీవించిన ఒక వ్యక్తికి తన జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోయింది! అతడు డాంటే. డాంటే అలిఘిరి. ఇటాలియన్‌ కవి. అతడు ప్రేమిస్తున్నట్లు ఆమెకు తెలియదు. ఆమెను ప్రేమిస్తున్నట్లు అతడూ చెప్పే వీలు లేదు. చెబితే భార్యకు చెప్పి ఏడవాలి. ‘నేను ఆ పిల్లను ప్రేమిస్తున్నా.. ఏం చెయ్యను?’ అని భోరుమనాలి.

ఆర్నో నదీతీరంలో స్నేహితులతో కలిసి వెళుతున్న బిట్రీస్‌ను దూరం నుండి ఆరాధనగా చూస్తూ గుండె చేత్తో  పట్టుకున్న డాంటే. మధ్యలో ఉన్న యువతే ట్రిస్‌. (ప్రసిద్ధ హెన్రీ  హాలిడే తైలవర్ణ చిత్రం)
మరకతాల్లా మెరిసే బీట్రిస్‌ కళ్లు డాంటే నిద్రను మింగేశాయి. అటూ ఇటుగా ఒక ఈడు వాళ్లు. ఆమె ఇరవై ఐదేళ్ల వయసప్పుడు చనిపోయింది. తర్వాత ముప్పై ఏళ్లకు డాంటే. వాళ్ల ప్రేమ చరిత్రలో ఇప్పటికీ నిలిచి ఉంది. ఆమేమీ అతడిని ప్రేమించలేదు. ఆరాధించలేదు. ఆమెకు తెలియకుండా తన గుండెలో ఆమెకొక ఆలయం కట్టుకున్నాడు. ఆ సంగతీ ఆమెకు చెప్పలేదు. ఆరాధ్య ప్రేయసికి మనసులోని మాట చెప్పలేక, పెళ్లికి తలవాల్చిన నిర్భాగ్యుడతడు! ‘‘నా జననం, నా మరణం, నా స్వర్గం, నా నరకం... అన్నీ బీట్రిస్సే’’అని భార్య ఎమ్మా డొనాటీ ఒడిలో బేలగా, దీనంగా వాలిపోయాడు. 

పిచ్చి ప్రేమ అతడిది. బీట్రిస్‌పై కవిత్వం రాశాడు. ‘బీట్రిస్‌ను కనడం కోసం ఫ్లారెన్స్‌ పుట్టిందా! పుట్టి, బీట్రిస్‌ కంటే ఒక ఏడాది ముందు అకారణంగా నన్ను కన్నదా?!’ అని ఫ్లారెన్స్‌ వీధుల్లో ఆమె నడిచి వెళ్లిన దారి వెంబడి పరిమళాలను వెతుక్కున్నాడు. ‘బీట్రిస్‌ను చూడకుండా నా తొమ్మిదవ యేటను దాటుకుని వెళ్లి ఉంటే జీవితంలో నాకింత హింస, ఇంత సంతోషం అవసరమై ఉండేవా?’ అని విలపించాడు. ఆమె ఎనిమిదేళ్ల వయసులో తనని చూశాడు. ఎనిమిదేళ్ల పిల్ల ఎలా ఉంటుందో అలా లేదు బీట్రిస్‌. స్త్రీలా ఉంది. అయితే.. మానవ స్త్రీలా కాదు.

వన్‌సైడెడ్‌ లవ్‌ : స్వేచ్ఛనిస్తుంది! 
ఆ తర్వాత ఆర్నో నదీ తీరంలో... ఏడేళ్ల తర్వాత.. కన్యగా కళ్లు తెరుస్తున్న బీట్రిస్‌ను చూశాడు. మళ్లీ ఒకసారి ‘ఇరవై ఏళ్ల వయసు’ ఆమెలో ఒళ్లు విరుచుకుంటున్నప్పుడు! తిరిగి ఇంకోసారి రెప్పలు దించిన వధువుగా ఆమె పెళ్లప్పుడు. చివరిసారిగా ఆమె చనిపోయినప్పుడు. తను మాత్రమేనా బీట్రిస్‌లో ప్రేమను వెదుక్కుంది. దైవం కూడా. కానీ దైవం ఆమె ప్రేమను కోరుకున్నాడు. అందుకేనా ఆమె తీసుకెళ్లాడు.. మొగ్గ పూర్తిగా విడవకుండానే.
బీట్రిస్‌పై డాంటేకు ఉన్నది అన్‌రిక్వైటెడ్‌ లవ్‌. మనసు లోపల దాచుకున్న ప్రేమ. 
‘వెళ్లెళ్లు చెప్పేసెయ్‌ 
ఏమవ్వదు. 
లోలోన దాగుంటే
ప్రేమవ్వదు’.. అని డార్లింగ్‌ సినిమాలో ప్రభాస్‌ మనసులో పాడిస్తాడు అనంత్‌ శ్రీరామ్‌.

చెప్పే వీల్లేకపోతే ఏం చేయను అంటాడు డాంటే. పైకి చెబితేనే ప్రేమ అయ్యేపనైతే ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ దీ ప్రేమ కాదు. చెప్పిన ప్రేమా ప్రేమవ్వలేదు! అతడి ఫస్ట్‌ లవ్‌ అలెగ్జాండ్రా. ‘ఐ లవ్యూ’ అనగానే ‘ఐ యామ్‌ సారీ’ అనేసింది. రష్యన్‌ అమ్మాయి. అందంగా ఉంటుంది. అతడితో ఉండలేనంది. ప్రేమంటే ఉండటమేనా అని వగచాడు. అతడిది స్వీడన్‌. యవ్వనంలో దేశాలు పట్టుకుని తిరిగాడు. అప్పుడు చూశాడు అలెగ్జాండ్రాని. రెండో అమ్మాయి బెర్తా కిన్‌స్కీ. అతడితో ఉంది కాని ‘నిన్ను చేసుకోలేను’ అంది. ఉన్నన్నాళ్లూ టచ్‌లో ఉండటమే ఆమె అతడిపై చూపిన కనికరం. ఎప్పుడైనా భర్తతో కలిసి ఆల్ఫ్రెడ్‌ను చూడ్డానికి వచ్చిపోతుండేది. భర్తతో కలిసి అతడికి ఉత్తరాలు రాస్తుండేది! శాంతి ఉద్యమంలో ఉన్నారు ఆ భార్యాభర్తలు.

ఒకరోజు ఆ అమ్మాయే ఆల్ఫ్రెడ్‌తో అంది – శాంతి కోసం ఏదైనా చేయమని. ‘‘డైనమైట్‌ని యుద్ధాలకు, విధ్వంసాలకు వాడుకుంటున్నారు. వాటిపై శాంతిని ప్రయోగించండి’ అని అడిగింది బెర్తా. నోబెల్‌ పీస్‌ ప్రైజ్‌ ఐడియా బెర్తాదే. ఇంకో అమ్మాయి సోఫీ హెస్‌. చిన్నపిల్ల. వియన్నాలో పూలు అమ్ముతుంటుంది. ఆమె అంటే తనకు ఎంత ఇష్టమో ఒకసారి బెర్తాకు చెప్పాడు. ఆ పిల్లను ‘మేడమ్‌ సోఫీ నోబెల్‌’ అని పిలుచుకోవడంలో జీవన సాఫల్యం లాంటి భావనేదో పొందేవాడు. అతడు పెళ్లి చేసుకోలేదు. ప్రేమను చేసుకున్నాడు అనాలి. ఆల్ఫ్రెడ్‌ ప్రకటించిన ప్రేమల కన్నా, అతడి అన్‌రిక్వైటెడ్‌ ప్రేమలే ఎక్కువ. 

లవ్‌ నుంచి బ్రేక్‌ అప్‌ అయినప్పుడు ఒంటరివాళ్లం అయిపోయామన్న నిస్పృహ ఆవరిస్తుంది. గుండెలోపల ఆ మనిషిపై ప్రేమ తోడుగా ఉన్నప్పుడు.. మనిషి దూరం అయితే మాత్రం ఒంటరివారు అవుతారా? వన్‌సైడెడ్‌ లవ్‌ హ్యాపీగా ఉంచుతుంది. ఏం కోరుకోం కనుక దేనికోసం వెతుక్కోం. ప్రేమంటే ఇదే కదా! సంతోషాన్ని పంచడం.

మరిన్ని వార్తలు