వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌; నేలమీద హరివిల్లు

29 May, 2021 21:00 IST|Sakshi

వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌

రోజెస్‌ ఆర్‌ రెడ్‌... వయొలెట్స్‌ ఆర్‌ బ్లూ... 
పిల్లలకు రంగులను పరిచయం చేసే 
ఈ గేయానికి రూపం వస్తే ఎలా ఉంటుంది? వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌లా ఉంటుంది. 

వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ దాదాపుగా 90 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో, హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉంది. ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే జూలై –ఆగస్టు నెలల్లో వెళ్లాలి. జూన్‌ నుంచి అక్కడక్కడా పూలు కనిపిస్తాయి. కానీ లోయ మొత్తం పూల తివాచీలా కనిపించేది జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు మాత్రమే. ఇది అద్భుతమైన టెక్కింగ్‌ జోన్‌. గోవింద్‌ ఘాట్‌ నుంచి సుమారు 15 కిలోమీటర్లు నడిస్తే కానీ చేరుకోలేం. అందుకే రెండు రోజుల ట్రెకింగ్‌ ప్లాన్‌ చేసుకోవాలి. మొదటి రోజు ట్రెక్‌లో హిమాలయాల సౌందర్య వీక్షణంలోనే సాగుతుంది. ఇక్కడ మంచు మెల్లగా మబ్బు తునకలుగా ప్రయాణించదు. తెరలు తెరలుగా గాలి దుమారంలాగ వేగంగా కదులుతుంటుంది. మాట్లాడడానికి నోరు తెరిస్తే నోట్లో నుంచి ఆవిరి వస్తుంది. 


సుమఘుమలు

రెండవ రోజు ట్రెకింగ్‌లో పూల ఆనవాళ్లు మొదలవుతాయి. ముందుకు వెళ్లే కొద్దీ పుష్పావతి లోయ రంగురంగుల హరివిల్లును తలపిస్తుంది. ఈ లోయను పూర్వకాలంలో పుష్పావతి లోయగా పిలిచేవారు. ఇక్కడ ఎన్ని రకాల పూలు ఉన్నాయంటే లెక్క చెప్పడం కష్టమే. కేవలం ఈ లోయలో మాత్రమే ఉండే పూల రకాలు ఐదు వందలకు పైగా ఉన్నట్లు ఇక్కడ రీసెర్చ్‌ చేసిన ప్రొఫెసర్‌ చంద్ర ప్రకాశ్‌ ‘ది వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌: మిత్స్‌ అండ్‌ రియాలిటీ’లో రాశారు. ఇక్కడ పుష్పావతి నది ప్రత్యేక ఆకర్షణ. తిప్రా గ్లేసియర్‌ కరిగి గౌరీ పర్బత్‌ మీదుగా జాలువారి నది రూపం సంతరించుకుంటుంది. పుష్పావతిలోయలో ప్రవహిస్తుండడంతో దీనికి పుష్పావతి నది అనే పేరు స్థిరపడిపోయింది. ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని నేషనల్‌ పార్కుగా ప్రకటించి పరరక్షిస్తోంది. యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ జాబితాలో చేర్చింది.

మృగాల్లేవు... మునుల్లేరు!
ఇక్కడ హిమాలయ పర్వతాలు 3350 మీటర్ల నుంచి 3650 మీటర్ల ఎత్తు ఉంటాయి. ఎలుగుబంటి, నక్క, మంచులో తిరిగే చిరుత వంటి కొన్ని అరుదైన జంతువులుంటాయి. కానీ పర్యాటకుల తాకిడితో అవి ట్రెక్కింగ్‌ జోన్‌ దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. మునులు ఈ ప్రశాంత వాతావరణంలో తపస్సు చేసుకునే వారని, ఇప్పుడు మునులు కూడా కనిపించడం లేదని స్థానికులు చెబుతారు. పర్వత ప్రదేశాల్లో కనిపించే అరుదైన పక్షులు మాత్రం ఇప్పటికీ స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. ఈ టూర్‌లో పూలతోపాటు ఆకాశంలో ఎగిరే పక్షులను చూడడం మర్చిపోవద్దు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు