లాయర్‌ వనిత: అగ్రరాజ్య అటార్నీ

10 Jan, 2021 00:30 IST|Sakshi

అమెరికాలో ఈ ఏడాది జనవరి 20 భారతీయులకు పెద్దపండగ. అక్కడ ఉన్న ఎన్నారైలకే కాదు, ఇక్కడున్న మనక్కూడా. ఆ రోజు జో బైడెన్‌ అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు అమెరికా చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ బాధ్యతలు చేపడతారు. కమల భారత సంతతి మహిళ కనుక అది మనకు గర్వకారణం. అయితే ఈ గర్వకారణం ఇప్పుడు కమల ఒక్కరి వల్లే కాదు, వనితాగుప్త వల్ల కూడా. గురువారం జో బైడన్‌ అమెరికా అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా భారతీయ అమెరికన్‌ వనితాగుప్తను నామినేట్‌ చేశారు. అగ్రరాజ్యానికి శ్వేతసౌధం, జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ అత్యంత కీలకమైనవి. ఈ కీలకమైన విభాగాలు రెండిటిలోనూ కమల, వనిత ఉన్నారు! దీనర్థం వచ్చే నాలుగేళ్ల అమెరికా పరిపాలనలో భారతీయుల సగ భాగస్వామ్యం కూడా ఉండబోతున్నదని.

శ్వేతసౌధంలో కమల ఎలాగో, జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌లో వనిత అలాగ. జో బైడన్‌.. వనితను అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా నామినేట్‌ చెయ్యగానే ఆ అగ్రరాజ్యపు ప్రధాన న్యాయ వ్యవస్థకు కొండంత బలం చేకూరినట్లయింది. ఇదేమీ అతిశయోక్తితో కూడిన మాట కాదని వనిత ‘ప్రొఫైల్‌’ చూస్తే అర్థమౌతుంది. అసలు 45 ఏళ్ల వయసుకే వనిత ఆ అత్యున్నత స్థానాన్ని చేపట్టబోతున్నారు. ఆమె నియామకానికి సెనెట్‌ ఆమోదం తెలుపవలసి ఉన్నప్పటికీ అదేమీ విషమ పరీక్ష కాదు. పాలనా పరమైన ఒక సోపానం మాత్రమే. అటార్నీ జనరల్‌ జస్టిస్‌ మెరిక్‌ గార్లండ్‌ తర్వాతి స్థానం వనిత దే. ఆమె తర్వాత లీసా మొనాకో డిప్యూటి అటార్నీ జనరల్‌గా ఉంటారు. లీసా తర్వాత క్రిస్టెన్‌ క్లార్క్‌ అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌గా ఉంటారు.

ఈ టీమ్‌ అంతా కూడా న్యాయ వ్యవస్థలోని పౌర హక్కుల విభాగానికి పని చేస్తుంది. వనితను ఈ విభాగంలోకి తీసుకోడానికి ప్రధానం కారణం కూడా అదే. పౌర హక్కుల న్యాయవాదిగా ఆమెకు అమెరికా అంతటా మంచి పేరుంది. బైడన్‌ తనను నామినేట్‌ చేయగానే ‘‘బాధ్యత ఉన్న స్థానంలోకి నేను ఎంపికవడం నాకు లభించిన గౌరవం’’అని వనిత ట్వీట్‌ చేశారు. ‘‘రాజకీయ జోక్యాలకు, ఒత్తిళ్లకు లోను కాకుండా నా వృత్తి ధర్మాన్ని నేను నెరవేరుస్తాను’’ అని కూడా అమెరికన్‌ ప్రజలకు ఆమె మాట ఇచ్చారు. గురువారం సరిగ్గా అమెరికన్‌ పాలనా భవనంలో అల్లర్లు జరుగుతున్న సమయంలోనే వనిత నియామకం జరిగింది. అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టగానే బహుశా ఆమె టేబుల్‌ మీదకు వచ్చే మొదటి కేసు ఆ ఘటనకు కారకులైన వారికి సంబంధించినదే అయివుండే అవకాశాలున్నాయి. బైడెన్‌ ప్రతి విభాగంలోని తన టీమ్‌ని ఎన్నో ఎంపికల తర్వాత మాత్రమే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరీ ఖరారు చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే అనితకు వచ్చిన అవకాశమే ఇది. వాస్తవానికి ఇది అమెరికన్‌ పౌరులకు వచ్చిన అవకాశం అనుకోవాలి.

వనిత తల్లిదండ్రులు రాజీవ్, కమల, అక్కాచెల్లెళ్లు అనిత, అమిత 
అనితాగుప్తా యేల్‌ యూనివర్సిటీలో ‘లా’ చదివారు. ఆ వెంటనే న్యూయార్క్‌లోని ప్రముఖ పౌర హక్కుల సంస్థ ఎల్‌.డి.ఎఫ్‌. (లీగల్‌ డిఫెన్స్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ఫండ్‌’ లో చేరారు. ఆ సంస్థ తరఫున ఆమె చేపట్టిన కేసులన్నీ.. ‘అందరూ తెల్లవాళ్లే జడ్జిలు గా ఉండే’ కోర్టులు టెక్సాస్‌లోని ఆఫ్రో అమెరికన్‌లపై దోషులుగా ఇచ్చిన తీర్పులు సవాలు చేసి, నిందితులను జైళ్ల నుంచి విడిపించడం. వారి పౌర హక్కులను పరిరక్షించడం. అరేళ్లు అక్కడ పనిచేశాక 2007లో అమెరికన్‌  సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌లో న్యాయవాది (స్టాఫ్‌ అటార్నీ) అయ్యారు. పౌర హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్న అమెరికన్‌ వలస చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు కృషి చేశారు.

పెళ్లయ్యాక మహిళల లక్ష్యాలకు ఆటంకాలు ఏర్పడి ఇల్లే ఆమె గమ్యం అవుతుందని అంటారు. అయితే గత పదిహేడేళ్లుగా వనిత వాదిస్తున్న కేసులలో, సాధిస్తున్న విజయాలలో ఆమె భర్త ఛిన్‌ క్యు లె సహకారం కూడా ఉంది. 2003లో వారి వివాహం జరిగింది. ఇద్దరు కొడుకులు. ఛిన్‌ కూడా న్యాయ రంగంలోనే ఉన్నారు. కొలంబియా డిస్ట్రిక్ట్‌ ‘లీగల్‌ ఎయిడ్‌’ సంస్థకు ప్రస్తుతం ఆయన లీగల్‌ డైరెక్టర్‌. వనితకు అమిత అనే చెల్లి ఉన్నారు. ఆమె మాత్రం వైద్య రంగాన్ని ఎంచుకుని హెచ్‌.ఐ.వి., టీబీలపై అమెరికాలోనే వైద్య పరిశోధనలు చేస్తున్నారు.

అమ్మ నాన్న చెల్లి
వనిత తల్లిదండ్రులది ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌. తండ్రి రాజీవ్‌ గుప్త. తల్లి కమల వర్షిణి. రాజీవ్‌ బిజినెస్‌మ్యాన్‌. ఎం.బి.ఎ. చదివింది అమెరికాలోనే అవడంతో ఫిలడెల్ఫియాలో స్థిరపడ్డారు. ఇండియాలో ఉన్నప్పుడే 1968 లో వాళ్ల పెళ్లి జరిగింది. 1974లో ఫిలడెల్ఫియాలో వనిత పుట్టింది. తర్వాత అమిత. కమల గోల్ఫ్‌ ప్లేయర్‌. టేబుల్‌ టెన్నిస్‌ కూడా ఆడతారు. తోట పని అంటే ఇష్టం. రోజులో ఎక్కువ భాగం పూలతోనే గడుపుతుంటారు. రాజీవ్, కమల మూడేళ్ల క్రితం ఇండియా వచ్చి తమ 50 వ పెళ్లి రోజును జరుపుకుని వెళ్లారు. ‘‘కుటుంబం కోసం కమల తన జీవితాన్ని త్యాగం చేసింది’’ అని ఆ సందర్భంగా రాజీవ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు