ఇంట్లోనే డెలివరీ ప్లాన్‌ చేద్దాం అంటున్నారు

9 May, 2021 10:11 IST|Sakshi

మేడమ్‌.. నాకిప్పుడు ఎనిమిదో నెల. మే 23కి డ్యూ డేట్‌ ఇచ్చారు డాక్టర్‌. మే నెలలో కరోనా పీక్‌లో ఉంటుంది. జాగ్రత్త అని చెప్తున్నారు. నాకేమో అప్పుడే డెలివరీ డేస్‌ అన్నారు. చాలా భయంగా ఉంది. మా అమ్మా వాళ్లేమో పీహెచ్‌సీలోని నర్స్‌ సహాయంతో ఇంట్లోనే డెలివరీ ప్లాన్‌ చేద్దాం అంటున్నారు. కన్‌ఫ్యూజన్‌గా ఉంది.  ఏం అర్థంకావట్లేదు. సలహా ఇవ్వగలరు.  – ఎన్‌. దేవిక, దర్పల్లి, నిజామాబాద్‌ జిల్లా.

ఫస్ట్‌వేవ్‌లో కంటే సెకండ్‌ వేవ్‌లో చాలామంది గర్భీణీలు కరోనా వ్యాధి బారిన పడుతున్నారు. దీని వలన వారిలో, వారి కుటుంబంలో తల్లి, బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంటాయి అని ఆందోళన, దిగులుతో ఉంటున్నారు. కాకపోతే అదృష్టం కొద్ది చాలా వరకు ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి డాక్టర్‌ పర్యవేక్షణలో తగిన చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటే తీవ్రమైన సమస్య లేకుండా తల్లి, బిడ్డ బయటపడొచ్చు. డాక్టరు పర్యవేక్షణ అవసరమైన ర క్త పరీక్షలు చెయ్యించుకుంటూ, లక్షణాలను బట్టి సరైన మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకోవాలి.

ఆయసం వంటి ఇంకా ఇబ్బంది కరమైన లక్షణాలు ఉంటేనే హాస్పిటల్‌లో అడ్మిట్‌ అవ్వవలసి ఉంటుంది. ఇక డెలివరీ విషయానికి వస్తే, ఆందోళన చెందకుండా సరిగ్గా చెకప్‌కు వెళుతూ ప్లాన్‌ చేసుకోవడం మంచిది. నిర్మిత డెలివరీ సమయంలో 15–20 శాతం మందిలో బిడ్డకి పెల్విస్‌ మార్గంలో వచ్చి మధ్యలో ఆగిపోవడం, బిడ్డకు ఆక్సిజన్‌ సరిగా అందక, గర్భంలోపలే మోషన్‌ చేయడం, గుండె కొట్టుకోవడం తగ్గిపోవటం, పుట్టగానే ఏడవకపోవటం, తల్లిలో ఆయాసం, బీపీ పెరగటం, తగ్గటం, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.

హాస్పిటల్‌ అన్ని వసతులు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని తగ్గ చికిత్స, అవసరమైతే ఆపరేషన్‌ చేయ్యడం, ఆక్సిజన్‌ అందించడం, అధిక రక్తస్రావం అయితే, రక్తం ఎక్కించటానికి ఏర్పాటు చెయవచ్చు. ఒక్కొక్కసారి హాస్పిటల్‌లో అన్నీ ఉన్నా సమస్యను బట్టి కాంప్లికేషన్స్‌ ఏర్పడి, తల్లికాని, బిడ్డకాని ప్రాణ పాయ పరిస్థితిలోకి వెళ్లవచ్చు.

మరి అలాంటప్పుడు బయటి పరిస్థితులకు భయపడి ఇంట్లోనే నర్సుతో కాన్పు చేయించుకోవటానికి ప్రయత్నం చేస్తే అంతా సజావుగా జరిగితే మంచిదే, కాని పైన చెప్పిన కాంప్లికేషన్స్‌ వస్తే అప్పుడు ఇబ్బంది, బాధ పడేది మీరే కదా. సెకండ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ ఇంట్లోనే ఉన్నా సోకదని గ్యారంటి ఏమి లేదు. కాబట్టి ఆసుపత్రిలో డెలివరీకి ప్లాన్‌ చేసుకోవడం మంచిది. భయపడకుండా సరైన నిర్ణయం తీసుకోండి. 

డాక్టర్‌గారూ.. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు కోవిడ్‌ టీకా వేయించుకోకూడదని అంటున్నారు. కొందరేమో అది తప్పు.. వేయించుకోవచ్చు ఏమీ కాదు అంటున్నారు. అంతా గందరగోళంగా ఉంది. వేయించుకోవచ్చో.. వేయించుకోకూడదో.. దయచేసి చెప్పగలరు.
– సుప్రజ, ఇ మెయిల్‌ ద్వారా అందిన ప్రశ్న. 
కోవిడ్‌ టీకా తీసుకోవడానికి, పీరియడ్స్‌కు ఏ సంబంధంలేదు. ఈ టీకాను నెలలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. టీకా తీసుకున్న తర్వాత, దానిలో ఉండే నిర్వీణ్యం చేసిన వైరస్, వైరస్‌కి సంబంధించిన ప్రోటీన్, జన్యుపదార్థాలకు వ్యతిరేకంగా పోరడటానికి, వాటిని నశింప చెయటానికి ఉత్పన్నమవుతాయి. ఈ పోరాటంలో కొందరికి జర్వం, ఒళ్లు నొప్పులు, నీరసం, ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రదేశంలో కొద్దిగా వాపు, నొప్పి వంటి ఇబ్బందులు ఏర్పడతాయి.

పీరియడ్స్‌ సమయంలో కొందరికి హార్మోన్ల మార్పుల వలన బ్లీడింగ్‌ ఎక్కువ అవడం, నీరసం, నడుంనొప్పి, పొత్తికడుపునొప్పి, వంటి లక్షణాలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ ఇబ్బందలతో పాటు.. వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడు వచ్చే ఇబ్బందులు తోడయి ఇంకా నీరసం, బలహీనపడటం, వంటి సమస్యలతో బాధపడటం జరుగుతుంది. కొందరిలో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి పీరియడ్స్‌ సమయంలో వ్యాక్సిన్‌ను వారి వారి లక్షణాలు, శరీర తత్వానికి బట్టి తీసుకోవటం మంచిది. అంతేకాని, పీరియడ్స్‌ సమయంలో వ్యాక్సిన్‌ తీసుకోకూడదని నిబంధన ఏమి లేదు. 

-డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు