ఇంత చిన్న వయసులో...

29 Nov, 2020 08:08 IST|Sakshi

సందేహం

మేడమ్‌.. మా పాప పదేళ్లు నిండగానే పెద్దమనిషి అయింది. మాకు షాకింగ్‌గా ఉంది. అంత చిన్న వయసులో ఏంటీ అని? నేను పదమూడేళ్లు నిండడంతో అయ్యాను. మా అక్కచెల్లెళ్లంతా ఇంచుమించు అదే వయసులో రజస్వల అయ్యారు. ఇప్పుడు మా అమ్మాయి, మా ఆడపడచు వాళ్ల అమ్మాయీ అంతే పదకొండేళ్లకు అయింది. ఎందుకలా? ఫుడ్‌ ప్రభావమా? – వి. సమీరజ, నిజామాబాద్‌
ఆధునిక కాలంలో మారుతున్న జీవన శైలి వల్ల, జంక్‌ఫుడ్, మారిన ఆహారపు అలవాట్లు, ఆహారంలో, పర్యావరణంలో మార్పులు, అధిక బరువు, వ్యాయామాలు లేక పోవడం, ఇంటర్‌నెట్, మీడియా, సెల్‌ఫోన్‌ల వల్ల అనేక విషయాలు లోతుగా తెలుసుకోవడం, హార్మోన్లు త్వరగా ఉత్తేజం చెందడం, వంటి అనేక కారణాల వల్ల ఇప్పుడు పిల్లలు 10–11 సంవత్సరాల నుంచే రజస్వల అవుతున్నారు. ఇంతకు ముందు కాలంలో 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల రజస్వల అయ్యేవారు. 10–11 సంవత్సరాల ఆడపిల్లలంటే అల్లారు ముద్దుగా పెరిగే వయస్సులో ఉన్నవారు. వీరికి ఈ పీరియడ్‌ సమయంలో న్యాప్‌కిన్స్‌ సరిగా పెట్టుకోవడం, వాటిని సరిగా పడవేయడం, జనేంద్రియాలు శుభ్రపరుచుకోవడం, శారీరక శుభ్రత వంటి పనులు చాలా ఇబ్బందిగా, కష్టంగా ఉంటాయి. వీరితో తల్లిదండ్రులు చాలా సంయమనంతో ఉండవలసి ఉంటుంది. అన్ని విషయాలు చాలా ఓపికతో వివరించవలసి ఉంటుంది. కొందరు పిల్లల్లో మెదడులో కంతులు, ఇన్‌ఫెక్షన్స్, అండాశయాల్లో కంతులు, వంటి అనేక సమస్యల వల్ల 8–9 సంవత్సరాలకే రజస్వల అవ్వడం జరుగుతుంది. దీనిని ప్రికాషియస్‌ ప్యూబర్టీ అంటారు. అలాంటప్పుడు ఒకసారి ఎండొక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి అవసరమైన పరీక్షలు, సలహాలు తీసుకోవడం మంచిది. 

మేడమ్‌.. నాకు 22 ఏళ్లు. పెళ్లయి ఆరునెలలు అవుతోంది. నా సమస్య వల్ల నా వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడింది. నాకు కుడి బ్రెస్ట్‌ పెద్దదిగా, ఎడమ బ్రెస్ట్‌ చిన్నదిగా ఉంది. నేను మెచ్యూర్‌ అయినప్పుడే ఈ సమస్యను పసిగట్టి మా అమ్మ మా ఊరిలోని గైనకాలజిస్ట్‌ దగ్గరకు నన్ను తీసుకెళ్లింది. అదేం జబ్బు కాదని, ప్రమాదం అంతకంటే కాదని, చాలా సాధారణమైన విషయమని తేల్చారావిడ. ఏవో వ్యాయామాలు చెప్పి చేయమన్నారు. కొన్నాళ్లు చేశాను. కాని చదువు, ఇతరత్రా వ్యాపకాల్లో పడి ఎక్సర్‌సైజ్‌ మీద శ్రద్ధ పెట్టలేదు. నా సమస్యనూ పట్టించుకోలేదు. కాని ఇప్పుడదే నా కాపురాన్ని చెడగొడుతోంది. ఏం చేయమంటారు?
– వినీత చీమకంటి ( ఈ  మెయిల్‌ ద్వారా)
తల్లి గర్భంలో బిడ్డ పిండంగా మొదలయ్యి అందులో అనేక అవయవాలు ఏర్పడుతూ శిశువుగా మారుతుంది. ఈ అవయవాలు ఏర్పడే సమయంలో, కొందరిలో జన్యుపరమైన కారణాలు, పర్యావరణ మార్పులు, తల్లిలో ఆహార లోపాలు, కొన్ని రకాల మందులు వాడటం వంటి ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల అవకతవకలు జరిగి, శిశువు శరీర నిర్మాణంలో లోపాలు జరిగి, ఒక్కొక్కరిలో ఒక్కోలాగా కొన్ని అవయవాలు సరిగా తయారు కాకపోవడం, పని తీరులో లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందులో మెదడు, గుండె లోపాలు, కాళ్లు చేతులు లేకపోవడం వంటి ఎన్నో పెద్దపెద్ద లోపాలతో పాటు చిన్న చిన్న లోపాలూ ఉండవచ్చు. అలాగే నీకు కూడా ఒక రొమ్ము పెద్దగా, ఒక రొమ్ము చిన్నగా ఏర్పడింది. వాటితో పోలిస్తే, డాక్టర్‌ చెప్పినట్లు నీది అసలు సమస్యే కాదు. రొమ్ముల పరిమాణంలో తేడా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానికి చేయగలిగింది కూడా ఏమీ లేదు (ప్లాస్టిక్‌ సర్జరీ తప్ప). ఇదేమీ కాపురాన్ని చెడగొట్టే సమస్య కాదు. అది అవతల మనిషి ఆలోచనా తీరులో ఉంటుంది. నీకు నువ్వు అది సమస్య అనుకుంటూ, అదేదో లోపం అని బాధపడుతుంటే, నీ భర్త దానిని నిజమే అనుకొని నిన్ను విసుక్కుంటూ, హేళన చేస్తూనే ఉంటాడు. కాబట్టి మొదట నిన్ను నువ్వు ఇదేం సమస్య కాదు, నా తప్పు కాదు అని సమర్థించుకొని తర్వాత నీ భర్తతో ప్రేమతో ఓపికతో నచ్చజెప్పడానికి ప్రయత్నించు. లేదు అంటే అతడిని డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లి డాక్టర్‌తో మాట్లాడించడం మంచిది. చిన్నగా ఉన్న రొమ్ముని, రోజూ మెల్లగా మసాజ్‌ చేసుకోవడం వల్ల, దానికి రక్త ప్రసరణ పెరిగి కొద్దిగా పరిమాణం పెరిగే అవకాశాలు ఉంటాయి.

మాది  కొత్త పెళ్లి జంట. కరోనా సెకండ్‌ వేవ్‌ అంటున్నారు. సెక్సువల్‌ ఇంటిమసీ పట్ల చాలా భయపడ్తున్నాం. ఇంకా చెప్పాలంటే లిప్‌లాక్‌ అంటే కూడా భయంగా ఉంటోంది. కరోనా సమయంలో ఎలా ఉండాలో సలహా ఇవ్వండి ప్లీజ్‌...
– పేరు రాయలేదు.
కరోనా వైరస్‌ నోటి నుంచి, ముక్కు నుంచి వచ్చే ద్రవాలు. ఇంకొకరికి పాకడం వల్ల వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా కూడా ఈ వైరస్‌ ఒకే గదిలో ఎక్కువ సేపు ఉన్నా ఇద్దరు మనుషుల్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి చాలా వరకు వ్యాప్తి చెందుతుంది. అలాంటప్పుడు భార్యభర్తల్లో ఒకరికి కరోనా ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఇంకొకరికి కచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇద్దరు బయట వాతావరణం నుంచి కరోనాకు గురికాకుండా చూసుకోడానికి ప్రయత్నాలు, జాగ్రత్తలు తీసుకోవాలి (మాస్క్, సానిటైజర్, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరం వంటివి). ఈ వైరస్‌ ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించట్లేదు కాబట్టీ, మీరు ఇద్దరూ భయపడుతూ ఎంతకాలం ఉంటారు. ఒక వేళ ఒకరికి వచ్చి, లక్షణాలు తెలిసేటప్పటికే ఇంకొకరికి వైరస్‌ సోకి ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కలవడం అంటూ ఏమి ఉండదు, మొత్తానికే దూరంగా ఉండటం తప్ప, భయపడకుండా, ఒక వేళ కరోనా వచ్చినా, ఎక్కువగా కాంప్లికేషన్స్‌ లేకుండా, తగ్గిపోవడానికి మీ రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీని పెంచుకోవడానికి సరైన పోషక పదార్థాలు తీసుకుంటూ తగిన వ్యాయమాలు చేస్తూ సంతోషంగా ఉండండి.
-డా.వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు