ఒకే నెలలో రెండుసార్లు! 

15 Nov, 2020 07:57 IST|Sakshi

సందేహం

మా అమ్మాయి వయసు పదిహేను సంవత్సరాలు. గత ఏడాది మెచ్యూర్‌ అయింది. పదహారు రోజుల తర్వాత రెండోసారి మెన్సస్‌ అయింది. అలా ఒకేనెలలో రెండుసార్లు పీరియడ్స్‌ వచ్చాయి. డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాను. తర్వాత మూడు నెలలకు వచ్చింది. ఆ తర్వాత బాగానే వచ్చేవి. మళ్లీ ఒకనెల రాలేదు. డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాక, రెండు నెలలకు వచ్చింది. తర్వాత బాగానే వచ్చేవి. ఇప్పుడు అక్టోబర్‌లో రాలేదు. డాక్టర్‌ దగ్గరకు తీసుకు వెళ్లాలా లేదా? మా అమ్మాయి వెయిట్‌ 58 కేజీలు, ఎత్తు 5.3. పీరియడ్స్‌ సరిగా వచ్చేలా తగిన డైట్, వెయిట్‌ తగ్గాలా లేదా తెలియజేయండి. – ప్రసన్న పులిదిండి (ఈ మెయిల్‌ ద్వారా)

సాధారణంగా అమ్మాయిలలో 11 నుంచి 16 సంవత్సరాల లోపల ఒక క్రమ పద్ధతిలో మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి ఊ ఏ, ఔఏ అనే హార్మోన్స్‌ విడుదలై అవి అండాశయాల మీద ప్రభావం చూపి, వాటి నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్స్‌ విడుదలని ఉత్తేజపరచడం వల్ల గర్భాశయం నుంచి బ్లీడింగ్‌ అవ్వడం వల్ల పీరియడ్స్‌ మొదలవుతాయి. ఈ హార్మోన్స్‌ అన్నీ సక్రమంగా పని చేయడానికి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి ఒకటి, రెండు సంవత్సరాలు పడుతుంది. అంతవరకు పీరియడ్స్‌ కొందరిలో సక్రమంగా రాకుండా, రెండు మూడు నెలలకొకసారి రావడం, బ్లీడింగ్‌ ఎక్కువ అవ్వడం, లేదా నెలలో రెండు సార్లు రావడం, తొందరగా రావడం వంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడున్న ఆధునిక కాలంలో మారిన ఆహారపు అలవాట్లు (జంక్‌ ఫుడ్‌), శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, జన్యుపరమైన మార్పుల వంటి వాటి వల్ల కూడా, పీసీఓడీ, థైరాయిడ్‌ సమస్యలు వంటివి ఏర్పడి హార్మోన్లు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా పీరియడ్స్‌ నెలనెలా రాకపోవచ్చు.

మీ అమ్మాయి 5.3 ఎత్తుకి 47–57 కేజీల వరకు బరువు ఉండవచ్చు. తను 58 కేజీలు అంటే కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి, ఆమెకు మితమైన పౌష్టికాహారం ఇవ్వవచ్చు. ఆహారంలో నూనె వస్తువులు, జంక్‌ఫుడ్‌ వంటివి నివారించండి. అలాగే బరువును అదుపులో ఉంచడానికి వాకింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, యోగా వంటి వ్యాయమాలు చేయించడం మంచిది. దీనివల్ల తనకి హార్మోన్లు సక్రమంగా పనిచేయడం మొదలవుతుంది. పీరియడ్స్‌ రెగ్యులర్‌గా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కొన్ని నెలలు ఆగి చూసి అయినా పీరియడ్స్‌ అలానే ఉంటే, తనకి ఒకసారి థైరాయిడ్‌ పరీక్ష, అల్ట్రాసౌండ్‌ పెల్విక్‌ స్కానింగ్‌ చేయించండి. వీటిలో ఏదైనా సమస్య ఉంటే దానిని బట్టి చికిత్స తీసుకోవచ్చు. 

డాక్టర్‌ గారూ మా పాపకు పదకొండేళ్లు. పాప పుట్టినప్పుడు క్లిటోరస్‌ బయటకు వచ్చి ఉండింది. తర్వాత అది మామూలు అయిపోతుంది అన్నారు. అయిపోయింది కూడా. కాని ఇప్పుడు మళ్లీ బయటకు పొడుచుకొచ్చింది. గైనకాలజిస్ట్‌కు చూపిస్తే సర్జరీ చేయాలన్నారు. మాకు భయంగా ఉంది. అసలు ఇదేం సమస్యో మాకు అర్థంకావట్లేదు.
– పేరు, ఊరు వివరాలు ఇవ్వలేదు. 
జనేంద్రియాల బయట భాగంలో పైకి చిన్న బొడిపిలాగా ఉండే అవయవాన్ని క్లిటోరిస్‌ అంటారు. ఇందులో కండరంతో పాటు, స్పాంజ్‌ వంటి కణజాలం, నాడులు, రక్త నాళాలు ఎక్కువగా ఉంటాయి. దీని పెరుగుదల ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్‌ వంటి హార్మోన్‌ల ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. ఆడవారిలో క్లిటోరిస్, మగవారిలో  పెనిస్‌ (పురుషాంగం)లాంటి అవయవమే. అలాగే దాని పనితీరు ఉంటుంది. సాధారణంగా కూడా రజస్వల సమయంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ విడుదల పెరుగుతుంది. దాని ప్రభావం వల్ల క్లిటోరిస్‌ కొద్దిగా పెరిగి ముందుకు వస్తుంది. కాని మీరు చెప్పినదాన్ని బట్టి అది ఎక్కువగా పెరిగినట్లుంది. కొందరిలో పీసీఓడీ, అడ్రినల్‌ గ్రంథిలో ట్యూమర్లు, కుషింగ్‌ సిండ్రోమ్‌ వంటి అనేక కారణాల వల్ల టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్స్‌ వంటి మగవారిలో ఎక్కువగా ఉండే హార్మోన్లు, ఆడవారిలో ఎక్కువగా విడుదల అవ్వడం వల్ల క్లిటోరిస్‌ పరిమాణం పెరుగుతుంది. దీనినే క్లిటోరోమెగాలి అంటారు.

కొందరిలో అరుదుగా జన్యుపరమైన సమస్య వల్ల కూడా ఇలా ఉండవచ్చు. చాలా అరుదుగా బిడ్డలో ్ఠy క్రోమోజోమ్స్‌ ఉండి, వాటిలో జన్యుపరమైన లోపాలు ఉండి, టెస్టోస్టిరాన్‌ హార్మోన్ల తయారీ, పనితీరులో లోపాలు ఉంటే కూడా జనేంద్రియాలు సరిగా పెరగకుండా, బయటకు ఆడబిడ్డలాగా కనిపించి, వయసు పెరిగే కొద్ది హార్మోన్ల ప్రభావం వల్ల కూడా క్లిటోరిస్‌ పెద్దగా కనిపించవచ్చు. కాబట్టి మళ్లీ ఒకసారి ఎండొక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి వివరంగా అవసరమైన రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్‌ అబ్టామిన్‌ స్కానింగ్, హార్మోన్‌ పరీక్షలు వంటి పరీక్షలు చేయించుకొని, పైన చెప్పుకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవా అని నిర్ధారించుకొని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి. కారణాలు ఏమీ కనపడకపోతే, క్లిటోరిస్‌ పెద్దగా ఉండటం వల్ల, ఇబ్బంది చాలా అనిపిస్తే ఆపరేషన్‌కు వెళ్లడం మంచిది. ఈ వయసులో ఆపరేషన్‌ చేసినా వయసు పెరిగే కొద్ది హార్మోన్స్‌ ప్రభావం వల్ల మళ్లీ పెరగవచ్చు. ఇబ్బంది లేకపోతే ఇంకా కొంత కాలం ఆగి చూసి, తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది.
-డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా