అది ఫాలో అవ్వొచ్చా?

13 Dec, 2020 09:20 IST|Sakshi

 సందేహం

నాకు ఈ మధ్యే పెళ్లయింది. నేను కేరీర్‌ ఓరియెంటెడ్‌. కెరీర్‌ పరంగా ఎంతోకొంత ఎచీవ్‌ చేశాకే పిల్లలు అనుకుంటున్నాను. నా హజ్బెండ్‌ కూడా ఒప్పుకున్నాడు. ఫ్రోజెన్‌ ఎగ్‌ మెథడ్‌ చాలా వినపడుతోంది కదా.. అది ఫాలో అవ్వొచ్చా? అలా దాచుకున్న ఎగ్స్‌ వల్ల పిల్లలు ఆరోగ్యంగానే పుడతారా? ప్లీజ్‌ ఎక్స్‌ప్లెయిన్‌ చేయండి మేడం..– అశ్విని, బెంగళూరు

అశ్విని నీ వయసు ఎంతో రాయలేదు. సాధారణంగా అయితే గరిష్టంగా 32, 33 సంవత్సరాల వరకు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి అండాల సంఖ్య వాటి నాణ్యత చాలా వరకు బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. 34, 35 సంవత్సరాలు దాటే కొద్దీ అండాల సంఖ్య, వాటి నాణ్యత క్రమంగా తగ్గుతూ రావడం వల్ల, ఈ సమయంలో గర్భం కోసం ప్రయత్నం చేసినప్పుడు గర్భం వచ్చే అవకాశాలు తగ్గడం, వచ్చినా జన్యుపరమైన లోపాల వల్ల అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం, బిడ్డలో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నీకు నీ కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి ఇంతకంటే ఎక్కువ సమయం పడుతుందనుకుంటే, నీ అండాలను ముందుగానే ఎగ్‌ ఫ్రోజన్‌ మెథడ్‌ ద్వారా దాచుకొని, గర్భానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు.

ఈ లోపల మీవారి వయసు కూడా పెరిగే కొద్దీ ఆయనకు కూడా వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు, అండాలను ఫ్రీజ్‌ చేసి భద్రపరుచుకునే బదులు, ఐవీఎఫ్‌ పద్ధతి ద్వారా అండాల్లోకి వీర్యకణాలను పంపి, ఫలదీకరణ జరిపి, తద్వారా తయారైన పిండాలను ఫ్రీజ్‌ చేసి భద్రపరుచుకోవడం మంచిది. అండాలను ఫ్రీజ్‌ చేయడం అంటే oocyte cryopreservation పద్ధతి. ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం చెందుతుంది. ఈ పద్ధతిలో పీరియడ్స్‌ వచ్చిన రెండో రోజు నుంచి అనేక అండాలు తయారు కావడానికి హెచ్‌ఎమ్‌జీ, ఎఫ్‌ఎస్‌హెచ్‌ వంటి హార్మోన్‌ ఇంజెక్షన్‌లను ఎక్కువ మోతాదులో 8–10 రోజులపైన ఇవ్వడం జరుగుతుంది. అండాల పరిమాణం 18–20 మి.మీ. పెరిగిన తర్వాత వాటిని వెజైనా (యోని భాగం) నుంచి స్కానింగ్‌లో చూస్తూ బయటకు తీయడం జరుగుతుంది.

అలా తీసిన అండాల్లో మంచి అండాలను (మంచి నాణ్యత) విట్రిఫికేషన్‌ పద్ధతి ద్వారా అతి తక్కువ ఉష్ణోగ్రతలో ఫ్రీజ్‌ చేసి నైట్రోజన్‌ లిక్విడ్‌లో భద్రపరచడం జరుగుతుంది. వీటిని 10 సంవత్సరాలపైన నిల్వ చేయవచ్చు. వీటిని ఏ వయసులో బయటకు తీయడం జరిగిందో కొన్ని సంవత్సరాల తర్వాత వాటిని వాడేటప్పుడు వాటి వయసు అలానే ఉంటుంది. కొన్ని సంవత్సరాల గర్భం కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఫ్రీజ్‌ చేసిన అండాలను థాయింగ్‌ పద్ధతి ద్వారా సాధారణ పరిస్థితికి తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని అండాలు పాడయిపోవడం వల్ల 10 శాతం అండాలు నాణ్యత కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 90 శాతం అండాలు బాగానే ఉండవచ్చు. ఈ అండాల్లోకి వీర్యకణాలను ఐసీఎస్‌ఐ పద్ధతి ద్వారా ప్రవేశపెట్టి ఫలదీకరణ చేయడం జరుగుతుంది. వాటిని 3–5 రోజులు ఇంక్యుబేటర్‌లో పెట్టిన తర్వాత, ఎన్ని పిండాలు ఏర్పడ్డాయి, వాటి నాణ్యత ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అలా ఏర్పడిన అండాలను, అప్పటికే ఉన్న మహిళ గర్భాశయంలోకి సన్న కె«థడర్‌ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది. మహిళ గర్భాశయంలోని ఎండోమెట్రియమ్‌ పొర మందం సరిగా ఉండి, దానికి రక్తప్రసరణ సరిగా ఉండి, హార్మోన్స్‌ పనితీరు సరిపడా ఉండి, గర్భాశయంలోకి అండాలు సరిగా హత్తుకుంటే, అప్పుడు గర్భం నిలుస్తుంది.

వీటిలో ఏ ప్రక్రియ సరిగా లేకపోయినా గర్భాశయం పిండాలను స్వీకరించదు. అప్పుడు గర్భం నిలబడకుండా పీరియడ్‌ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు చేసిన పరిశోధనల్లో ఫ్రోజెన్‌ ఎగ్‌ మెథడ్‌ ద్వారా పుట్టిన పిల్లలు, మామూలుగా పుట్టిన పిల్లలు లేదా సాధారణ వయసులో ఐవీఎఫ్‌ పద్ధతి ద్వారా పుట్టిన పిల్లల లాగానే ఉంటారని, కాంప్లికేషన్స్‌ కూడా వారిలో లాగానే ఉంటాయని తేల్చడం జరిగింది. కాకపోతే తల్లి వయసు 35–40 సంవత్సరాలు దాటే కొద్దీ తల్లిలో బీపీ, షుగర్‌ వంటి ఇతర మెడికల్‌ కాంప్లికేషన్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఫ్రోజెన్‌ ఎగ్‌ మెథడ్‌ వల్ల ప్రెగ్నెన్సీ కచ్చితంగా వస్తుందని కాని, సమస్యలు ఏమీ ఉండవు అని కాని చెప్పడం కష్టం. ఈ పద్ధతిని మొదట్లో చిన్న వయసులో క్యాన్సర్‌ వచ్చి వాటికి చికిత్స తీసుకొనే వాళ్లకోసం, దీర్ఘకాల మెడికల్‌ సమస్యలు ఉండి, వాటి చికిత్స తీసుకొనే సమయంలో అండాల నాణ్యత తగ్గిపోకుండా ఉండటాని కనుగొనడం, వాడటం జరిగింది. క్రమేణా దీనిని మీకు లాగా పిల్లలు ఇప్పుడే వద్దనుకొని కెరియర్‌ ఓరియెంటెడ్‌గా ఉన్నవాళ్లు, పెళ్లి వాయిదా వేసేవాళ్లు, తగిన పార్టనర్‌ దొరకని వాళ్లు. వాడటం మొదలు పెట్టారు.

ఈ కారణాల కోసం అండాలను క్రయోప్రిజర్వ్‌ చేయడాన్ని social freezing  అంటారు. ఈ ఆధునిక కాలంలో టెక్నాలజీ ఉంది కదా అని, అదో ఫ్యాన్సీలాగా వాడేసుకోవడం మంచిది కాదు. అది ఎంతవరకు అవసరమో అంత వరకే వాడుకోవాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. కెరియర్‌ అని, ఇంకా అనేక కారణాల వల్ల లేటు వయసులో పిల్లలను కనడం వల్ల, వారిని పెంచి, చదివించి పెద్ద చేసే వరకు, మీ వయసు పెరిగి, మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఒకసారి ఆలోచించి చూసి తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది. కొద్దిగా ఓపికతోని, సరైన సమయంలో పిల్లలు కని, (పెద్దవాళ్ల సహాయ సహకారంతో) కష్టపడి కెరియర్‌ కూడా చూసుకుంటూ ఎన్నో సాధించిన మహిళలు కూడా ఉన్నారు. కాబట్టి నువ్వు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి వెజైనల్‌ స్కానింగ్‌ చేయించుకొని, అందులో అండాశయం పరిమాణం, అందులో అండాల సంఖ్య ఎలా ఉంది తెలుసుకొని, హార్మోన్స్‌ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఎఎమ్‌హెచ్‌ వంటి రక్త పరీక్షలు చేయించుకొని తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది.
-డా.వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు