మూడు రోజుల్లో అయిదుసార్లు ఫిట్స్

27 Sep, 2020 07:12 IST|Sakshi

సందేహం 

మా పాపకు పన్నెండేళ్లు.  మూడు వారాల కిందట  మెచ్యూర్‌ అయింది. అయితే ఆ మూడు రోజుల్లో అయిదుసార్లు ఫిట్స్‌ వచ్చాయి అమ్మాయికి. అంతకు ముందెన్నడూ లేదు. ఈఈజీ తీస్తే కూడా నార్మలే వచ్చింది. ఎపిలెప్సీ అంటున్నారు. ఎపిలెప్సీ ఏ వయసులో అయినా బయటపడొచ్చా? పుట్టుకతో ఉండదా? మాది మేనరికం. దానివల్లేమైనా మా పాపకు ఈ సమస్య వచ్చిందంటారా? జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందా? భవిష్యత్‌లో మా పాప పెళ్లి, పిల్లలతో నార్మల్‌ లైఫ్‌ లీడ్‌ చేయొచ్చా.. దయచేసి చెప్పగలరు.
– పి.లత, బళ్లారి

పీరియడ్స్‌ సమయంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కొంతమందిలో ఫిట్స్‌ రావచ్చు. దీనిని ఛ్చ్టి్చఝ్ఛnజ్చీ∙్ఛpజీ ్ఛpటy అంటారు. పీరియడ్స్‌ సమయంలో ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ తగ్గడం వల్ల మెదడులో కొన్ని నాడులు ఉత్తేజం చెంది, ఫిట్స్‌ రావచ్చు. కొందరిలో పీరియడ్స్‌ మొదలైన 14 రోజులకు, అండం విడుదలయ్యే సమయంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఎక్కువగా విడుదలవ్వడం వల్ల ఈ సమయంలో ఫిట్స్‌ రావచ్చు. ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎపిలెప్సీ వస్తుందో చెప్పడం కష్టం. ఒక్కొక్కరిలో అనేక కారణాల వల్ల రావచ్చు. ఒకసారి మీ పాపకు న్యూరోఫిజీషియన్‌ను సంప్రదించి అవసరమైన ఎంఆర్‌ఐ స్కాన్, ఇతర రక్త పరీక్షలు చేయ్యించుకొని, ఫిట్స్‌ రావడానికి కల కారణాలు అంటే మెదడులో కంతులు, రక్తంలో షుగర్‌ లెవల్స్‌ తక్కువ ఉండటం, ఇన్‌ఫెక్షన్‌లు, ఒత్తిడి వంటివి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని దానిని బట్టి యాంటీ ఎపిలెప్టిక్‌ మందులతో పాటు, ఇతర చికిత్సా విధానాలను సూచిస్తారు.

అవసరమైతే పీరియడ్స్‌ సమయంలో ఫిట్స్‌ మందుల మోతాదును పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఎపిలెప్సీ మేనరికం వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చింది అనేది చెప్పడం కష్టం. మందులు జీవితాంతం వాడాలా, మూడు, నాలుగు సంవత్సరాలు వాడి ఆపవచ్చా అనేది, పరీక్షలు రిపోర్ట్‌లను బట్టి మందులు వాడినా, మళ్లీ ఫిట్స్‌ వస్తున్నాయా అనేదాన్ని బట్టి న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ నిర్ణయిస్తారు. మందులు సరిగా వాడుతూ డాక్టర్‌ పర్యవేక్షణలో ఉంటే పెళ్లి, పిల్లలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. మామూలు వాళ్లతో పోలిస్తే, వీరికి ఎక్కువ జాగ్రత్తలు, చెకప్‌లు అవసరం ఉంటుంది.

మేడం.. నాకు 48 ఏళ్లు. బహిష్టు ఆగిపోయి రెండేడేళ్లయింది. కాని నెల రోజులుగా వైట్‌ డిశ్చార్జ్‌ అవుతోంది. దురద కాని, మంట కాని ఏమీలేదు. కాని చాలా చిరాగ్గా, నీరసంగా ఉంటోంది. క్యాన్సరేమోనని భయంగా ఉంది. పరీక్ష చేయించుకోవడం అవసరమంటారా? గైనకాలజిస్ట్‌కి చూపించుకోవాలా? క్యాన్సర్‌ స్పెషలిస్ట్‌ను సంప్రదించాలా?
– గరిమెళ్ల సింధు, గణపవరం

పీరియడ్స్‌ ఆగిపోయిన తర్వాత ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గిపోవడం వల్ల యోనిలోని మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి ఆమ్లగుణం తగ్గిపోతుంది. దాని వల్ల యోనిలో ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చి తెల్లబట్ట ఉండవచ్చు. కొందరిలో దురద, మంట వాసనతో ఉంటుంది. మీకు అయితే ఇవి ఏవీ లేవు అంటున్నారు. కొందరిలో గర్భాశయ ముఖద్వారంలో పుండు, చిన్న పాలిప్స్, అరుదుగా క్యాన్సర్‌ వంటివి ఉన్నా నీళ్లలాగా తెల్లబట్ట అవ్వవచ్చు.

మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, వారు స్పెక్యులమ్‌ పరీక్ష ద్వారా కనిపించే సమస్యలు ఏమైనా ఉన్నాయా చూసి, అవసరమైతే ప్యాప్‌స్మియర్‌ పరీక్ష చేస్తారు. ఇందులో ఏమైనా సందేహం ఉంటే సర్వైకల్‌ బయాప్సీ చేసి క్యాన్సర్‌ ఏమైనా ఉంటే నిర్ధారణ చేస్తారు. సమస్యను బట్టి ఇన్‌ఫెక్షన్‌ ఉంటే దానికి తగ్గ యాంటీబయోటిక్, యాంటీఫంగల్‌ మందులు ఇస్తారు. అవసరమనుకుంటే ఈస్ట్రోజన్‌ క్రీమ్‌లను సూచిస్తారు. అవసరమైతే అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకొని ట్యూబ్స్‌లో వాపు, నీరు గర్భాశయంలో కంతులు వంటివి ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తుంది.

మేడం.. మా పాపకు పధ్నాలుగేళ్లు. ఆ పిల్లకు కుడివైపు బ్రెస్ట్‌ పెద్దగా, ఎడమవైపు బ్రెస్ట్‌ చిన్నగా ఉంది. ఆ తేడా చాలా స్పష్టంగా కనపడుతోంది. దాంతో చున్నీ లేకుండా బయటకు వెళ్లట్లేదు. నలుగురిలో కలవడానికీ ఇబ్బంది పడ్తోంది పాప. ఆ సమస్యతో చదువు మీదా ధ్యాస పెట్టట్లేదు. ఏం చేయాలో సూచించగలరు.  – లక్ష్మీప్రసన్న, వర్నీ

అందరిలో అన్నీ అవయవాలు సరిగా ఉండకపోవచ్చు. కొందరిలో రెండు బ్రెస్ట్‌లు ఒకే సైజులో ఉండకపోవచ్చు. అవి పెరిగే క్రమంలో అలా ఒక బ్రెస్ట్‌ పెద్దగా, రెండోది చిన్నగా కొంతమందిలో అలా ఉండిపోతాయి. కొందరిలో కొద్దిగానే తేడా ఉంటుంది. కొందరిలో బయటకు కనిపించే అంత తేడా ఉంటుంది. ఇప్పుడు రెండు సమానంగా ఉండటానికి సహజంగా ఏమి చెయ్యలేం. చిన్నగా ఉన్న రొమ్మును రోజు గుండ్రంగా మసాజ్‌ చేస్తూ ఉండటం వల్ల రక్త ప్రసరణ పెరిగి కొద్దిగా పరిమాణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వయసులో పిల్లలలో చిన్న సమస్యను కూడా పెద్దగా ఊహించుకుంటారు. మీరు మీ పాపకు ధైర్యంగా చెప్పండి ఒక్కొక్కరిలో ఉండే పెద్ద పెద్ద లోపాలు వివరించండి. వాటితో పోలిస్తే ఇది అసలు ఏమి లేదు అని మనోధైర్యాన్ని పెంపొందించండి. ప్యాడెడ్‌ బ్రాస్‌ వేసుకోవడం వల్ల చాలా వరకు ఈ తేడా బయటకు తెలియదు. మరీ తప్పదు అంటే ఒకసారి ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోండి.
-డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు