Tips To Healthy Pregnancy: ఒక ఓవరీ తీసేశారు.. పిల్లలు పుట్టే అవకాశం ఉందా?

19 Sep, 2021 11:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 ∙సందేహం

సమస్యను బట్టి చికిత్స

నా వయసు 36 ఏళ్లు. కొన్నాళ్లుగా కడుపు ఉబ్బరం, విపరీతమైన నడుము నొప్పితో పాటు బరువు కూడా తగ్గిపోయాను. డాక్టర్‌ సలహాపై పరీక్షలు జరిపించుకుంటే, ఒవేరియన్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది. ఇది పూర్తిగా నయమవుతుందా? – వరలక్ష్మి, కర్నూలు

Gynecologist Answers: అండాశయంలో వచ్చే ఒవేరియన్‌ క్యాన్సర్‌ లక్షణాలు కనిపించేటప్పటికే చాలామందిలో అది 2, 3, 4 దశలకు చేరి ఉంటుంది. మొదటి దశలో ఒవేరియన్‌ క్యాన్సర్‌లో పెద్దగా లక్షణాలేవీ కనిపించవు. మీ క్యాన్సర్‌ ఏ స్టేజిలో ఉందనే దాన్నిబట్టి పూర్తిగా నయమవుతుందా లేదా అనేది చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, క్యాన్సర్‌ ఇతర అవయవాలకు కూడా సోకినట్లు అనిపిస్తోంది. 36 సంవత్సరాలకే ఒవేరియన్‌ క్యాన్సర్‌ రావడం దురదృష్టకరం.

క్యాన్సర్‌ స్టేజిని బట్టి మొదట ఆపరేషన్‌ చేసి, క్యాన్సర్‌ గడ్డను తొలగించి, తర్వాత కీమో థెరపీ ఇవ్వాలా లేక మొదట కీమో థెరపీ ఇచ్చి, తర్వాత ఆపరేషన్‌ చేయాలా అనేది క్యాన్సర్‌ డాక్టర్‌ (ఆంకాలజిస్ట్‌) నిర్ణయిస్తారు. చికిత్స తర్వాత స్టేజిని బట్టి కొందరు కొన్ని సంవత్సరాల వరకు బాగానే ఉంటారు. కొందరిలో క్యాన్సర్‌ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చికిత్స తర్వాత డాక్టర్‌ పర్యవేక్షణలో క్రమంగా స్కానింగ్, రక్తపరీక్షలు వంటివి చేయించుకుంటూ, సమస్యను బట్టి చికిత్సలు తీసుకుంటూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఆనందంగా ఉండవలసి ఉంటుంది.

నా వయసు 49 ఏళ్లు. ఎత్తు 5.1 అడుగులు, బరువు 72 కిలోలు. ఇటీవల నాకు నెలసరి క్రమం తప్పి వస్తోంది. వచ్చినప్పుడల్లా బ్లీడింగ్‌ ఎక్కువగా ఉంటోంది. ఒంట్లోంచి వేడి ఆవిర్లు వచ్చినట్లుగా అవుతోంది. రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – సుమతి, కోదాడ

ఆడవారిలో చాలావరకు 45 సంవత్సరాల నుంచి అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ మెల్లగా తగ్గిపోవడం మొదలవుతుంది. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్‌ సక్రమంగా రాకుండా, కొన్ని నెలలూ రాకుండా ఉండి అయినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్‌ అవడం, కొందరిలో నెలకు రెండుసార్లు అవడం, లేకపోతే బ్లీడింగ్‌ కొద్దిగానే అవడం వంటి సమస్యలు ఏర్పడి, తర్వాత కొంతకాలానికి పీరియడ్స్‌ ఆగిపోయి మెనోపాజ్‌ దశకు చేరుకుంటారు. ఈ సమయంలో ఈస్ట్రోజన్‌ లోపం వల్ల ఒళ్లు వేడిగా జ్వరం వచ్చినట్లుగా ఉండి, వేడి ఆవిర్లులాగ వచ్చి అంతలోనే చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. వీటినే ‘హాట్‌ ఫ్లషెస్‌’ అంటారు.

వీటి వల్ల నిద్ర సరిగా పట్టకపోవడం, పగలంతా నీరసంగా అనిపించడం, డిప్రెషన్‌ వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. మీ బ్లీడింగ్‌ సమస్య చాలావరకు హార్మోన్ల అసమతుల్యత వల్ల ఉండవచ్చు. అలాగని ఊరికే ఉండకూడదు. ఈ వయసులోనే గర్భాశయంలో, అండాశయంలో గడ్డలు, కంతులు, క్యాన్సర్లు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి అల్ట్రాసౌండ్‌ పెల్విస్‌ స్కానింగ్, ప్యాప్‌ స్మియర్‌ వంటి పరీక్షలు చేయించుకుని, ఏమైనా సమస్య ఉంటే దాన్నిబట్టి చికిత్స తీసుకోవచ్చు.

సమస్య ఏమీ లేకపోతే బ్లీడింగ్‌ ఎక్కువైనప్పుడు అది తగ్గడానికి మందులు వాడుకుంటూ కొంతకాలం ఓపిక పట్టవలసి ఉంటుంది. రక్తహీనత ఉంటే ఐరన్, విటమిన్‌ మాత్రలు వాడుకోవడం మంచిది. మీ ఎత్తు 5.1కి గరిష్ఠంగా 53–60 కిలోల వరకు బరువు ఉండవచ్చు. కాని, మీరు 72 కిలోలు ఉన్నారు. బరువు ఎక్కువ ఉండటం వల్ల కూడా హార్మోన్‌ సమస్యలు ఏర్పడి పీరియడ్స్‌లో బ్లీడింగ్‌ సమస్యలు ఏర్పడవచ్చు. నడక, యోగా, ధ్యానం, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు వేడి ఆవిర్ల సమస్య నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌లా పనిచేసే ఐసోఫ్లోవోన్‌ పదార్థాలు ఎక్కువగా ఉండే సోయాబీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతవరకు వేడి ఆవిర్ల సమస్య తగ్గుతుంది. ఎక్కువ సమయం గాలి ఆడే ప్రదేశాలలో, ఫ్యాన్‌ కింద ఉండటం వల్ల కూడా వేడి ఆవిర్ల నుంచి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

నాకు రెండేళ్ల కిందట పెళ్లయింది. ప్రస్తుతం నా వయసు 31ఏళ్లు. ఓవేరియన్‌ సిస్ట్‌ ఏర్పడటంతో పెళ్ళికి కొద్ది నెలల ముందు ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వచ్చింది. ఒక ఓవరీని తీసేశారు. ఇప్పటివరకు నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. నాకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయా? – సత్యవతి, భీమవరం

సాధారణంగా గర్భాశయం రెండు పక్కలా ఉండే ఒక్కొక్క అండాశయం నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లతో పాటు అండం విడుదలవుతూ ఉంటుంది. ఒకనెల ఒకవైపు అండాశయం నుంచి మరోనెల మరోవైపు అండాశయం నుంచి ప్రతినెలా అండం విడుదలవుతూ ఉంటుంది. మీకు ఒక అండాశయం తీసివేసినా, వేరే హార్మోన్ల సమస్యలేవీ లేకపోతే, ఉన్న ఇంకొక అండాశయం నుంచి ప్రతినెలా అండం విడుదలై, గర్భం వచ్చే అవకాశాలు బాగానే ఉంటాయి. ప్రెగ్నెన్సీ రావడానికి సరిగా అండం విడుదల కావడం, ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ మూసుకుపోకుండా తెరుచుకుని ఉండటం, భర్తలో వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత సరిగా ఉండటం అవసరం.

మీకు పెళ్లయి రెండు సంవత్సరాలు అయినా గర్భం రావట్లేదు, వయసు కూడా 31. కాబట్టి, మీకు నెలసరి సరిగా వస్తుంటే, పీరియడ్‌ మొదలైన మొదటి రోజు నుంచి లెక్కబెట్టి 11వ రోజు నుంచి 16వ రోజు లోపల అండం విడుదల ఏ రోజుల్లో అవుతుంది, అసలు అండం పెరుగుతుందా లేదా తెలుసుకోవడానికి ఫాలిక్యులర్‌ స్టడీ స్కానింగ్‌ చేయించుకోవాలి. అలాగే గర్భాశయం లోపలి ఎండోమెట్రియాసిస్‌ పొర సరిగా పెరుగుతుందా లేదా అని స్కానింగ్‌లో తెలుసుకోవాలి. అండాశయం ఉన్నవైపు ఉన్న ఫెలోపియన్‌ ట్యూబ్‌ తెరుచుకుని ఉందా లేదా తెలుసుకోవడానికి హెచ్‌ఎస్‌జీ అనే ఎక్స్‌రే తీసుకోవాలి.

రక్తంలో హార్మోన్‌ సమస్యలు, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి సీబీపీ, ఈఎస్‌ఆర్, ఆర్‌బీఎస్, ఎస్‌ఆర్‌.టీఎస్‌హెచ్, ఎస్‌ఆర్‌.ప్రోలాక్టిన్‌ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిది. అలాగే మీ భర్తకు వీర్యకణాల పరీక్ష చేయించి, ఆయనకు వీర్యకణాలు సరిగా ఉన్నాయా, లేదా నిర్ధారణ చేసుకోవాలి. ఈ పరీక్షలలో సమస్య ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి. సమస్యను బట్టి చికిత్స తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి అధైర్యపడకుండా, గైనకాలజిస్టును సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స తీసుకుంటే పిల్లలు పుట్టే అవకాశాలు తప్పకుండా ఉంటాయి.
-డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌.

చదవండి: Beauty Tips In Telugu: నల్లని కురులకు.. బ్లాక్‌ జీరా ప్యాక్‌!

మరిన్ని వార్తలు