విజయ సోపానాలు

16 Aug, 2021 00:48 IST|Sakshi

మంచి మాట

మానసాన్ని, శరీరాన్ని సరైన గమ్యం వైపు నడిపించడమే ఏకాగ్రత. నిశ్చయమైన, నిశ్చలమైన బుద్ధి దీనికి తోడ్పాటును అందిస్తుంది. ఏ విషయం మీదనైనా ఏకాగ్రత కుదిరినప్పుడే అద్వితీయమైన విజయాలను సొంతం చేసుకోవచ్చునని చరిత్ర సాక్షిగా మనకు తెలుస్తుంది. ధనార్జనలోనైనా, కార్యసాధనలోనైనా, చేయదలచిన ఏ కార్యంలోనైనా, ఏకాగ్రతాశక్తి ఎంత అధికంగా ఉంటుందో ఆ కార్యం అంత చక్కగా జరిగి, విజయం సిద్ధిస్తుంది.

ఒకే రకమైన అర్హతలూ, తెలివి తేటలూ ఉన్నా, విజయలక్ష్మిని సొంతం చేసుకునే వారు మాత్రం కొందరే ఉంటారు. దానికి కారణం వారి వ్యక్తిత్వంలోని విశిష్టశైలి, ప్రవర్తనలోని ప్రత్యేకమైన సుగుణాలు. విజేతలు తమ విజయానికి సోపానాలుగా మలచుకునే కొన్ని అరుదైన లక్షణాలను తమ వ్యక్తిత్వానికి అలకరణలుగా నిలుపుకుని ఉద్యమిస్తూ ఉంటారు. తాను విజేతను కావాలని కలలుగనేవారు ముందుగా సాధించబూనిన కార్యానికి సంబంధించిన అంశాన్ని జీవనధ్యేయం గా మలచుకోవాలి. ఆ భావాన్నే శ్వాసగా, ధ్యాసగా నిలుపుకుని ముందుకు సాగాలి. తన శరీరంలోని మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతి అంగమూ మహత్తరమైన ఆ భావంతో తాదాత్మ్యం చెందాలి. తామర తంపరగా మనల్ని చుట్టుముట్టే మిగిలిన భావాలకు సంబంధించిన ఆలోచనలను పక్కకు నెట్టేయాలి. కార్యాన్ని ఏ విధంగా సాధించ దలచుకున్నారో దానికి సంబంధించిన నిర్దిష్టమైన ఆలోచనతో పురోగమించాలి. ఆలోచనే ఏ మనిషినైనా కార్యాన్ముఖుని చేయగల గొప్ప శక్తి. ఇది విజయానికి ప్రథమ సోపానం.

విజేతగా నిలవాలని భావించే వ్యక్తి పట్టించుకోకూడనివి, పయనించే మార్గంలో వారికి ఎదురయ్యే అపజయాలు. విజయసాధనలో అత్యంత ముఖ్యమైనది అపజయాలను లెక్కచేయకుండా, ముందుకు సాగడమే. అపజయాలు మనకు అపకారాలు చేయవు. మనకున్న అవకరాలూ కావు. అవి విజయానికి సాధకుని మరింతగా సన్నద్ధం చేసే గొప్ప అలంకారాలు. స్వల్పమైన అపజయం కలుగ గానే రకరకాల ఆలోచనలు, ముఖ్యంగా ప్రతికూల వాతావరణాన్ని సృష్టించే తలపులు మదిలో ముసురుకుని దాడి చేస్తాయి. అప్పుడే, దృఢమైన చిత్తంతో, సంకల్పబలంతో ముందడుగు వేయాలి. స్వామి వివేకానంద చెప్పినట్లుగా ‘‘సాగరంలోని కెరటం కింద పడేది, మరింత ఉధృతమైన శక్తితో పైకి లేవడానికే’’ అన్న వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని అచంచలమైన విశ్వాసంతో పురోగమించాలి.

విజయసాధనలో మనిషికి బలవత్తరంగా ఉపకరించే మరొక అపురూపమైన సోపానం ఏకాగ్రత. ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని సాధించాలన్నా, ఎంతటి ఉన్నతమైన విజయాన్ని అందుకోవాలన్నా మనిషికి ఆధారంగా నిలిచేది ఏకాగ్రతే.  ఒకరకంగా చెప్పాలంటే విజయసాధన అనే తాళాన్ని తెరిచే తాళపుచెవి ఏకాగ్రత అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. సాధకులు తమలోని సంకల్పబలాన్ని, ఆలోచనను, తమలో ఉన్న చైతన్యాన్ని అంతటినీ జాగృతం చేసి, ఒకేచోట కేంద్రీకృతం చేయడమే ఏకాగ్రత అయితే, మనసు ను ఏకైక విషయం మీద దృష్టిని నిలిపేలా చేయడం ఏకాగ్రతా సిద్ధి. ఏ కార్యంలోనైనా ఏకాగ్రత సాధిస్తే, విజయ శిఖరాన్ని చేరడం ఖాయం.

విజయసాధకులకు పెట్టని ఆభరణంలా ఉండే శుభలక్షణం ఆత్మవిశ్వాసం. ఈ విషయాన్ని మణిపూసల వంటి సమాజ సేవకులను, క్రీడాకారులను చూసినప్పుడు మనం స్పష్టంగా గమనించవచ్చు. సమాజ సేవకులను ఉదాహరణగా తీసుకుంటే, వారికి దారిలో  కలిగే ప్రతిబంధకాలు అనేకం. ముఖ్యంగా వారు తీసుకు రాదలచినమార్పును అంగీకరించని వ్యక్తుల నుంచి వచ్చే సహాయ నిరాకరణ వంటి అంశాలు ఎప్పుడూ ఈ సేవా దృక్పథం కలిగినవారి మదిలోనే ఉండవు. సమాజహితం కోరి తాము చేయదలచిన కార్యం మాత్రమే వారి మనోయవనిక మీద మనోరమ్యంగా రెపరెపలాడుతూ ఉంటుంది. మనిషికున్న ఆత్మవిశ్వాసమే భౌతికబలాన్ని మించిన నిజమైన బలం. భౌతిక శక్తిని, మానసిక యుక్తిని సమన్వితం చేయడమే మనిషిలో విశ్వాసాన్ని పాదుకొల్పుతుంది.

క్రీడాకారులు ఆత్మవిశ్వాసం ప్రకటించడంలో ఎప్పుడూ ఉన్నతస్థానంలోనే ఉంటారు. వారు ఆడే ఆటలోఅంతకుముందు ఉన్న ప్రమాణాలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ, కొత్తప్రమాణాలను నెలకొల్పుతూ ముందుకు సాగడం మనకు ఎన్నో సందర్భాల్లో దీప్తివంతంగా కనబడుతూనే ఉంటుంది. టోక్యో ఒలింపిక్స్‌ లో భారత క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా సాధించిన స్వర్ణపతకమే దీనికి చక్కని ఉదాహరణ. వందేళ్లకు పైబడి ఏ భారతీయ అథ్లెట్‌ సాధించని అద్వితీయ విజయం ఈ ఒలింపిక్స్‌ క్రీడల్లో నీరజ్‌ సొంతమయ్యింది.

అదే విధంగా అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మీరాబాయి చాను ఈ ఒలింపిక్స్‌ క్రీడల్లోనే వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సాధించింది. ఈశాన్యభారత రాష్ట్రమైన మణిపూర్‌ కు చెందిన మీరాబాయి పేదరికాన్ని జయించి, అప్రతిహతమైన పట్టుదలతో విజేతగా నిలిచింది. విజేతలు గుర్తుంచుకోవలసిన లక్షణాలను నిండుగా కలిగిన తెలుగమ్మాయి సింధు మరొక చక్కని ఉదాహరణ. వీరి విజయాలకు మిగిలిన కారణాలు ఎన్నైనా ఉండవచ్చు, ప్రధాన కారణం మాత్రం మొక్కవోని పట్టుదలను ప్రదర్శిస్తూ ‘‘నేను సాధించగలను’’ అని త్రికరణశుద్ధిగా నమ్మిన వారి ఆత్మవిశ్వాసమే అని చెప్పకతస్పదు. విజయ సాధనలో వినయశీలతకూ ప్రధాన భూమికే ఉంది. అహంకరించినవాడు ఎంత శక్తివంతుడైనా, అతి స్వల్ప కాలంలోనే మట్టికరచిన దాఖలాలు మనకు చరిత్రలో ఎక్కువగానే కనబడతాయి. ఉత్తమంగా భాసించే పైన పేర్కొన్న లక్షణాలను సదా దృష్టిలో నిలుపుకుంటే, అవి  సాధకునికి మార్గమధ్యంలో ఎదురయ్యే అవరోధపు కవాటాలను దాటించి, విజయ బావుటాను ఖచ్చితంగా ఎగురవేయిస్తాయి.
– ‘వ్యాఖ్యాన విశారద’ వెంకట్‌ గరికపాటి

మరిన్ని వార్తలు