వ్యాపారంతో కోలాటం

3 Jul, 2021 03:07 IST|Sakshi

దేశాల ఆర్థిక వ్యవస్థ  పటిష్టంగా ఉండాలంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. గొంగళిపురుగు అందమైన సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్లు స్టార్టప్‌లు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పట్టుకొమ్మలు యువతలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి, సరైన చోట పెట్టుబడి పెట్టాలి... అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది... పెట్టుబడి పెట్టిన వారు కూడా పెరగటానికి అవకాశం  ఉంటుంది... ఇలా అనటమే కాదు.. ఆచరణలోనూ చూపారు హైదరాబాద్‌కు చెందిన వాణి కోలా...

అమెరికా నుంచి...
మింత్ర, మెడ్‌ప్లస్‌ వంటి ఎన్నో వ్యాపార సంస్థలకు ఆమె పెట్టుబడులు సమకూర్చారు. అనతి కాలంలోనే అవి ‘ఇంతింతై’ అన్నట్లు చకచకా ఎదిగాయి. ప్రఖ్యాత సంస్థలలో ఆమె పెట్టుబడులు పెట్టి, ఆ సంస్థలతో పాటు వాణి కోలా కూడా ఎదిగారు. ఇరవై రెండు సంవత్సరాల పాటు అమెరికాలో ఉన్న వాణి కోలా 2005 లో భారతదేశానికి తిరిగి వచ్చారు. పనులలో రిస్క్‌ తీసుకోవటం ఆమెకు ఇష్టం. ‘విశ్రాంతిగా గడపడానికి ఏదో విహార స్థలానికి వెళ్ళడం కంటే భారత దేశంలో గడపడమే నాకు ఇష్టం’ అంటారు వాణి కోలా. ఈ ఆలోచనే వాణి కోలా విజయానికి బాట వేసింది. ఆర్థిక సరళీకరణ వల్ల భారతదేశంలో వచ్చిన మార్పులు వాణిని ఆకర్షించాయి. కలారీ క్యాపిటల్‌ సంస్థను స్థాపించి, స్టార్టప్స్‌కు ఫండింగ్‌ చేయటం ప్రారంభించారు. ఇలా చేయటంలో తనకు చాలా ఆనందం కలుగుతుందంటారు వాణి కోలా.

మింత్ర, స్నాప్‌డీల్, ఫాంటసీ స్పోర్ట్స్, కంపెనీ డ్రీమ్‌ – 11తో పాటు, మెడ్‌ ప్లస్, జివామే వంటి ఫార్మస్యుటికల్‌ చైన్‌లకు కూడా ఫండింగ్‌ చేశారు. 2011లో ప్రారంభమైన కలారీ క్యాపిటల్‌ ఇంతవరకూ 92 వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టింది. వాణి చేస్తున్న ప్రయత్నం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దృష్టిలో పడింది. కలారీ పరిధిలో ఉన్న జివామె, అర్బన్‌ ల్యాడర్‌ వంటి అనేక కంపెనీలను సొంతం చేసుకుంది. అక్కడితో ఆగకుండా కలారీలో 200 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఈ అంశాన్ని వాణి స్వయంగా ఒక ఇ–మెయిల్‌ ద్వారా తెలియజేశారు. సిలికాన్‌ వ్యాలీలో రెండు విజయవంతమైన టెక్నాలజీ కంపెనీలకు ఫౌండర్‌ సిఇఓ అయిన వాణి గెలుపుకి, విజయపథంలో దూసుకుపోవటానికి కారణం... కంపెనీలను రూపొందించడం పైనే తన దృష్టిని కేంద్రీకరించటం, ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పారిశ్రామికవేత్తలను గుర్తించడం.

పురుషులు అసూయ చెందారు...
హైదరాబాద్‌కు చెందిన వాణీ కోలా... అరిజోనా స్టేట్‌ యూనివర్శిటీ నుంచి 1980లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం కాలిఫోర్నియా వచ్చి, అక్కడ టెక్నాలజీలో వచ్చిన విప్లవాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. తన కంపెనీని 657 మిలియన్‌ డాలర్లకు విక్రయించారు. 2001లో సెర్టస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రారంభించారు. ఇన్ని విజయాలు సాధించటానికి ముందు వాణీ కోలా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. ఒక మహిళ ఇన్ని విజయాలను సాధించటం నచ్చని పురుష వాణిజ్యవేత్తలు ఆమెను ఎగతాళి చేశారు. విమానాశ్రయంలో కలిసిన ఓ వ్యాపారవేత్త ‘ఏడాది కంటే తక్కువ వయసున్న బిడ్డను ఇంట్లో వదిలేసి, వ్యాపారం కోసం ఇలా తిరగటం మీకు సిగ్గుగా లేదా’ అని వెటకారమాడాడు. ‘ఇలాంటి పరిస్థితులు ఆడవారికేనా.. మగవారికి మాత్రం ఉండవా. మీ ఇంట్లో ఉండే చంటి పిల్లాడిని మీరు మాత్రం వదిలేసి రావట్లేదా’ అంటూ ఎదురు ప్రశ్నించారు వాణీ కోలా.

మరిన్ని వార్తలు