పోరు జెండా: మల్లు స్వరాజ్యం

20 Mar, 2022 00:24 IST|Sakshi

(1931–2022)

మల్లు స్వరాజ్యం... పోరాటానికి పర్యాయ పదం భూమికోసం.. భుక్తికోసం... పేద ప్రజల విముక్తికోసం సొంత జీవితాన్ని వదిలిపెట్టిన స్ఫూర్తి చరిత పట్టుకుంటే పదివేల బహుమానమన్న నిజాం సర్కార్‌పై బరిగీసి ఎక్కు పెట్టిన బందూక్‌   చావుకు వెరవని గెరిల్లా యోధురాలు   అసెంబ్లీలో ఆమె మాట తూటా పదవి లేకపోయినా ప్రజా సమస్యలే ఎజెండా ఆమె పోరాటాల ఎర్రజెండా..

అన్నం పెట్టి... ఆలోచన మార్చుకుని..
బాల్యంలో ఓ ఘటన మల్లు స్వరాజ్యం ఆలోచనను మార్చేసింది. అప్పట్లో వడ్లను కూలోల్లే దంచేటోళ్లు. ముఖ్యంగా ఆడవాళ్లు. పుట్లకొద్ది దంచినా కూలీ ఉండదు. రోజుల తరబడి పని జరిగేది. అలా దంచుతున్న ఎల్లమ్మ అనే కూలీ కళ్లు తిరిగి పడిపోయింది. అక్కడే కాపలాగా ఉన్న స్వరాజ్యం నీళ్లు తీస్కపోయి తాగించారు. అన్నం తినలేదని చెబితే.. అన్నం తీసుకొచ్చి తినిపించారు. మిగిలిన కూలీలు తినలేదంటే...  చూస్తే అన్నం లేదు.

బియ్యం నానబెట్టుకుని తింటామంటే వాళ్లకు సాయం చేశారు. అట్లా సాయపడ్డందుకు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. స్వరాజ్యం చిన్నాయనలు తప్పుబట్టి తిట్టిండ్రు. అప్పుడు వాళ్లమ్మ చొక్కమ్మ అండగా నిలబడ్డది. ‘చిన్న పిల్ల ఏమనకండి’ అని వెనకేసుకొచ్చింది. కష్టం చేసే వ్యక్తికి తినే హక్కెందుకు లేదోనన్న ఆలోచన ఆనాడే స్వరాజ్యం మనసులో అంకురించింది. అక్కడినుంచే ఆమె తిరుగుబాటు నేర్చుకున్నారు.

మనుసులో ముద్రించుకుపోయిన ‘అమ్మ’
స్వరాజ్యంపై వాళ్లమ్మ చొక్కమ్మ ప్రభావం ఎక్కువ. బిడ్డను రాణీరుద్రమలా పెంచాలి అనుకునేవారామె. స్వరాజ్యం ఎనిమిదో ఏట తండ్రి మరణించాడు. అప్పటికే అన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్‌)ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ఆయన ప్రోత్సాహంతో బాలల సంఘం పెట్టారు స్వరాజ్యం. అన్న తెచ్చిచ్చిన మాక్సీం గోర్కీ ‘అమ్మ’ పుస్తకాన్ని వాళ్లమ్మతో కలిసి చదివారు.

రాత్రి దాలిలో పాలు కాగబెట్టి.. తోడెయ్యడం కోసం వాటిని ఆరబెట్టినప్పుడు కూర్చుని చదివిన ఆ పుస్తకంలోని అక్షరం అక్షరం ఆమె మనసులో ముద్రించుకుపోయింది. ఆ పుస్తకంలోని అమ్మ పాత్ర వాళ్లమ్మను, ఆమెను ప్రభావితం చేసింది. అందుకే బీఎన్‌ని సాషా అని పిలుచుకునేవారామె. కొడుకుతోపాటు కూతురు స్వరాజ్యం పోరాటంలోకి వెళ్తానంటే అడ్డుపడలేదు సరికదా... ప్రోత్సహించి ఉద్యమాల్లోకి పంపించిందా అమ్మ. తన 11వ ఏట గెరిల్లా యుద్ధంలో శిక్షణ, ఆత్మరక్షణా పద్ధతులు నేర్చుకున్నారు. 12 ఏళ్ల వయసులోనే ఆంధ్రమహాసభలో చేరారామె. ఆ తరువాత వారిల్లు ఆంధ్ర మహాసభకు కేంద్రమయ్యింది.  

కూలీరేట్ల పెంపు... పెద్ద మలుపు..
తెలంగాణలో వెట్టిచాకిరీ, భూస్వాముల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కూలీ పెంచాలని ఉద్యమం మొదలైంది. తమది దొరల కుటుం» మే అయినా... ఊళ్లో ఉన్న జీతగాళ్లు, కూలోళ్లందరినీ కూడగట్టి సమ్మె చేద్దామని ప్లాన్‌. అప్పటికే పోలీస్‌ పటేల్‌ అయిన స్వరాజ్యం చిన్నాయన తుంగతుర్తి పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో బీఎన్‌ని అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారు. తల్లి పోలీసులను దర్వాజ కాడనే అడ్డుకుంటే... అన్నను ఊరుదాటించారు స్వరాజ్యం. ఆయన వెళ్తూ ‘నేను పోతున్న... సమ్మె జరిగేట్టు చూడాలె’ అంటూ బాధ్యతను పెట్టాడు. తెల్లారి వాడలన్ని తిరిగి పనికి పోవద్దని చెప్పారామె.

అయినా వినలేదు... తన చిన్నాన్న పనిలోకే పోతున్నరని తెలిసి, వాగులో వాళ్లకడ్డం పడుకున్నది. ‘మీరు కూలికి పోవాలంటే.. నన్ను దాటుకుపోండి’ అని పట్టుబట్టారామె. భూస్వాముల పిల్ల కనుక ఆమెను దాటి వెళ్లలేకపోయారు. ఆరోజుకు వెనుదిరిగిండ్రు. మరునాడు పనిలోకి రానందుకు వాళ్ల చిన్నాయన కూలోళ్లను పిలిచి పంచాయతీపెట్టిండ్రు. అది తెలిసిన స్వరాజ్యం.. ‘దెబ్బ నామీద పడ్డంకనే వాళ్ల మీద పడాలి’ అంటూ బాబాయి దౌర్జన్యాన్ని అడ్డుకున్నారు. రేటు పెంచితే తప్ప పనిలోకి రాలేమన్నరు కూలీలు. అప్పటిదాకా సోలెడున్న కూలీ... మూడు సోలెలు అయ్యింది. సమ్మె జయప్రదమైంది. అది స్వరాజ్యం ఉద్యమ జీవితంలో తొలి అడుగు.  

ఆమె గొంతెత్తితే
స్వరాజ్యం... గొంతెత్తితే తెలంగాణ నేల ఊగింది ఉయ్యాల. చిన్నప్పటినుంచే ఆమెకు పాటంటే ప్రాణం. బాగా పాడుతోందని ఆంధ్రమహాసభ సమావేశాల్లో పాడించేవాళ్లు. పాలకుర్తి ఐలమ్మ పోరాటానికి మద్దతుగా సంఘం నిలబడాలనుకున్నది. పాలకుర్తిలో మీటింగ్‌ పెట్టారు. ఆ సభలో పాటలు పాడేందుకు స్వరాజ్యంను తీసుకెళ్లారు బీఎన్‌. సభ సక్సెస్‌ అయ్యింది. ఐలమ్మ పోరాటం ఫలించింది.

‘విస్నూరు దొర చేతిలో సచ్చినా సరే... భూమిని వదలను’ అని పోరు జేసిన ఐలమ్మ తనకు స్ఫూర్తి’ అని చెప్పేవారామె.. ‘ఏనాడు గడీలనొదిలి వాడల్లో జొరబడ్డానో... ఆ వాడలే నా ఉద్యమ జన్మస్థానాలు. నా ఉపన్యాసాలకు విషయాన్ని, నా పాటలకు బాణీలని, నా జీవితానికొక చరిత్రను ఇచ్చింది వాళ్లే’ అన్న స్వరాజ్యం 13 ఏళ్ల వయసులోనే విప్లవగీతమయ్యారు. విసునూరు దేశ్‌ముఖ్‌ దురాగతాలను ఎండగట్టే ఉయ్యాల పాటలను ప్రచారానికి ఆయుధంగా చేసుకుంది. 15 ఏళ్ల  వయసులో ఆమె ఉపన్యాసాలు విని జనం ఉర్రూతలూగారు.  

16 ఏళ్లకే గెరిల్లా...
భూస్వాముల దగ్గరున్న ఆయుధాల స్వాధీనంతో మొదలైన పోరు.. పోలీసు క్యాంపుల దాకా కొనసాగింది. గ్రామాల మీద దాడి చేసిన పోలీసుల దగ్గర్నుంచి ఆయుధాలు గుంజుకోవడంలో మహిళలకు శిక్షణ నిచ్చారు స్వరాజ్యం. ఆకునూరు, మాచిరెడ్డిపల్లి, సూర్యాపేట, మల్లారెడ్డిగూడెం, పోరాటాల్లో్ల కీలక పాత్ర పోషించారు స్వరాజ్యం. కడివెండి పోరాటంలో మహిళలను కూడగట్టడంలో ఆమెది ప్రధాన భూమిక.

నల్గొండ, వరంగల్‌జిల్లాల్లో  దాదాపు పదిహేను సాయుధ పోరాటాలు ఆమె నాయకత్వంలో జరిగాయి.   తాడి, ఈత చెట్లపై నిజాం సర్కార్‌పెత్తనాన్ని సవాలు చేస్తూ...  ‘గీసేవాడిదే చెట్టు.. దున్నేవాడిదే భూమి’ నినాదానికి పార్టీ పిలుపునిచ్చింది. సూర్యాపేట తాలూకాలో నిర్వహణ బాధ్యతలు స్వరాజ్యానికి అప్పగించారు. గ్రామరాజ్యాలు, గ్రామ రక్షణ మహిళా దళాలు ఏరా>్పటు చేయడం, తాళ్ల పంపకం, భూ పంపకం  సమర్థవంతంగా నిర్వహించారు స్వరాజ్యం.  

ఎన్నటికీ మరవని సంఘటన...
ఓ కోయగూడెంలో షెల్టర్‌ తీసుకున్నది దళం. ఆ ఇంట్లో బాలింత, ఆమె తల్లిద్రండులు ఉన్నారు. ఎట్ల తెలిసిందో ఏమో పోలీసులు గుడిసెను చుట్టుముట్టిన్రు. లోపలికి వస్తే స్వరాజ్యంను చూస్తారని దర్వాజ దగ్గరకెళ్లింది ఇంటి యజమాని సమ్మక్క. చంటిపిల్లను తీసుకుని స్వరాజ్యం బయటపడ్డది. కానీ ఆ కోయ స్త్రీని స్వరాజ్యం అనుకుని అరెస్టు చేసి తీసుకెళ్లారు పోలీసులు. వెంటనే వెనక్కి వచ్చి ఆ పసిబిడ్డను వెనక్కి ఇచ్చేయడానికి లేదు. రెండు మూడు రోజులు దళంతో ఉంచుకోవాల్సి వచ్చింది. పాలు సరిగ్గా దొరక్క శిశువు మరణించింది.

తాను స్వరాజ్యం కాదని పోలీసులకూ చెప్పలేదు. వారం రోజుల తరువాత నిజం తెలుసుకున్న పోలీసులు ఆమెను వదిలిపెట్టారు. ఆమె గ్రామానికి వచ్చాక వెళ్లి కలిసింది దళం. ఆ తల్లిని చూసి కన్నీల్లు పెట్టుకున్నారు స్వరాజ్యం. ‘నీ బిడ్డను ఎత్తుకునిపోయి తప్పు చేశాను. వదిలిపెట్టినా బాగుండేదేమో’ అని పశ్చాత్తాప పడ్డారు. ‘నా బిడ్డ కోసం నువ్వు ఏడుస్తున్నవు... కానీ ప్రజలకోసం నిన్ను వదులుకున్నది కదా మీ అమ్మ’ అని ఓదార్పు మాటలు పలికిందట ఆమె. ఆ ఇద్దరు తల్లుల త్యాగాన్ని నేనెప్పటికీ మరవను అని చెప్పేవారామె.  

బియ్యం బుక్కి...  
సాయుధ పోరాట విరమణ తరువాత.. 1954లో ఆమె పేరు మీద ఉన్న పదివేల రివార్డును ఎత్తివేసింది ప్రభుత్వం.  అదే ఏడు హైదరాబాద్‌లో విశాలాంధ్ర మహాసభ జరిగింది. ఏడేళ్ల అజ్ఞాతవాసం తరువాత వేదికనెక్కిన ఆమెను చూడగానే ప్రజలు చేసిన కరతాళ ధ్వనులతో ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఆమె ప్రసంగం విన్న జనం ఉర్రూతలూగారు. ఆ సభ అనంతరం మల్లు వెంకటనర్సింహారెడ్డిని వివాహం చేసుకున్నారు. భూస్వామ్య కుటుంబంనుంచి వచ్చినా... తల్లిద్రండుల నుంచి నుంచి గుంటెడు జాగ కూడా తీసుకోలేదు.

ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తిండి సరిగ్గా లేని రోజులు. ఎప్పుడూ జొన్న గటక, జొన్నరొట్టెలే అన్నట్టుగా ఉండేది.  దొరకక ఓసారి బియ్యం దొరికినయ్‌. అప్పుడు స్వరాజ్యం పచ్చి బాలింత. ఆకలైతుంటే... అవి వండి తినేసరికి ఆలస్యమైతదని పచ్చిబియ్యం బుక్కి కడుపు నింపుకొన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా... ఎంచుకున్న మార్గంలో కష్టాలుంటయి మధ్యలో కంగారు పడితే లాభం లేదని బలంగా నమ్మారామె. ఏనాడూ తన మార్గం తప్పలేదు. నిజాయితీని వీడలేదు.   

ఎమ్మెల్యేగా మాటల తూటాలు..
సాయుధ పోరాట విరమణ తరువాత... 1978లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు స్వరాజ్యం. 5వేల ఓట్ల తేడాతో విజయం సాధించారామె. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఆమె అసెంబ్లీకి వెళ్తే... బంట్రోతు లోపలికి వెళ్లనివ్వలేదు. ‘నేను ఎమ్మెల్యేను’ అని ఆమె చెప్పుకున్నా నమ్మలేదు. అంత సాదాసీదాగా అసెంబ్లీకి వెళ్లేవారామె. చట్టసభల్లో తన బాధ్యతనూ ఉద్యమంలాగే భావించారు. ఆమె సమస్యలపై స్వరాజ్యం మాట్లాడితే...అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ‘మాటలు తూటాల లెక్కన పేలుస్తున్నవ్‌... ఇది బహిరంగసభ కాదు. అసెంబ్లీ’ అన్నారు. ఒక్కసారి మైక్‌ పట్టుకున్నారంటే అంతలా ఉండేది ఆమె వాగ్ధాటి.   

పోరాటం చేయని సమస్య లేదు...  
భూదానోద్యమంలో ఇచ్చినవి, పోరాటకాలంలో కమ్యూనిస్టులు పంచిన భూములు యూనియన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్లీ ఆక్రమించుకున్నరు దొరలు. ఎమ్మెల్యేగా ఉండి తిరిగి వాటిని ప్రజలకు అప్పగించడానికి రాజీలేని పోరాటం చేశారు. 900 ఎకరాల భూమిని తిరిగి ప్రజలకు అందజేశారు. ఎమ్మెల్యే పదవీ వీడాక కూడా ఆమె పోరాట పంథాను వీడలేదు. 1993లో సంపూర్ణ మద్యనిషేధంలో ఆమెది చురుకైన పాత్ర. తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు సమానహక్కు, వరకట్న వ్యతిరేక చట్టం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళల పేరిట భూ పంపిణీ... స్వరాజ్యం పోరాటం చేయని సమస్యే లేదు.  

 గ్రామాల్లో తిరిగి పనిచేసినా.. తుపాకీ పట్టి గెరిల్లాగా ఉన్నా, అసెంబ్లీలో నిలబడినా ఎక్కడైనా, ఎప్పుడైనా ఆమెది పోరాటమే. దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది.
పోరాటాలు ఉన్నంత కాలం.. మల్లు స్వరాజ్యం పేరు ఉంటుంది.

మరిన్ని వార్తలు