ఓ దంత దేవతా! పన్ను మిస్సింగ్‌ ఇక్కడ

19 Jan, 2021 00:02 IST|Sakshi
టూత్‌ ఫెయిరీకి శాండీ రాసిన లెటర్‌ 

క్రిస్మస్‌ తాత కానుకలతో సర్‌ప్రైజ్‌ చేస్తాడు. ఈస్టర్‌ బన్నీ ఇన్నిన్ని బొమ్మలు తెచ్చిస్తుంది. పాశ్చాత్య దేశాల్లో పిల్లల కోసం..పెద్దలు సృష్టించిన ఫీల్‌ గుడ్‌ భావనలివి. అలాంటిదే మరొకటి.. టూత్‌ ఫెయిరీ. పిల్లల పాల పళ్లు ఊడిపోతే పరిహారంగా.. ధనాన్ని ఇచ్చిపోతుంది ‘టూత్‌ ఫెయిరీ’. అంటే.. దంత దేవత. కెనడాలోని ఓ స్కూల్లో పన్నూడిన పిల్లాడికి..గోల్డ్‌ కాయిన్‌ ఇచ్చి వెళ్లింది టూత్‌ ఫెయిరీ. ఆ దేవత ‘శాండీ’ అని లోకానికి తెలుసు. ఆ పిల్లాడికి పెరిగి పెద్దయ్యాక తెలుస్తుంది.

హార్ట్‌ ఐలాండ్స్‌ ఎలిమెంటరీ స్కూల్‌. ప్రిన్స్‌ జార్జ్‌ టౌన్‌. కెనడా. ఆ స్కూలు వైస్‌–ప్రిన్సిపాల్‌ శాండీ వైట్‌హెడ్‌. ప్రిన్సిపాల్‌ ఉన్నారు కానీ, వైస్‌ ప్రిన్సిపాల్‌గా శాండీనే పిల్లల చదువుల్ని, వారి లైంచ్‌ టైమ్‌ని పర్యవేక్షిస్తుంటారు. ఆ రోజు లంచ్‌ బెల్‌ మోగిన కొద్దిసేపటికి శాండీ దగ్గరకు ఒక ముఖ్యమైన వర్తమానం చేరింది. ఐదేళ్ల గవిన్‌ పాల పన్ను ఊడిపోయింది. ఊడి, ఎక్కడ పడిందో ఎవరికీ కనిపించడం లేదు. గవిన్‌ని ఆఫీస్‌ రూమ్‌కి పిలిపించలేదు శాండీ. గవిన్‌ దిగాలుగా కూర్చొని ఉన్న లంచ్‌ రూమ్‌లోకి తనే స్వయంగా వెళ్లారు. ‘ఏదీ.. నోరు తెరువు’ అన్నారు. గవిన్‌ నోరు తెరిచాడు. ఆ పలు వరుసలో ఒక పన్ను మిస్సింగ్‌! అప్పుడే ఊడిపడిపోయినట్లుగా పచ్చిగా ఉంది ఆ ఖాళీ స్థలం. 
‘‘అంతా వెతికాం మేమ్‌. గవిన్‌ పన్ను కనిపించలేదు’’ అని చెప్పారు గవిన్‌ క్లాస్‌మేట్స్‌ శాండీ చుట్టూ చేరి. 
‘ఏం చేద్దాం?’ అన్నట్లు దీర్ఘాలోచనగా ముఖం పెట్టారు కొందరు చిన్నారులు. 
‘‘గవిన్‌ పన్ను ఇక ఎప్పటికీ దొరకదా?’’ అని నిరామయంగా చూస్తున్నారు మిగతా చిన్నారులు. 
గవిన్‌ మౌనంగా ఉన్నాడు. 
‘‘ఏమాలోచిస్తున్నావ్‌ గవిన్‌?’’ అని అడిగారు శాండీ. 
‘‘మా మమ్మీ డాడీ ఏమంటారోనని..’’ అన్నాడు గవిన్‌ మెల్లిగా. వాడికి ఏడుపు రాబోతోంది. పన్నును తనే పడేసుకున్నట్లు ఫీల్‌ అవుతున్నాడు. 
‘‘ఏం కాదులే. మమ్మీ డాడీకి నేను చెప్తాను’’అన్నారు శాండీ. 
‘‘మరి.. పన్ను పోయినందుకు టూత్‌ ఫెయిరీ నాకు మనీ ఇస్తుందా?’’ అని అడిగాడు గవిన్‌. 
‘‘నిజమే. టూత్‌ ఫెయిరీ ఉంది కదా. అడుగుతాం. తప్పక ఇస్తుంది’’ అని గవిన్‌ బుగ్గ పుణికి పిల్లలందర్నీ లంచ్‌ రూమ్‌కి పంపించారు శాండీ. 
∙∙ 
గవిన్‌ పన్ను ఊడింది జనవరి 12 మధ్యాహ్నం. ఆ మధ్యాహ్నమే శాండీ ‘టూత్‌ ఫెయిరీ’కి లెటర్‌ రాసి నోటీస్‌ బోర్డులో పెట్టారు! ఆ లెటర్‌ కూడా మామూలు కాగితం మీద కాదు. స్కూల్‌ లెటర్‌హెడ్‌ మీద!! ౖటైప్‌ చేసిన ఆ లెటర్‌ కింద శాండీ తన సంతకం కూడా పెట్టారు. ఆ లెటర్‌లో ఇలా ఉంది:
‘‘డియర్‌ టూత్‌ ఫెయిరీ,
ఈరోజు గవిన్‌ లంచ్‌ చేయడం కోసం రెడీ అవుతుండగా ఆ చిన్నారి పాల పన్ను ఒకటి ఊyì పోయింది. అది క్లాస్‌ రూమ్‌లోనే ఎక్కడో పడింది కానీ, ఎంత వెతికినా ఎవరికీ కనిపించలేదు. ఎంతో సాహసోపేతమైన మా చిన్నారి టీమ్‌ మొత్తం నిర్భయంగా ఆ పన్ను కోసం గాలించింది. అయినప్పటికీ పన్ను ఎవరి కంటా పడలేదు. 
నేను సుశిక్షితురాలైన వైస్‌–ప్రిన్సిపాల్‌ని. అంతేకాదు. హాబీ డెంటిస్ట్‌ని. అభిరుచి కొద్దీ నేర్చుకున్న దంత పరిజ్ఞానం నాక్కొంత ఉంది. ఆ పరిజ్ఞానంతో మొదట నేను గవిన్‌ని నోరు తెరవమని అడిగాను. తెరిచాడు. నిజమే. ఒక పన్ను తన స్థానం నుంచి రాలిపోయింది! రాలి పడిన గుర్తుగా అక్కడ ఖాళీస్థలం కనిపించింది. ఉదయం గెవిన్‌ స్కూల్‌కి వచ్చినప్పుడు అక్కడ ఆ ఖాళీ స్థలం లేదని నిశ్చయంగా చెప్పగలను. 
కనుక దయచేసి ఓ దంత దేవతా.. ఈ లెటర్‌ ను అధికారిక పరిశీలనకు స్వీకరించి, నిజంగా పోయిన పన్నుకు ప్రామాణికమైన విలువను నిర్ణయించి ఆ విలువకు సరిపడా డబ్బును గెవిన్‌కు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. ఈ విషయమై నీకేమైనా సందేహాలు ఉంటే ఈ లెటర్‌లో పైన కనిపిస్తున్న చిరునామాకు పంపేందుకు సంకోచించనవసరం లేదు. 
సిన్సియర్‌లీ
శాండీ ఎం. వైట్‌హెడ్‌. 
పి.ఎస్‌ – నా పన్ను 2000 సంవత్సరంలో ఊడిపోయింది. ఇప్పటి వరకు నాకు అందవలసిన మొత్తం అందనేలేదు. కనుక సాధ్యమైనంత త్వరగా పంపించగలవు. నేను చెల్లించవలసిన బిల్లులు ఉన్నాయి. 
∙∙ 
వారం గడిచింది. ఇరవై ఏళ్ల క్రితం ఊడిపోయిన శాండీ పన్నుకు పరిహారం రాలేదు. వారం క్రితం ఊడిన గెవిన్‌కి మాత్రం రెండో రోజే వచ్చింది! ‘‘ఉదయాన్నే లేచి చూశాను. ఒక గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ కాయిన్‌ను తెచ్చిచ్చి, నాకు ఇవ్వమని చెప్పి వెళ్లిపోయిందట టూత్‌ ఫెయిరీ’’ అని గెవిన్‌.. మేడమ్‌ శాండీకి చెప్పాడు తొర్రి పన్ను కనిపించేలా నవ్వుతూ. శాండీ కూడా ‘గుడ్‌’ అని నవ్వారు. ఆమె రాసిన  లెటర్‌ ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌ అవుతోంది. అంతమంచి లెటర్‌ రాసిన శాండీకి, గెవిన్‌ ముఖంలో సంతోషాన్ని ఎలా తెప్పించాలో తెలియకుండా ఉంటుందా?! నెట్‌ నిండా ఆమెకు అభినందనలే అభినందనలు. ఇలాంటి టీచర్‌ ఉండాలి అని.

మరిన్ని వార్తలు