మంచి మాట: ఉన్నంతవరకూ ఉన్నతంగానే...

26 Dec, 2022 00:22 IST|Sakshi

కష్టానికి కష్టం వస్తేనూ, నష్టం నష్టపోతేనూ బావుణ్ణు; మనిషి కష్టం లేకుండానూ, నష్టపోకుండానూ బావుంటాడు’ ఇలా అనుకోవడం బావుంటుంది. కానీ వాస్తవంలో ప్రతిమనిషికీ జీవితంలో, జీవనంలో కష్టాలు, నష్టాలు కలుగుతూనే ఉన్నాయి, కలుగుతూనే ఉంటాయి. మనిషినే కాదు ప్రపంచాన్ని కూడా కష్టాలు, నష్టాలు కుదిపేస్తూనే ఉన్నాయి, కుదిపేస్తూనే ఉంటాయి.

జీవనంలో కలుగుతూ ఉండే కష్టాలు, నష్టాలవల్ల నిస్తేజమూ, కలవరమూ, గందరగోళమూ ఎవరికైనా తప్పవు. జీవితం అన్నాక కష్టం, నష్టం ఒకటి తరువాత ఒకటిగా, ఒకదానిపై ఒకటిగా వస్తూనే ఉంటాయి. వచ్చిన కష్టం ఏదైనప్పటికీ, కలిగిన నష్టం ఎంతదైనప్పటికీ మనిషి వాటిని తట్టుకోగలగాలి. కష్టాలకు, నష్టాలకు లొంగిపోకూడదు, కుంగిపోకూడదు. మనిషి లొంగిపోయాడు, కుంగిపోయాడు కదా అని కష్టాలు,నష్టాలు మనిషిని వదిలెయ్యవు. లొంగిపోయిన, కుంగిపోయిన మనిషి కష్టాలు, నష్టాలు ఉద్ధృతం అవుతాయి. మనిషి తన మనసుతో, మెదడుతో కష్టాలను, నష్టాలను నిలువరించి అధిగమించాలి.

చచ్చినట్టు బతకడం నుంచి నచ్చినట్టు బతకడంలోకి వెళ్లేందుకు మనిషి ప్రయత్నించాలి. అందువల్ల కష్టాలు, నష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మనిషి తనను తాను తయారుచేసుకోగలుగుతాడు. తాను చచ్చేలోపు ఉచ్ఛ స్థితికి చేరుకోవాలన్న ఆలోచన చెయ్యాలి. ఆ స్థితిని సుసాధ్యం చేసుకోవడం మనిషి నేర్చుకోవాలి. అందువల్ల కష్టాలు, నష్టాలు తనను నిస్తేజంలోకి నెట్టెయ్యకుండా మనిషి నిలదొక్కుకోగలడు.

మనుషులమై పుట్టామని గుర్తుంచుకుందాం; ఏ కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా చేవను ఊతంగా చేసుకుందాం. జరిగిపోయిన వాటి గురించీ, కలిగిన కష్టాలు, నష్టాల గురించీ చింతిస్తూ ఉండిపోవడం పిరికితనం. మనం పిరికితనానికి బలి కాకూడదు. పిరికితనం నుంచి మనం ధైర్యంతో బయటపడాలి. కష్టం, నష్టం నుంచి విముక్తం అవడానికి మనకు ధైర్యం కావాలి. మనం ధైర్యంతో కదలాలి.

‘ఉన్నంతవరకూ ఉన్నతంగానే ఉందాం, అనే చింతన వస్తే ఏ కష్టం లోనైనా, ఎంత నష్టంలోనైనా మనకు చైతన్యం వస్తుంది. ఆ చైతన్యమే కష్టాలు, నష్టాల నుంచి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టం కలిగినప్పుడూ, నష్టం కలిగినప్పుడూ మనిషికి నిస్పృహ వచ్చేస్తుంది. ఇక్కడే మనిషి జాగ్రత్తగా ఉండాలి. నిస్పృహ అనే మత్తుకు మనిషి అలవాటు పడకూడదు. ఆవరించిన నిరాశను అంతం చేసుకోవాలి. అటుపైన మతిలో సదాశ పుట్టాలి. మనిషి ఆశపడాలి. కష్టాలు, నష్టాలు కలిగాక వాటికి అతీతం అవ్వాలనే ఆశ కావాలి. సుఖపడాలని మనిషి ఆశపడాలి.

బాగా బతకడానికి అవకాశాలు ఎప్పటికీ బతికే ఉంటాయి. ఆ విషయాన్ని మనం సరిగ్గా పసికట్టాలి. దెబ్బతిన్న తరువాత బాగు పడాలనుకోవడం దోషం కాదు. దెబ్బతిన్న తరువాతైనా, దెబ్బ తిన్నందుకైనా మనిషి బాగుపడి తీరాలి. మళ్లీ పుడతామో లేదో మనకు తెలియదు; మరణించాక మనకు పని ఉండదు; బాగా బతకాలని గట్టిపట్టుపడదాం. కష్టం, నష్టంవల్ల మనల్ని మనం కోల్పోకూడదు. జీవనం జారిపోతే జీవితం పండదు. మనిషికి ఆశ కావాలి. మనిషి తన బతుకును తాను ఆస్వాదించడం నేర్చుకోవాలి. బతుకును ఆస్వాదించడం తెలిస్తే కష్టాలనూ, నష్టాలనూ ఓడించడం తెలుస్తుంది. కష్టనష్టాలపై గెలుపు మనిషికి పొలుపు.

మనకు గతాన్నీ, వర్తమానాన్నీ ఇచ్చిన కాలం భవిష్యత్తునూ ఇస్తుంది. కష్టానికీ, నష్టానికీ మనం పతనం అయిపోవడం కాదు, కలిగిన కష్టాన్నీ, నష్టాన్నీ పతనం చెయ్యడానికి మనం ఉపక్రమించాలి. ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఊపిరిలోకి తీసుకుని ఉద్యుక్తులమై మనం ఉన్నతమైన ప్రగతిని సాధించాలి.

ఏ చీకటైనా తొలగిపోవాల్సిందే. ఎంతటి తుఫానైనా ఆగిపోవాల్సిందే. చీకటి మూగినప్పుడు సంయమనంతో ఉంటే ఉదయాన్ని చూడగలం. తుఫాను ముంచుకొచ్చినప్పుడు అప్రమత్తంగా ఉంటే ప్రశాంత వాతావరణంలోకి వెళ్లగలం. భూకంపం వచ్చాక కూడా అభివృద్ధి జరుగుతుందని, జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. కష్టాలు, నష్టాలు దెబ్బలలా, దెబ్బలమీద దెబ్బలలా తగులుతున్నప్పుడు జీవితం పగిలిపోలేదని గ్రహించాలి. మనం ఉన్నందుకు, మనకు ఉనికి ఉన్నందుకు మనకు పటుత్వం ఉండాలి. కష్టాలు, నష్టాలు కలిగినా నేడు అనే వేదికపైన మనం నిలదొక్కుకుని ఉండగలిగితే రేపు వస్తుంది. ఆ రేపు మనల్ని కష్టాలు, నష్టాలు వీడిపోయిన ఎల్లుండిలోకి తీసుకెళుతుంది. 

– రోచిష్మాన్‌

మరిన్ని వార్తలు