Vidhi Collections: ఈ క్లాత్‌లో అస్సలు గంజి ఉండదు!

14 May, 2021 15:58 IST|Sakshi

న్యాయవాదులు న్యాయం గురించి ఆలోచిస్తారు. న్యాయవాదుల గురించి కేరళ కసవు చేనేత ఆలోచించింది. ‘విధి’ కలెక్షన్‌ పేరుతో కొంగొత్త ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసిన చీరలను వారి ముందుంచింది. 

‘కసవు’ అనేది కేరళలో ధరించే సంప్రదాయ హాఫ్‌వైట్‌ ఫ్యాబ్రిక్‌. ఇది అక్కడి స్థానిక చేనేతకారుల చేతుల్లో రూపుద్దుకుంటుంది. కసవు చీరలు కేరళ సంప్రదాయ పండగ సీజన్లలో ముఖ్యంగా ఏప్రిల్‌–ఆగస్టు నెలలో విరివిగా కొనుగోళ్లు జరుగుతాయి. ఓనమ్‌ పండగకు మహిళలు తప్పక కసవు సంప్రదాయ చీరను ధరిస్తారు. కోవిడ్‌–19 మహమ్మారి వల్ల లాక్‌డౌన్‌ విధింపులతో పండగలు, వేడుకలు లేవు.

అంతకుముందు ఏడాది వరదల కారణంగా నేత కార్మికులు ఘోరమైన నష్టాలను చవిచూశారు. ఈ కష్టం నుంచి గట్టెక్కడానికి ఈ కొత్త మోనోక్రామ్‌ చీరలు వినూత్నంగా రూపొందించారు. అయితే, ‘ప్రజలు వీటినే కొనాలని మేం కోరుకోవడం లేదు. మేం సమకాలీన ఉత్పత్తులను సృష్టించాలి, మా హస్తకళ ప్రావీణ్యం తెలియాలనే వీటిని రూపకల్పన చేశాం’ అని సేవ్‌ ది లూమ్‌ వ్యవస్థాపకుడు రమేష్‌ మీనన్‌ ఈ సందర్భంగా వివరిస్తారు. వీరి ఆలోచనా విధానం నుంచే ‘విధి’ అనే నూతన డిజైన్‌ కసవు నేతలో పుట్టుకొచ్చింది. 

సౌకర్యానికే ప్రథమ స్థానం
న్యాయవాదుల వేషధారణ గురించి 18వ శతాబ్దం నుండి ఆలోచించనేలేదు. బ్రిటీష్‌ కోర్టుల నుంచి ప్రేరణ పొందిన ఈ యూనిఫాం చీరలు, సల్వార్‌ కుర్తాలు నలుపు, తెలుపు లేదా బూడిద రంగులో ఉంటాయి. ప్రత్యేక కాలర్‌ గల జాకెట్, ఫార్మల్‌ గౌన్‌ అదనంగా మహిళలకు నిర్ణయించారు. అంతేకాదు, మరికొన్ని ముఖ్యమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని వివరిస్తారు మీనన్‌.

‘మన దేశంలో న్యాయస్థానాలు వేడి వాతావరణంలో ఉంటాయి. న్యాయవాదులు రోజుకు 12 నుండి 14 గంటలపాటు పనిలో ఉంటారు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. వారు తమ రెగ్యులర్‌ వేర్‌ని మెయింటెయిన్‌ చేయడానికి సమయం ఉండదు. కోర్టుకు సెలవులు ఉన్నప్పుడు గౌన్లను శుభ్రపరుచుకోవడానికి మాత్రమే కాస్త అవకాశం లభిస్తుంది.

కసవు నేతలో నాణ్యమైన పత్తి ఉంటుంది. ఈ క్లాత్‌లో అస్సలు గంజి ఉండదు. దీంతో పనిలో ఉండేవారికి ఈ చీరలు చాలా సౌలభ్యంగా ఉంటాయి. ఈ చేనేతకు ముష్రూ పట్టు నుండి ప్రేరణ పొందాం. మొఘల్‌ రాచకుటుంబీకుల కోసం అభివృద్ధి చేసిన ఫ్యాబ్రిక్‌గా దీనిని చెప్పవచ్చు. బట్ట ఎంతో మృదువుగా ఉంటుంది’ అని వివరిస్తారు. 


న్యాయవాది అన్నా చాందీ పుట్టిన రోజు సందర్భంగా ‘విధి’ క్లాత్‌ను లాంచ్‌ చేశారు. ఈ కొత్త చీరల కలెక్షన్‌ను యువ మహిళా న్యాయవాదులు ధరించి అందమైన, అత్యద్భుతమైన, సౌకర్యవంతమైన ఈ చీరల్లో కొత్తగా మెరిసిపోయారు. ఈ చీరలను న్యాయవాదులే కాదు దేశ మహిళలందరూ ధరించి, హుందాతనాన్ని మూటగట్టుకోవచ్చు. ముఖ్యంగా వర్కింగ్‌ వేర్‌గా ఈ ‘విధి’ సరికొత్త శారీస్‌ పేరొందుతాయి అని చెప్పచ్చు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు