Designer Sarees: జీవన సౌందర్యం

25 Jun, 2021 17:07 IST|Sakshi

కళకు జీవనశైలి తోడైతే అది ఎప్పుడూ సజీవంగా ఆకట్టుకుంటూనే ఉంటుంది. దుస్తులపై ముద్రణ అనేది ఈ నాటిది కాదు. కానీ, హస్తకళా నైపుణ్యంతో ఒక థీమ్‌ డిజైన్‌ తీసుకురావడం ఎప్పుడూ ప్రత్యేకతను చాటుతుంది. అలా ఇండియన్‌ ట్రక్‌ ఆర్ట్‌ నుంచి ప్రేరణ పొందిన డిజైన్స్‌ ఇవి. 

చీర అంటే తనకెంత ఇష్టమో విద్యాబాలన్‌ శారీ కలెక్షన్‌ చూస్తుంటే అర్థమవుతుంది. ఏ ఈవెంట్‌కైనా చీరకట్టుతో కనిపించే విద్యాబాలన్‌ తన సినిమా టైటిల్‌కు తగినట్టుగా ఆ చీర డిజైన్‌ ఉండాలనుకుంటారు. ఇటీవల ఆమె నటించిన ‘షేర్నీ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఐష్ర్‌ ఇలస్ట్రేషన్స్‌ స్టూడియో వారి హార్న్‌ ఓకే ప్లీజ్‌ సేకరణ నుంచి తీసుకున్న శారీలో మెరిశారు విద్యాబాలన్‌. చీర కొంగుపై పులి ముఖం, ముడివేసిన కేశాలంకరణ, చెవి రింగులతో విద్యా లుక్‌ నిజంగానే పులిలా గంభీరంగా కనిపిస్తుంది.

మన రోడ్లమీద ట్రక్స్‌ చూస్తే వాటి మీద రాసి ఉన్న అక్షరాలు, ప్రింట్లు ఆకర్షిస్తుంటాయి. అవి చాలా సాదా సీదాగా అనిపించినా ఆ ట్రక్స్‌కే ఆ డిజైన్స్‌ సొంతం అనిపిస్తాయి. ఆకర్షణీయమైన రంగుల్లో కనిపించే ఆ డిజైన్స్‌ని ఒడిసిపట్టుకొని, వాటిని చీరలు, దుపట్టాల మీదకు తీసుకువస్తే ఎలా ఉంటాయో చేసిన ప్రయత్నమే ఈ ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌.’ 

సేంద్రీయ మస్లిన్‌ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుని, బయోడిగ్రేడబుల్‌ రంగులతో ఇండియన్‌ ట్రక్‌ ఆర్ట్‌ నుండి ప్రేరణ పొందిన 9 ప్రింట్లతో ఐశ్వర్యా రవిచంద్రన్‌  చేతిలో రూపుదిద్దుకున్న చిత్రకళ ఇది. ఐశ్వర్యా రవిచంద్రన్‌ ఇలస్ట్రేటర్, ఫ్యాషన్‌ డిజైనర్‌ కూడా. వినూత్నమైన కళకు సంప్రదాయ సొబగులు అద్ది శారీస్, జాకెట్స్, షర్ట్స్, జ్యువెలరీని కూడా రూపొందిస్తున్నారు. ఈ ప్రత్యేక కలెక్షన్‌ను ఆర్గానిక్‌ మెటీరియల్‌పై సంప్రదాయ రంగుల కళను తీసుకొచ్చి దేనికది స్పెషల్‌గా రూపొందించిన చీరలు, దుపట్టాలు ప్రత్యేకతను చాటుతున్నాయి.

మరిన్ని వార్తలు