భవిష్యత్తునిచ్చే విద్యమ్మ!

13 May, 2022 00:25 IST|Sakshi
దివ్యాంగ పాఠశాల విద్యార్థులతో విద్యాఫడ్కే

తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం కోసం చేయని ప్రయత్నమంటూ ఉండదు. కానీ దురదృష్టవశాత్తూ కొంతమంది.. జన్యులోపాలతో దివ్యాంగ శిశువులు పుడుతుంటారు. చిన్నదైనా పెద్దదైనా లోపం ఉన్నప్పటికీ తమ పిల్లల్ని ప్రేమగానే చూసుకుంటుంటారు తల్లిదండ్రులు. కానీ అన్ని అవయవాలు సరిగా ఉన్న పిల్లలు ప్రయోజకులు కాకపోతే భారంగా అనిపిస్తారు తల్లిదండ్రులకు. అటువంటిది మానసిక శారీరక లోపాలున్న పిల్లలు జీవితాంతం భారమే. ఇక ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణం. వీరి కనీస అవసరాలు తీరాలన్నా ఇబ్బందే. అలాగ పేరెంట్స్‌కు భారమైన అమ్మాయిలను తల్లిలా లాలిస్తోంది విద్యఫడ్కే. దివ్యాంగ అమ్మాయిల కోసం ఏకంగా ఒక హోమ్‌ను ఏర్పాటు చేసి ఆత్మీయతానురాగాలను పంచుతోంది విద్య.
 
విద్యా ఫడ్కే నాసిక్‌లోని దివ్యాంగ ప్రత్యేక ప్రత్యేక పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తోంది. 32 ఏళ్లుగా దివ్యాంగ బాలబాలికలకు చదువు నేర్పిస్తోన్న విద్య..  తన వృత్తిలో భాగంగా తరచూ ఆయా పిల్లల తల్లిదండ్రులను కలుస్తుండేది. తమ పిల్లల భవిష్యత్‌పై ఆందోళన చెందుతోన్న ఆ తల్లిదండ్రులు... తమ తర్వాత ఈ పిల్లల పరిస్థితి ఏంటి... భవిష్యత్‌ ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తుండేవారు. వసతి సదుపాయాలే గాక, అమ్మాయిల భద్రత గురించి కూడా వారు దిగులుపడుతుండేవారు. పదేపదే వారి బాధలు విన్న విద్యకు ఆ పిల్లలకోసం ఏదైనా చేయాలనిపించింది. ఈ క్రమంలోనే వారికి చదువుతోపాటు, వివిధ రకాల నైపుణ్యాలు నేర్పించి ఆనందం గా ఉంచే ఒక హోమ్‌ వంటిది ఉంటే బావుంటుందన్న ఆలోచన వచ్చింది.
 
నలుగురితో...

దివ్యాంగ పిల్లలకు మంచి హోం ఉంటే బావుంటుంది కానీ వారు దానిలో ఆనందంగా ఉండగలుగుతారా! అనే అనుమానం వచ్చింది విద్యకు. దీంతో ఓ నలుగురు అమ్మాయిలకోసం ప్రత్యేకంగా క్యాంప్‌ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌లో భాగంగా నలుగురు అమ్మాయిలను నెలరోజులపాటు చూసుకుంది. నెలరోజుల తరువాత వారు ఇంటికి వెళ్లడానికి విముఖత చూపడమేగాక అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారు. దీంతో 2016లో కొంతమంది దాతల సాయంతో నాసిక్‌లోని పింపల్‌గావ్‌ బాహులలో ‘ఘర్‌కుల్‌ పరివార్‌’ పేరిట హోంను ప్రారంభించింది. దివ్యాంగ అమ్మాయిలు, మహిళల కోసం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి హోం అదే కావడంతో మహారాష్ట్ర నలుమూల నుంచి అమ్మాయిలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ వీరిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఈ హోమ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మాత్రమే ఇచ్చింది కానీ, ఏవిధమైన నిధులూ మంజూరు చేయలేదు. అయినా, దాతలు ఇచ్చే విరాళాలమీదే విద్య దీనిని నడిపిస్తోంది.

యాక్టివ్‌గా ఉంచేందుకు...
హోమ్‌లోని పిల్లల్ని  మానసికంగా శారీరకంగా దృఢంగా  ఉంచేందుకు మెడిసినల్‌ వాటర్‌తో స్నానం చేయించడం, ఆరోగ్యవంతమైన అల్ఫాహారం, వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, వివిధ థెరపీల్లో భాగంగా సింగింగ్, డ్యాన్స్, యోగాలు రోజువారి దినచర్యలో భాగం. ఇవేగాక రోజువారి పనుల్లో అనేక కొత్త విషయాలను కూడా నేర్పిస్తున్నారు. వంటలో సాయం చేయడం, కూరగాయలు తరగడం, చపాతీ పిండి కలపడం వంటి వాటిని చేయిస్తున్నారు. వీరిలో కొంతమంది పెన్నులు తయారు చేయడం, డెకరేషన్‌ ఐటమ్స్‌ రూపొందిస్తున్నారు. మసాలా తయారీ, కుట్టు మిషన్, క్యాండిల్స్‌ తయారీ వంటి వాటిని నేర్పిస్తున్నారు. ఈ హోంలోని అమ్మాయిలంతా కలిసి రోజుకి ఎనిమిదివేల బాల్‌పెన్స్‌ను అసెంబుల్‌చేస్తున్నారు. వీరిలో కొంతమందికి ఎలా బిహేవ్‌ చేయాలన్న దానిపై కూడా తరచు శిక్షణ ఇచ్చి మంచి çనడవడికను నేర్పిస్తున్నారు.  
 
కష్టమైనా... ఇష్టంగానే!

‘‘మానసిక స్థితిగతులు సరిగా లేనివారు ఒక్కసారి చెబితే అర్థం చేసుకోరు. వారికి నేర్పించడానికి ఒకటికి పదిసార్లు చెప్పాల్సి ఉంటుంది. ఇది కష్టమే, కొన్నిసార్లు విసుగు కూడా వస్తుంది. కానీ మనమే విసుక్కుంటే వాళ్లకు తెలియదు. అందువల్ల మా కేర్‌ గివర్స్‌ ఎంతో సహనంతో వారికి నేర్పింస్తుంటారు. రెండేళ్ల కరోనా కాలమ్‌లో బాగా కష్టంగా అనిపించింది. కరోనా సమయంలో ఎక్కువమంది అమ్మాయిల ప్రవర్తనకు ఇబ్బందులకు గురై మమ్మల్ని ఆశ్రయించారు. ఆ సమయంలో హోమ్‌లో లేని పిల్లలకు ఆన్‌లైన్‌ ద్వారా బోధించాం. సరిగా మాటలు కూడా రాకుండా ఇక్కడకు వచ్చిన అమ్మాయిలు ఇప్పుడు చక్కగా పాటలు పాడడం, డ్యాన్స్‌ చేయడంతోపాటు పద్యాలు కూడా రాస్తున్నారు. మా సంస్థ తరపున అదితి అనే అమ్మాయి సింగపూర్‌లో జరిగే కాంపిటీషన్‌లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ అమ్మాయి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండడమేగాక, సంస్థలో ఉన్న మరికొంతమంది అమ్మాయిలకు సింగింగ్, డ్యాన్స్‌ నేర్పిస్తుంది’ అని విద్యఫడ్కే వివరించారు.                     

మరిన్ని వార్తలు