Vijay Antony: 'ఎన్నోసార్లు చెప్పారు.. కానీ కన్నకూతురే ఇలా చేస్తుందని ఊహించి ఉండరు'

19 Sep, 2023 14:23 IST|Sakshi

ఈ మధ్య కాలంలో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. జీవితంలో ఏదో కోల్పోయిన పీలింగ్‌తో డిప్రెషన్‌కు లోవుతున్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకసారి ఒంటితనంతో బాధపడ్డవాళ్లే. ఎగ్జామ్‌లో ఫెయిల్‌ అయ్యామనో, పేదరికం, ప్రేమలో విఫలమవ్వడం, ఉద్యోగం లేకపోవడం, పనిలో ఒత్తిడి.. ఇలా ఎన్నో కారణాలు డిప్రెషన్‌లోకి నెట్టేస్తున్నాయి. ప్రపంచంలో సగటున 40 శాతం మంది ‘డిప్రెషన్’ డిజార్డర్స్‌తో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఏదో జరిగిపోతుందని, తమతో ఎవరూ లేరన్న ఒంటిరి ఫీలింగ్‌ మనిషిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్లే ప్రతీది సమస్యలా భావించడమే అతిపెద్ద తప్పు. మీలాగే లక్షలాది మంది ఏదో ఒక కారణంతో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అంతమాత్రాన ప్రాణం తీసుకోకూడదు. సాధారణంగా సినిమా స్టార్స్‌ని చూడగానే,వాళ్లకేంటి సంతోషంగా ఉన్నారని అనుకుంటాం. కానీ యటకు బాగానే కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల వాళ్లు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. దీపికా పదుకొణె దగ్గర్నుంచి కాజల్‌ అగర్వాల్‌ వరకు డిప్రెషన్‌ నుంచి బయటపడినవాళ్లే.

ఇదేం అంత పెద్ద సమస్య కాదు, అలా అని తేలిగ్గా తీసుకునే విషయం కూడా కాదు. సమస్యను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డాం అనేది ముఖ్యం. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ ఆత్యహత్యతో కోలీవుడ్‌ ఇండస్ట్రీ షాక్‌కి గురయ్యింది. టీనేజీ వయసులోనే డిప్రెషన్‌తో మీరా సూసైడ్‌ చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న మీరా మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది.

గత కొన్నాళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న మీరా అందుకు ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకుంటుంది. కానీ అంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మీరా డిప్రెషన్‌కు చదువల ఒత్తిడే కారణమని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ మాట్లాడుతూ.. ఈరోజుల్లో పిల్లలు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ర్యాంకుల వెంట పడిపోయి పేరెంట్స్‌ పిల్లలను ప్రెజర్‌ చేయొద్దని సూచించారు. అలాంటిది ఈరోజు ఆయన కూతురే డిప్రెషన్‌తో చనిపోవడం తీరని విషాదాన్ని నింపుతుంది.

మీరా ఆ నిర్ణయం తీసుకునేముందు ఒక్కసారి తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే బాగుండేదని, చిన్న వయసులోనే మీరా కఠిన నిర్ణయం తీసుకుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా విజయ్‌ ఆంటోని ఓ సందర్భంలో.. ఏడేళ్ల వయసులోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడని, దీంతో తన తల్లి ఎంతో కష్టపడి తనను పెంచిందని, ఆత్మహత్య సమస్యకు ఎప్పుడూ పరిష్కారం కాదని విజయ్‌ పేర్కొన్నారు.

కానీ విధి ఎంత విచిత్రమో.. ఆరోజు తండ్రి సూసైడ్‌ చేసుకోగా, ఇప్పుడు కూతురు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కొన్ని సార్లు జీవితం మనల్ని పరీక్షిస్తుందో, శిక్షిస్తుందో అర్ధం కాదు, స్టే స్ట్రాంగ్‌ విజయ్‌ సార్‌ అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఒత్తిడి.. ఎలా బయటపడాలి?

  • ఒంటరితనం వల్ల రకరకాల ఆలోచనలు మైండ్‌లోకి వస్తాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు ఫ్రెండ్స్‌, ఫ్యామిలితో సమయం గడపండి.
  • ఏదో సాధించాలని తపన అందరిలో ఉంటుంది. కానీ దానికి టైం కూడా రావాలి. కష్టపడిన వెంటనే ఫలితం ఆశించకండి. సమయంతో పాటూ అన్నీ సర్దుకుంటాయి అని పాజిటివ్‌గా ఉండండి. 
  • ఖాళీగా ఉండకుండా ఏదైనా కొత్త హాబీని ఏర్పరుచుకోండి. సంగీతం, డ్యాన్స్‌, మ్యాజిక్‌.. ఇలా ఏదో ఒక వ్యాపకాన్ని ఇష్టంతో చేయండి. 
  • ఎన్ని చేసినా, ఎంత ప్రయత్నించినా ఒంటరితనం, డిప్రెషన్‌ నుంచి బయటరాలేమనుకుంటే వెంటనే సైకాలజిస్ట్‌ని సంప్రదించండి. 
     

Disclaimer: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు