Dussehra: దశమి వచ్చింది.. దసరా రోజున ఏం చేయాలి?!

15 Oct, 2021 05:31 IST|Sakshi

ఒకప్పుడు లోకాలను పట్టి పీడిస్తున్న భండాసురుడనే రాక్షసుడినీ, వాడి ముప్ఫైమంది సంతతినీ, వారి సైన్యాన్నీ ఆదిశక్తి అవలీలగా వధించింది. అలాగే మాయావులైన చండాసురుడు, ముండాసురుడు, మహిషాసురుడు అనే లోకకంటకులైన రాక్షసులతో రోజుకో రూపంలో పోరాడి సంహరించి, చతుర్దశ భువనాలకూ శాంతిని ప్రసాదించింది ఆది పరాశక్తి. అందుకు ప్రతీకగా జరుపుకుంటున్నవే దేవీ నవరాత్రులు... విజయ దశమి వేడుకలు. ఇవి గాక విజయదశమి జరుపుకోవడానికి మరికొన్ని కారణాలున్నాయి.

దేవదానవులు క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని సంపాదించినది కూడా విజయ దశమి రోజునే. దసరా రోజునే శ్రీరామచంద్రుడు... దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అజ్ఞాతవాస పరిసమాప్తి కాగానే విజయుడు (అర్జునుడు) ఉత్తర గోగ్రహణం చేసి విజయం సాధించిన రోజని మరో గా«థ ఉంది.

ఐకమత్యమే ఆయుధ బలం
ఎంతటి దైవమైనా రాక్షసులను సంహరించాలంటే ఒక్కరి వల్లే కాదు. ఎందుకంటే రాక్షసులు కూడ బల పరాక్రమాలు కలవారే, తపశ్శక్తి సంపన్నులే! కాని వారి లక్షణాలు మాత్రం సరైనవి కావు. అమాయకులను పీడించడమే వారి పని. ఆయా రాక్షసులకు స్త్రీలంటే చిన్నచూపు. తమ జోలికి వారు రాలేరని, తమనేమీ చేయలేరన్న చులకన భావం. అందుకే పురుషుల చేతిలో ఓడిపోరాదన్న వరాలను పొందారు. అటువంటి లక్షణాలున్న వారిని అణిచి వేయకబోతే అందరి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ఆ ప్రమాదాన్ని నివారించడానికి దేవి ముందుకు వచ్చింది.

అందరి మొరలూ ఆలకించే అమ్మ
మన మనస్సులోని తలంపులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు అమ్మ ప్రసన్నవదనంతోనూ, కలుషితంగా ఉన్నప్పుడు భయంకరాకారంలోనూ కనిపిస్తుంది. ఇంట్లో బిడ్డలు కూడా ఏదైనా తప్పు చేసేటప్పుడు అమ్మ వచ్చి దండిస్తుందేమోననే భయంతో ఉంటారు. ఆ సమయంలో అమ్మ  మామూలుగా చూసినా, కోపంగా ఉన్నట్లే అనిపిస్తుంది.
నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మను పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. లౌకిక బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాధి పీడితులకు ఆరోగ్యం చేకూరుతుంది. చిత్తస్థై్థర్యం, శత్రు విజయం చేకూరతాయి.

చెడుపై మంచి సాధించిన విజయం
దానవత్వంపై దైవం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాడి తీరవలసిన శత్రువులు మనలో ఉండే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలే. ఆ శత్రువులపై మనమే పోరాటం చేయాలి. విజయం సాధించాలి.

మామూలుగా దసరా...
దసరా రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటిని దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. సంవత్సర కాలంలో సేవలందించిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం... వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు.  
విజయాలకు పునాది
విజయదశమి అంటే సకల విజయాలనూ కలగ చేసే దశమి. తిథి, వార, నక్షత్ర గణన లేకుండా విజయదశమి రోజున చేపట్టిన సకల కార్యాలు విజయం పొందుతాయని నమ్మిక. ఇదే విషయం ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రంథం విపులీకరించింది. ఈ రోజున ఆరంభించే ఏ శుభకార్యమైనా, రకరకాల వృత్తులు, వ్యాపారాలు అయినా అఖండ విజయం సాధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభించడం వల్ల నిరాటంకంగా జరుగుతాయని నమ్మకం.
ఈ విజయ దశమి అందరికీ సుఖ సంతోషాలను, విజయాలను ప్రసాదించాలని అమ్మను కోరుకుందాం.

దసరా రోజున ఏం చేయాలి?
దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు మూడు రోజులు, మూడురోజులు కూడా కుదరని వారు కనీసం చివరి రోజయిన విజయ దశమినాడు ఒక్కరోజయినా సరే ఆ దివ్య మంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా అమ్మను దర్శించుకుని పూజ చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఆయుధ పూజ, వాహన పూజ చేయడం, వృత్తిదారులు తమ పనిముట్లను పూజించడం వంటివి మహర్నవమితోపాటు ఈ రోజున కూడా కొందరు చేస్తారు.

విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. ఆ శ్లోకంతోపాటు మన కోరికలేమైనా ఉంటే వాటిని చీటీ మీద రాసి జమ్మి కొమ్మకు కట్టాలి. జమ్మిచెట్టును పూజించి, ప్రదక్షిణ నమస్కారాలు అయిన తర్వాత జమ్మి ఆకును పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులను అందుకోవాలి. ఆడపడచులను ఆదరించడం, తల్లిదండ్రులను గౌరవించడం, శక్తిమేరకు దానధర్మాలు చేయడం ఈ పండుగ విధులలో ఇతర ప్రధానమైన అంశాలు.

సమష్టి బలం
ఆ తల్లి ఈశ్వరుడి నుంచి త్రిశూలాన్ని, కుమారస్వామి నుంచి శక్తి ఆయుధాన్ని, వినాయకుడి నుంచి విఘ్న నివారణ ఆయుధాన్ని, విష్ణువు నుంచి చక్రాయుధాన్ని, ఇంద్రుని నుంచి వజ్రాయుధాన్ని, విశ్వకర్మనుంచి డాలుని, అగ్నిదేవుని నుంచి ఆగ్నేయాస్త్రాన్ని, యుముని నుండి పాశాన్ని, వరుణుని నుంచి వారుణాస్త్రాన్ని, కుబేరుని నుంచి ధనరాశులతో నిండిన కుండను, దానితోబాటు వారందరి బలాన్ని కూడగట్టుకుని యుద్ధం చేసి విజయం సాధించింది. దీనిని బట్టి మనం తెలుసుకోవలసినదేమంటే ఒక్కరుగా చేయలేని పనిని ఐకమత్యంగా చేయవచ్చని. విజయదశమి పండుగ మనకు సమైక్యతతో ఉండవలసిన ఆవశ్యకతను, స్త్రీ శక్తి ప్రాధాన్యతనూ తెలియచేస్తోంది.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

మరిన్ని వార్తలు