‘ప్రకృతి’ వరి దుబ్బుకు 55 పిలకలు!

6 Oct, 2020 07:58 IST|Sakshi
ప్రకృతి సేద్యంలో పెరిగిన 59 పిలకల వరి దుబ్బును కుడి చేతిలో, రసాయన సాగులోని వరి దుబ్బును ఎడమ చేతిలో పట్టుకొని చూపుతున్న ఏపీ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి.విజయకుమార్‌

వరి సాగు చేసే పొలాల్లో కొందరు రైతులు భూసారం పెంపుదలకు పచ్చి రొట్ట ఎరువులు సాగు చేస్తుంటారు. పప్పు జాతి జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి ఒకటి, రెండు రకాల పచ్చి రొట్ట పంటలను సాగు చేసి రొటవేటర్‌తో పొలంలో కలియదున్నుతారు. అది కుళ్లిన తర్వాత ఆ పొలంలో వరి సాగుకు ఉపక్రమిస్తుంటారు. అయితే, గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలోని కంచర్లపాలెం గ్రామ కౌలు రైతు జి.విజయకుమారి ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం తోడ్పాటుతో మరింత విభిన్నమైన ప్రయోగాన్ని చేపట్టి అద్భుత ఫలితం సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఎకరం మాగాణిలో, ఖరీఫ్‌కు ముందు, వర్షాల రాకకు ముందే మే నెలలో, పచ్చిరొట్ట పంటలు వేశారు (దీన్నే ‘ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌ – పీఎండీఎస్‌’ పద్ధతి అంటున్నారు). అందరిలా ఒక రకానికే పరిమితం కాలేదామె. ఏకంగా 18 రకాల పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలను కలిపి చల్లారు. భూమిలో ఎకరానికి మొదట 200 కిలోల ఘనజీవామృతం, ఆముదం పిండి వేసి కలియదున్ని విత్తనాలు వేశారు. పెరిగిన పచ్చి రొట్ట పైర్లను కూడా అందరిలా రొటవేటర్‌తో భూమిలో కలియ దున్న లేదు. కోసి పశుగ్రాసంగా వినియోగించారు. ఆ పంటల మోళ్లను, వేర్లను తీసెయ్యకుండా అలాగే వదిలేశారు. మళ్లీ దుక్కి దున్నకుండా లేదా దమ్ము చేయకుండానే.. ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం చల్లి వరి సాగుకు ఉపక్రమించారు.

ఎదిగిన 18 రకాల పచ్చిరొట్ట పైరు, తాళ్లు పట్టి వరుసలుగా నాటిన వరి పంట  
తాళ్ల సహాయంతో నేలపై చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ ఎంటీయూ–1262 వరి విత్తనాలను వరుసలుగా మనుషులతో నాటించారు. 10 రోజులకోసారి ఎకరానికి మునగాకు కలిపిన 200 లీటర్ల ద్రవ జీవామృతాన్ని భూమికి అందించడమే కాకుండా పైరుపైన చల్లుతున్నారు. నాము తెగులు కనిపిస్తే వావిలాకు కషాయం రెండు సార్లు పిచికారీ చేశారు. అంతే. తొంభై రోజులు తిరిగే సరికి 55–59 వరకు పిలకలు కలిగిన వరి దుబ్బులను గ్రామస్తులు అబ్బురంగా చూస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ టి.విజయకుమార్, ప్రకృతి వ్యవసాయ విభాగం గుంటూరు జిల్లా ప్రాజెక్టు మేనేజరు కె.రాజకుమారి ఈ వరి పొలాన్ని ఇటీవల స్వయంగా పరిశీలించి సంతోషాన్ని వ్యక్తపరిచారు. సమీపంలో రసాయన ఎరువులతో సాగయ్యే వరి పొలంతో పోల్చి చూడగా.. రెండు సాగు పద్ధతుల మధ్య ఎంతో వ్యత్యాసం కనిపించింది. విజయకుమారి పొలంలో ఎకరానికి 45–50 బస్తాల దిగుబడి వస్తుందన్న అంచనాకొచ్చారు. ఎక్కువ రకాల పచ్చిరొట్ట పంటలు వేయటం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి వైవిధ్యం పెరిగి భూసారం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిని దున్నకుండా వరి విత్తనాలు నాటించడం, ఘన, ద్రవ జీవామృతం వాడటం వల్ల వరికి పుష్కలంగా అన్ని రకాల పోషకాలు అందుతున్నాయని అంటున్నారు.  
– బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి 

అంతా ఆశ్చర్యంగా చూశారు!
జనుము, జీలుగ, పిల్లిపెసర సహా 18 రకాల విత్తనాలను కలిపి పచ్చి రొట్ట పైరుగా వర్షాలకు ముందే చల్లినపుడు రైతులంతా ఆశ్చర్యంగా చూశారు. పచ్చిరొట్ట పైరును కలియదున్న లేదు. కోసి పశుగ్రాసంగా వాడాం. మోళ్లను అలాగే వదిలేశాం. మళ్లీ దుక్కి చెయ్య లేదు. దమ్ము చెయ్య లేదు. తాడు పట్టి చిన్న చిన్న గుంతలు తీసి వరి విత్తనాలను మనుషులతో నాటించాను. పైరుకు ఎకరానికి 600 కిలోల ఘనజీవామృతంతోపాటు ప్రతి పది రోజులకు జీవామృతం అందించాను. రెండుసార్లు వావిలాకు కషాయం చల్లాను. వరి పైరు బలంగా పెరిగింది. ఆకర్షణీయంగా ఉంది. తొంభై రోజుల్లో 55–59 వరకు పిలకలు వచ్చాయి. 45–50 బస్తాల దిగుబడి వస్తుందని రైతులే చెబుతున్నారు. 
– జి.విజయకుమారి (91211 47694), మహిళా కౌలు రైతు, కంచర్లపాలెం, గుంటూరు జిల్లా 


పీఎండీఎస్‌ గొప్ప ప్రయోగం
ప్రపంచంలోనే ప్రప్రథమంగా గత రెండేళ్లుగా ప్రీ మాన్సూన్‌ డ్రై  సోయింగ్‌ (పీఎండీఎస్‌) పద్ధతిని ప్రకృతి వ్యవసాయంలో రైతులతో అమలు చేయిస్తు్తన్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో పీఎండీఎస్‌ విధానంలో 92 వేల రైతులు రకరకాల పంటలు సాగు చేస్తున్నారు. మే నెలలోనే 18 రకాల పచ్చి రొట్ట పంటలు వేసినా ఘనజీవామృతం గాలిలోని తేమను ఆకర్షించటం వల్ల పంటలు పెరగటం విశేషం. పచ్చిరొట్టను భూమిలో కలియదున్నకుండా, మోళ్లను అలాగే ఉంచి భూమిని మళ్లీ దుక్కి చేసి కదిలించకుండా, వరి విత్తనాలను లైన్‌ సోయింగ్‌ పద్ధతిలో నాటించటం విజయకుమారి చేసిన గొప్ప ప్రయోగం. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది పీఎండీఎస్‌ను మరో 700 గ్రామాలకు విస్తరించనున్నాం. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ఛైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ

‘ప్రకృతి సేద్యం –మూలసూత్రాలు, ఆచరణ’పై శిక్షణ
ప్రకృతి వ్యవసాయం మూలసూత్రాలు, ఆచరణాత్మక పద్ధతులపై ప్రసిద్ధ శాస్త్రవేత్తలు డా. దేబల్‌ దేవ్, ప్రొ. స్టీఫెన్‌ గ్లియెస్‌మాన్‌ నవంబర్‌ 2 నుంచి 8 వరకు ఒడిశా రాయగడ జిల్లా కెరాండిగుడలోని బసుధ సంస్థ పరిశోధనా క్షేత్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయం పుట్టుపూర్వోత్తరాలు, మిశ్రమ పంటల సాగు, పంటల మార్పిడి, కలిసి పెరిగే పంటలు, అటవీ జాతి చెట్ల మధ్యలో పంటల సాగు, బహుళ అంతస్థుల ఇంటిపంటల సాగు, దేశీ వరి వంగడాల పరిరక్షణ, శ్రీవరి సాగు, ప్రకృతిసిద్ధంగా కలుపును అదుపు చేయటం, రసాయన రహిత వ్యవసాయంలో పంటల జీవవైవిధ్యం పాత్ర తదితర అంశాలపై అభ్యర్థులకు ఆంగ్లంలో లోతైన అవగాహన కల్పిస్తారు. ఆసక్తి గలవారు ఈ నెల 12 లోగా తమ పూర్తి వివరాలతోపాటు ధరఖాస్తు పంపాలి. బసుధ సంస్థ నిర్వాహకులు పరిశీలన అనంతరం శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు సమాచారం పంపుతారు. ఆ తర్వాత రూ. 16,000 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు.. ఫోన్‌ నంబర్‌: 98538 61558/94326 74377

11న రబీలో వరి, కూరగాయల ప్రకృతి సాగుపై శిక్షణ
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ విధానంలో రబీలో వరి, కూరగాయల సాగుపై రైతునేస్తం ఫౌండేషన ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర్లోని కొర్నెపాడులో రైతులకు ఈ నెల 11(ఆదివారం)న శిక్షణ ఇవ్వనున్నారు.  గుంటూరు జిలా అత్తోటకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు బాపన్న, రాజుపాలెం రైతు శివనాగమల్లేశ్వరరావు శిక్షణ ఇస్తారు. దేశీ వరి రకాల సాగు, కషాయాలు, ద్రావణాల తయారీపై కూడా శిక్షణ ఇస్తారు. కొవిడ్‌ నేపథ్యంలో 40 మందిని మాత్రమే శిక్షణకు అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్‌ వివరాలకు.. 97053 83666, 0863–2286255.

మరిన్ని వార్తలు