మా అమ్మకు పట్టిన దెయ్యం వీడే..

27 Dec, 2020 10:53 IST|Sakshi

విముక్తి

గదిలో తన కూతురు పింకీ ప్రవర్తనను చూస్తున్న కమల ఒక్కసారిగా బిక్కచచ్చిపోయింది. నేల పగిలిపోయి, తను అగా«థంలోకి కూరుకుపోతున్నట్టనిపించింది. తన నెత్తిన ఎవరో బలంగా మోదినట్టయ్యింది. గొంతు పెగలకపోవడంతో ఆ క్షణం అక్కడే అచేతనంగా బండరాయిలా ఉండిపోయింది కమల.

కమలకున్న ఒకే ఒక్క స్నేహితురాలు జయ. వీరిద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. మంచైనా సరే, చెడైనా సరే జయతో చెప్పేంతవరకూ తేలికపడదు కమల. ఒకే ఆత్మకు రెండు దేహాలుగా ఉంటుంది వారి స్నేహం. జయ బాగా చదువుకుంది, సంస్కారి. ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా బాగా ఎనలైజ్‌ చేయగలుగుతుంది.
పింకీ చేస్తున్న ఈ పిచ్చి పనిని జయతో వెంటనే చెప్పేయాలనుకుంది. ఇపుడు అర్ధరాత్రి పన్నెండయ్యింది. ఫోన్‌ చేస్తే! అనవసరంగా దాన్ని కంగారుపెట్టిన దాన్నవుతానేమో అని తనలో తాను అనుకుంటూ చివరికి, ‘‘రేపు నేను సెలవు పెడుతున్నాను. నువ్వు కూడా సెలవు పెట్టి మా ఇంటికి రా! అర్జంటుగా నిన్ను కలవాలి’’ అని మెసేజ్‌ పెట్టింది.

తన మాటను మన్నించి వస్తున్న జయను దూరంగా చూసింది కమల. పరుగు పరుగున ఎదురెళ్ళి జయను గట్టిగా పట్టుకొని భోరున ఏడ్చేసింది. ‘‘ఏమయిందే... ఏమయిందీ!... ఈ ఏడుపేంటి? అందరూ బాగున్నారు కదా? పాప ఎలా వుంది?’’ అని అడిగింది.
ఎందుకేడుస్తుందో కారణం తెలియక కంగారుపడిపోయింది జయ.
‘‘...కంగారుపడకు బాగానే ఉన్నాం’’ అంటూ తను కళ్ళను తుడుచుకుంటూ కమల జయను ఇంట్లోకి తీసుకెళ్ళింది. ‘‘పింకీ స్కూలుకి వెళ్ళిపోయిందా?’’ అని అడుగుతున్న జయను, కమల పింకీ గదికి తీసుకెళ్ళింది. ఎప్పుడూ లేనంతగా మొద్దు నిద్రపోతోంది పింకీ. ‘‘అదేంటి? ఇంకా నిద్రపోతోందేమిటి? ఒంట్లో బాలేదా?’’ కంగారుపడుతూ అడిగింది జయ.
‘‘నిన్న రాత్రి నాకు సరిగా నిద్ర పట్టక మంచినీళ్ళు తాగుదామని లేచాను. పింకీ గది తలుపు కింద నుంచి లైటు వెలుగు కనిపిస్తుంది. చదువుకుంటుందేమో అనుకున్నాను. చాలా టైమయ్యింది పడుకోవే అని చెబుదామని తలుపు తట్టేసరికి జారేసిన తలుపులు తెరుచుకొన్నాయి. గదిలో పింకీని చూసి భయపడిపోయాను’’ అంది కమల.
‘‘ఏం... ఏమయ్యింది? అదేం చేస్తుందో చెప్పు... చెప్పవే’’ అంది ఆశ్చర్యంగా జయ.
‘‘కిందటి వారం నా పుట్టినరోజున నేను కట్టుకున్న కొత్త చీరుంది కదా...’’
‘‘ఏదీ?’’

‘‘అదేనే పసుపుపచ్చ చీర. దాన్ని నేల మీద పూర్తిగా పరచింది. చీర మీద కూర్చొని బ్లేడుతో ఆ చీరను చర్మానికి గాట్లు పెడుతున్నట్టుగా చిన్న చిన్న పీలికలుగా కోస్తోంది. వృత్తలేఖినితో చీర నిలువునా కసిగా అడ్డదిడ్డంగా పొడుస్తోంది. ‘ఐ విల్‌ కిల్‌ యూ, కిల్‌ యూ, కిల్‌ యూ’ అంటూ మార్కర్‌తో చీరపై రాస్తోంది. ‘చావరా... చావు అంటూ విచిత్రంగా ఏడుస్తోంది. కుమిలిపోతోంది. అంతలోనే వికృతంగా నవ్వుతోంది. ఏదో గాలి సోకినట్టు, దెయ్యం పట్టిన దానిలా, పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించిందే! ఒక జీవిని చిత్రహింసలు పెడుతూ ఆనందించే శాడిస్టులా కనిపించింది నాకా సమయంలో. ఎదురుగా నేనున్నానని, చూస్తున్నానని కూడా అది గమనించలేదు. ఏదో ట్రాన్స్‌లో ఉందనిపించింది. దాని చేష్టలు చూస్తూ దగ్గరగా వెళ్ళలేకపోయాను. ఏం చేయాలో, ఎలా రియాక్ట్‌ కావాలో అర్థంకాక, నోరు పెగలక గుమ్మం దగ్గరే బొమ్మలా నిలబడిపోయాను’’ అంది కమల.
కొద్ది సేపటికి ఏమీ ఎరగనట్టు వెళ్ళి మంచం మీద పడుకొంది. వెంటనే గాఢనిద్రలోకి వెళ్ళిపోయింది. దగ్గరకు వెళ్ళి పాప నుదుటిపై చెయ్యి వేశాను. జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. ఏం చేయాలో తెలీక బెంగపడిపోయానంది.
కమల మాటలు విన్న జయకు అయోమయం అనిపించింది. ‘‘ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా ప్రవర్తించిందా?’’ అని అడిగింది.
‘‘లేదు... ఏమో నేను గమనించలేదు’’ అంది కమల.
‘‘సరే! పాప లేచాక డాక్టర్‌ దగ్గరకి తీసుకొని వెళదాం.
‘‘నీకెన్నో చీరలుంటే పింకీ ఈ చీరనే ఎందుకు ఇలా చేసిందంటావ్‌? దానిపై అంత కక్ష్య, అసహ్యం ఎందుకో! ఆలోచించు’’ అంది జయ.
చీర వివరాలు అడుగుతున్నందుకు కమల ఉలిక్కిపడింది. తడబడుతూ ‘‘నన్ను క్షమించవే! నీతో దగ్గితే దగ్గానని, తుమ్మితే తుమ్మానని చెప్పుకునే నేను నీకు చెప్పకుండా ఒక విషయం దాచాను. ఏమంటావో అని భయపడి చెప్పలేదు’’ అంది కమల.

‘‘నాకు చెప్పకూడదనుకున్నావంటే... ఖచ్చితంగా అది నాకు నచ్చని విషయమైనా అయి ఉండాలి. లేదా నేను వ్యతిరేకిస్తానని భయపడైనా ఉండాలి. అంతేనా! వద్దులే నాకేం చెప్పకు’’ అంది జయ. 
‘ఎంత దాచాలనుకున్నా నీకు చెప్పకుండా దాయలేను’ అంటూ చెప్పనారంభించింది కమల.
‘‘ఈమధ్యే ఆరు నెలల క్రితం నాకొకాయనతో పరిచయం ఏర్పడింది. ఆయన చాలా మంచివారు. ఎంతసేపూ నా గురించి, నా పాప గురించే వారి ఆలోచన. ప్రతిరోజూ ఉదయాన్నే గుడ్‌ మార్నింగ్, మధ్యాహ్నం భోజనం చేశావా? సాయంత్రం టీ తాగావా? రాత్రులు ఆన్‌లైన్‌లో నన్ను చూసి ఇంతవరకు పడుకోకపోతే ఎలా? నీ ఆరోగ్యం ఏంకావాలి? అంటూ ప్రతి విషయంలోనూ ఎంత కేరింగో తెలుసా!’’
‘‘నీ గురించి అంతా ఆయనకు అదే నీ ప్రేమనాథునికి చెప్పావా?’’
‘‘అంతా అంటే?’’
‘‘అదే మీ ఆయన పోయారన్న విషయం, పదేళ్ళ పాప కూడా ఉందన్న విషయం.’’
‘‘చెప్పాను. అది విని ఆయన ఎంత బాధపడిపోయారో తెలుసా? మావారి కోసం నేను కూడా అంత బాధపడలేదు’’ అంది.
‘నువ్వే నా ప్రాణమన్నాడు. నువ్వు లేకపోతే నేను లేనన్నాడు. అనుక్షణం నీ ధ్యాసే అన్నాడు. అందరిలాంటి వాణ్ణి కాదన్నాడు. నన్ను నమ్మమన్నాడు. నమ్ముకోమన్నాడు. కంటికి రెప్పలా కాచుకుంటానన్నాడు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నాడు.’
‘చాలు... చాలు... చాలింక ఆపు! ఇవన్నీ అబద్ధాలని నీకు అనిపించలేదా?‘
‘‘ఇంతకీ ఈ కమలోద్ధారకుని నామధేయం ఏమిటో?’’
‘‘తెలీదు’’ అంది కమల.
‘‘తేలీదా!’’ అంటూ ఆశ్చర్యపోయింది జయ.
‘‘నేను నిన్ను డార్లింగ్‌ అంటాను. నువ్వు కూడా నన్ను డార్లింగ్‌ అని పిలవమన్నాడు.’’
‘‘అబ్బో!! గురుడు రొమాంటిక్కే’’
‘‘ఇంతకీ మీ డార్లింగ్‌కి పెళ్ళయ్యిందా. అవలేదని చెప్పుంటాడు ప్రబుద్ధుడు అవునా?’’ అంది జయ.
‘‘ఆయనకు పెళ్ళయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళవాళ్ళని, మావాళ్ళని ఒప్పించి నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు. నాకు సంపూర్ణమైన జీవితాన్నిస్తానన్నాడు. కోల్పోయిన సౌభాగ్యాన్ని, సుఖాన్ని తిరిగి ప్రసాదిస్తానన్నాడు. చివరిగా నాకే సమస్య వచ్చినా తనే పరిష్కారం అన్నాడు’’ అంది కమల.

‘‘అబ్బో! ఇక నేనేమి చెప్పినా నీకు నచ్చదు. ఇవన్నీ వద్దు. పాప భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వదిలేయవే అన్నాననుకో, మన మధ్య ఇంత స్నేహమూ ఆవిరైపోతుంది. ఖచ్చితంగా నన్ను దూరం చేసుకుంటావు. లేదా మీ డార్లింగ్‌ గురించి నా దగ్గర ప్రస్తావించకుండా ఉంటావ్‌. వాడెవడో గానీ భలే జాక్‌పాట్‌ కొట్టేశాడు. నీ బతుకు నువ్వు బతుకుతున్నావు. వాడిని ఒక్క పైసా కూడా అడగవు. అది నాకు బాగా తెలుసు. వాడి అవసరాలకు నీ దగ్గర లాగేయకుండా ఉంటే అదే పదివేలు. నీ వల్ల వాడికి సుఖమే గాని, వాడికి కానీ ఖర్చు లేదు. నీ వల్ల ఏ ఇబ్బందీ ఉండదు. వాడెవడో నీ గురించి బాగా తెలిసినోడయ్యుండాలి. చాలా పక్కాగ ప్రణాళికతో ఉన్నాడే.’’
‘‘ఏదేమైనా నీ మార్గం సరి చేసుకోకపోతే పాతాళంలోకి జారిపోతావు. నీకున్న ఒకే ఒక్క ఆశ, ఆనందం పింకీ పాపే! ఈ బూటకపు ప్రేమల వల్ల పాపకు కూడా హీనమైపోతే అప్పుడు అసలైన ఒంటరితనాన్ని భరిస్తూ అధమమైన జీవితం గడపవలసి వస్తోంది. ఆలోచించుకో‘ అంది జయ.
‘‘నిజమే జయా... నువ్వన్నది నిజమేనే... మంచి సంబంధం, గవర్నమెంటు ఉద్యోగం, ఇంద్రుడు చంద్రుడు, ఇలాంటోడు మరెక్కడా దొరకడు. చేజార్చుకోకూడదంటూ నేవద్దంటున్నా నా ఇష్టాఇష్టాలతో పని లేకుండానే నాకు పెళ్ళయిపోయింది. సుఖానికి పుట్టిందో ఏమో తెలీదు గానీ గాలికి పుట్టినట్టుగా ఓ పిల్ల పుట్టేసింది.
మా ఆయన ఒక జడపదార్థం. ఈ కూర బాగా చేశావ్‌. ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావ్‌. ఇదిగో ఇది నీకిష్టమని తెచ్చాను అని ఏనాడూ ముచ్చటకి కూడా అనేవాడు కాడు. పువ్వులని, పళ్ళని, చీరలని, నగలని, నవ్వులని, సరదాలని ఇలాంటి ఏ మురిపాలూ లేకుండానే ఏ ముచ్చటా తీరకుండానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి.

మూడో సంవత్సరం ఆయనకు అనారోగ్యం మొదలయ్యింది. చివరికి అది గొంతు కేన్సర్‌ అని తేలింది. ఆ క్షణం నుంచి ఆయన ఒంట్లోనూ, మా ఇంట్లోనూ పెనుచీకటి కమ్మేసింది. ఆయన పోయాక నిరాశ, నిస్పృహలతో నాకు ముప్ఫయ్యేళ్ళకే ముసలితనం వచ్చేసింది.
ఆకలి, దప్పికలాగే శరీరమంతా కోరికతో దహించేస్తున్నా మా కుటుంబానికి కావలసిన పరువుని, సమాజానికి కావలసిన నీతిని కాపాడడానికే శరీరవాంఛను నిగ్రహంతో చంపుకుంటున్నాను.
నా ఒంటరితనం ఆయనకు అవకాశమనీ తెలుసు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలనీ తెలుసు. నన్ను పెళ్ళి చేసుకుంటానన్నది ఒక బలమైన ఎర అనీ తెలుసు. నా శరీరాన్ని మాత్రమే కోరుకుంటాడని తెలుసు. అయినాసరే నా స్వాభిమానాన్ని కాపాడుకుంటూ ఆయన స్నేహంలో ఒక మానసికమైన ఆలంబనను, చిగురంత తోడును, చిటికెడు ప్రేమను వెర్రిదానిలా వెతుక్కుంటున్నాను. ఆయన భార్యకు గానీ, వారి పిల్లలకు గానీ నా వల్ల ఏ ఇబ్బందీ కలగనివ్వను. ఆయన తొందరపెడుతున్నా నేను లొంగిపోలేదు. నన్ను నమ్ము జయ’’ అంది కమల.
‘‘ఎవరి ఉసురు పోసుకున్నానో, ఎవరి శాపం తగిలిందో ఈనాడు అనుభవిస్తున్నాను’’ అంటూ కళ్ళు తుడుచుకుంది కమల.
‘‘బాధపడకు’’ అంటూ ఓదారుస్తూ కమలను హత్తుకుంది జయ.
‘‘ఇప్పుడర్థమైంది. నీ పుట్టినరోజు చీర ఆయనే గిఫ్టుగా ఇచ్చారు కదూ... పాప అప్పుడు ఇంట్లోనే ఉందా?’’ అని అడిగింది జయ.
‘‘లేదు’’ అంది కమల. ఎవరూ చూడలేదని అనుకుంటాం. కానీ పాప చూసే ఉంటుంది. పిల్లల్ని మనం పిల్లలే కదా అనుకుంటాం. కానీ వాళ్ళు మనకన్నా తొందరగా పసికడతారు.
‘సరే... అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండు. కొంత మార్పు కోసం పాపను మా ఇంటికి తీసుకువెళ్తాను. ఆ తరవాత అవసరాన్ని బట్టి డాక్టర్‌కి చూపెడదాం. రేపు సెకండ్‌ సాటర్‌డే. ఎల్లుండి సండే. సెలవులే కాబట్టి రెండు రోజులు ఉంచుకొని తీసుకువస్తాను’ అంది. జయ మాటను కాదనలేకపోయింది కమల. తను ఏం చేసినా మా మంచి కోరే చేస్తుందనే నమ్మకంతో.
ఇన్నేళ్ళ స్నేహంలో జయ కమల ఇంటికి రావడమే గానీ కమలను ఏనాడూ జయ తనింటికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడేది కాదు. వాళ్ళ ఇంటి పరిస్థితి ఏమిటో అనుకునేదే గానీ జయను తక్కువగా ఏనాడూ అనుకునేది కాదు కమల.

జయ మొదటిసారిగా పింకీని వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. జయకు పాపతో బాగా పరిచయం ఉండడం వలన తనతో పాప ఫ్రీగానే ఉంది. విషయం రాబట్టడంకోసం పాపను మాటల్లోకి దించింది. 
‘‘నువ్వు ఇప్పుడు ఫిఫ్త్‌ స్టాండర్డ్‌ కదా. అర్ధరాత్రి వరకు చదువుతున్నావట. మీ అమ్మ చెప్పింది. మంచి మార్కులు తెచ్చుకుంటే వచ్చే నెల నీ పుట్టినరోజు కదూ! అప్పుడు నీకు నచ్చిన మంచి డ్రెస్‌ కొంటాను. క్రిందటి వారం మీ అమ్మ బర్త్‌డేకి కట్టుకున్న చీర కూడా నేనే కొన్నాను. తెలుసా? ఆ చీర బాగుంది కదూ! నీకు నచ్చిందా?’’ అని అడిగింది జయ.
ఆ చీర మాట విన్న పాప మొహం ఒక్కసారిగా మారిపోయింది. కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఒళ్ళు చిన్నగా వణికిపోతోంది. చెమటలు పోస్తున్నాయి. గొంతు మారిపోయింది. మారిన గొంతుతో ‘‘అబద్ధాలాడకు ఆంటీ! ఆ చీర అమ్మకు అంకుల్‌ కొన్నాడు. మా అమ్మ ఎంత వద్దంటున్నా కట్టుకోమని బలవంతపెట్టాడు. ఆ అంకుల్‌గాడు మంచోడు కాదు. తీరా చీర కట్టుకున్నాక అమ్మ తోసేస్తున్నా బలవంతంగా అమ్మకు ముద్దు పెట్టబోయాడు. గట్టిగా అమ్మను పట్టుకోబోయాడు...
ఛీఛీ... వాడు బేడ్‌ అంకుల్‌. ఆ క్షణం నాకు వాణ్ణి చంపేయాలనిపించింది ఆంటీ’’
‘‘ఆ చీర నీకు నచ్చలేదా?’’ అంది జయ.
‘‘అవునాంటీ. నాకాచీర అస్సలు నచ్చలేదు. అందుకే దాన్ని చింపేసాను’’ అంది కసిగా.
‘‘వాడు మంచోడు కాదు. వాడు మా అమ్మకు పట్టిన దెయ్యం. ఆ దెయ్యం పట్టాకే మా అమ్మ నన్ను పట్టించుకోవడం మానేసింది. ఎంతసేపూ ఫోనే... వాడితో ఫోన్లోనే ఉంటుంది. నాతో మాట్లాడే తీరికే లేదాంటీ.’’
అప్పుడర్థమైంది. పిల్ల మెంటల్‌గా బాగా డిస్టర్బ్‌ అయ్యిందని. అతని పట్ల తను అంత అసహ్యం చూపుతుందంటే, వాడి ప్రవర్తనలో ఏదో విపరీతం ఉండే వుంటుందని ఊహించింది జయ.
‘‘అంకుల్‌ మీ ఇంటికి రోజూ వస్తూంటాడా?’’
‘‘ఏమో... నాకు తెలీదు. నేను చూడలేదు.’’
‘‘నిన్న సాయంత్రం మా ఇంటికొచ్చాడు. మా అమ్మ ఆఫీస్‌ నుంచి వచ్చాక ఏదో పనిమీద బయటికి వెళ్ళింది. మా అమ్మ లేదని చెప్పాను. వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. నేను లేచి వెళ్ళిపోతుంటే వద్దు వద్దంటున్నా వినకుండా బలవంతంగా నన్ను తన ఒళ్ళోకి లాక్కున్నాడు. ఎంత విదిలించుకుందామనుకున్నా వీలు కాలేదు. తన రెండు చేతులతో తాకరాని చోట్ల...’’ అంటూ ముఖం మూసుకొని వెక్కివెక్కి ఏడ్చేసింది.
‘‘ఏడవకు. నేనొచ్చానని మీ అమ్మకు చెప్పకు. నీకేం కావాలన్నా నన్నడుగు. నేనిలా చేశానని మీ అమ్మకే కాదు, ఎవరికీ చెప్పకు. చెబితే మీ అమ్మ నమ్మదు. నేనీసారి వచ్చినప్పుడు నీకేం కావాలో చెప్పాలి. సరేనా? ఎవరికైనా చెప్పావో...జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు’’ అంది పాప.

ఇంతలో కాలింగ్‌ బెల్‌ మోగింది. జయ తలుపులు తెరిచింది. జయ భర్త ఇంట్లోకి వస్తున్నాడు. అతన్ని చూసిన పాప జయకు వెనగ్గా వెళ్ళి జయను గట్టిగా పట్టుకొంది. వణుకుతున్న గొంతుతో ‘‘ఆంటీ వీడే ఆంటీ మా అమ్మకు పట్టిన దెయ్యం. ఈ దెయ్యం నిన్ను కూడా పట్టుకుందా’’ అని అమాయకంగా అడిగింది.
పాప మాటలు విన్న జయ నిలువునా దుఃఖంతో కుంగిపోయింది. రక్తం గడ్డకట్టుకుపోయి జీవచ్ఛవంలా ఉండిపోయింది. తన భర్త సెక్సువల్‌ పెర్వర్ట్‌ అని తెలుసు కాబట్టే, భర్త పోయి ఒంటరిగా ఉంటున్న కమల తన భర్త కంట పడకూడదనే తననింతవరకూ ఇంటికి పిలవలేదు. అయినా జరిగినదానికి కదిలిపోయి కంటనీరు పెట్టుకుంది.
వెంటనే పాపతో ‘‘నీలాగే నాకూ ఈ దెయ్యమంటే కోపం. పద మీ ఇంటికి వెళ్ళిపోదాం’’ అంది జయ. వాళ్ళిద్దరూ కమల ఇంటికి చేరుకున్నాక పింకీతో నీకూ, నాకూ నచ్చని ఆ పసుపు చీరను తీసుకురమ్మని చెప్పింది. పాప తెచ్చిన చీరను తీసుకొని కమల, పింకీ చూస్తుండగా దానిని బయటికి విసిరేసింది. అక్కడితో ఆగక కసితీరా చీరకు నిప్పు పెట్టింది జయ. చీర కాలిపోయింది. బూడిదగా మారిపోయింది. పింకీ బూడిదను తన కాళ్ళతో తొక్కుతూ ‘‘అమ్మా... దెయ్యం చచ్చిపోయింది. చూడమ్మా చూడు దెయ్యం చచ్చిపోయిందమ్మా’’ అంటూ కేరింతలు కొడుతూ ఇక మనకంతా హ్యాపీయేనమ్మా. హ్యాపీయే అంటూ వాళ్ళమ్మను తన రెండు చేతులతో ప్రేమగా చుట్టేసుకుంది.

మరిన్ని వార్తలు